Monday, April 29, 2024

వాహనాలకు వయసు పన్ను!

- Advertisement -
- Advertisement -

Voluntary vehicle scrappage policy

 

ద్విచక్ర వాహనాలు, కార్లు తదితర మోటార్ బళ్లకు గిరాకీ పడిపోయి వాటిని ఉత్పత్తి చేస్తున్న పరిశ్రమ విలవిలలాడుతున్నదని చాలా కాలంగా గగ్గోలు వినిపిస్తున్నది. అలాగే, మోటారు వాహనాలకు సువిశాలమైన భారతీయ మార్కెట్ నుంచి వీలైనంత పిండుకోవాలని దేశీయ, అంతర్జాతీయ కార్ల కంపెనీలు సహజంగానే తహతహలాడుతుంటాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్ 2021- 22 బడ్జెట్‌లో ప్రకటించిన వాహనాల స్వచ్ఛంద విరమణ (తుక్కుగా వదిలించుకోడం) పథకాన్ని ఈ రెండింటి నుంచి పూర్తిగా విడదీసి చూడలేము. అయితే వాతావరణ కాలుష్యాన్ని నివారించడానికి, దేశ ఇంధన దిగుమతుల భారాన్ని తగ్గించడానికి ఈ విధానాన్ని అమలు చేయదలచామని నిర్మలా సీతారామన్ ఘనంగా చెప్పుకున్నారు. అప్పు చేసి అతి కష్టంగా వాహనాలు కొనుక్కునే వారే మన దేశంలో అత్యధిక వాహనదార్లు. బ్యాంకులు ఇచ్చే రుణాలపై టూ వీలర్లు, కార్లు వంటివి కొనుక్కొని వాటికి నెలవారీ కిస్తులు వడ్డీతో సహా సకాలంలో చెల్లించుకోడానికి వారు పడుతున్న బాధలు అందరికీ తెలిసినవే. బయటి వడ్డీ వ్యాపారస్థుల నుంచి తీసుకునే రుణ సాయంతో వాహనాలు కొనుక్కొనే వారు ఆ అప్పు సకాలంలో తీర్చలేని పక్షంలో జప్తులకు కూడా గురై కుమిలిపోయే సందర్భాలు అనేకం.

వాయు తగ్గరాదని ఎవరూ అనరు, అలాగే దేశ ఆర్థిక వ్యవస్థపై క్రూడాయిల్ దిగుమతి భారం పరిమితం కారాదని కూడా ఎవరూ కోరుకోరు. కాని కొండ నాలుకకు వేసే మందు ఉన్న నాలుకను ఊడబెరకరాదనేదే అందరి ఆకాంక్ష. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టే ముందు ఈ కోణంలో తగినంతగా ఆలోచించలేదని అనిపిస్తే ఆక్షేపించవలసిన పని లేదు. సంపన్న దేశాల్లో మాదిరిగా ఒక ఇంటికి ఒకటికి మించి కార్లుండడం, కొత్త రకం కారు మార్కెట్‌లోకి రాగానే కొని తెచ్చుకోడం మన దేశంలో అరుదు. ముఖేశ్ అంబానీ వంటి విశ్వ ఐశ్వర్యవంతుడికి సొంతానికి 150పైగా కార్లు ఉండవచ్చు. అలాగే అనేక మంది శ్రీమంతులకు 5 నుంచి 10 వరకు ఉండడం సహజం. దూర భారాన్ని తట్టుకోలేక అవసరం కోసం మోటారు వాహనాలు కొనుక్కొనే లక్షలాది మందికి తరచూ వాటిని మార్చుకోవలసి రావడమనేది తలకు మించిన భారమే.

మన దేశంలో గల మరమతుదార్లు (మెకానిక్కులు) మోటారు వాహనాలను పూర్తిగా తనిఖీ చేసి అందుబాటులోని ఖర్చుకే వాటిని బాగు చేయగల సామర్థం అసాధారణంగా ఉన్న వారని చెప్పడానికి వెనుకాడవలసిన పని లేదు. ఆ సౌకర్యాన్ని వినియోగించుకొని కాలుష్య విసర్జన లేని విధంగా వాహనాలను చిరకాలం ఉపయోగించుకుంటున్న జనం మన వద్ద అసంఖ్యాకంగా ఉన్నారు. వారి మీద కొత్త విధానాన్ని రుద్దితే అది వారు సొంత మోటారు వాహనాలను శాశ్వతంగా వదిలేసి ప్రజా రవాణాను ఆశ్రయించేలా చేస్తుందే గాని కంపెనీలకు కాసులు కురిపించేలా కొత్త వాటి విక్రయాన్ని విశేషంగా పెంచదు. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం మోటారు వాహనాలపై నామ మాత్రమైన కాల దోషపు పన్ను విధింపు అధికారం రాష్ట్రాల వద్ద ఉన్నది. దానిని కూడా పరిమిత స్థాయిలోనే విధిస్తున్నారు. కేంద్రం ఈ పన్ను విధింపు అధికారాన్ని స్వాధీనం చేసుకుంటే రాష్ట్రాల హక్కుల హరణంలో మరో అధ్యాయం తెరుచుకుంటుంది.

నిర్మలా సీతారామన్ ప్రకటించిన పద్ధతి ప్రకారం వ్యక్తిగత వాహనాలు 15 సంవత్సరాలు దాటినవైతే వాటి బాట సుంకం (రోడ్డు టాక్స్)లో 10 నుంచి 25 శాతం మొత్తాన్ని హరిత పన్నుగా చెల్లించాలి. 8 సంవత్సరాలు నిండిన రవాణా వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు వాటి స్థాయిని బట్టి మూడు మాసాల రోడ్డు ట్యాక్స్‌లో 10 నుంచి 25 శాతం హరిత పన్నును వసూలు చేస్తారు. వాహనాల వయసు బాగా మీరిపోతే వాటిని తుక్కు కింద ఇచేయాలన్నది మరో నిబంధన. ఇలా బండి లక్షణంగా నడుస్తున్నప్పటికీ, హాయిగా ఉపయోగపడుతున్నప్పటికీ దాని వయసు ఆధారంగా వదులుకొని కొత్త వాహనం కొనుక్కోక తప్పని పరిస్థితుల్లోకి వాహనదార్లను నెట్టివేయడం ఏ విధంగా చూసినా సహేతుకం అనిపించడం లేదు. దేశంలో 20 ఏళ్ల పైబడిన చిన్న మోటారు వాహనాలు 51 లక్షల వరకు ఉంటాయని, 15 ఏళ్లు మించిన వాణిజ్య వాహనాలు 17 లక్షల వరకు ఉంటాయని వీటికి తగిన అర్హత (ఫిట్‌నెస్) పత్రాలు లేవని కేంద్ర రోడ్డు రవాణ మంత్రి నితిన్ గడ్కరీ తెలియజేశారు.

వీటి వల్లనే వాహన కాలుష్యం కలుగుతున్నదని అన్నారు. అటువంటప్పుడు ఆ వాహనాలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో వాహనదార్లకు మితిమించిన భారం అనిపించని రీతిలో పన్ను వసూలు చేయించితే ఫర్వాలేదు. అయినా ముక్కు పిండి పన్ను వసూలు చేసినంత మాత్రాన కాలుష్యం మాయమవుతుందా? ప్రజల కొనుగోలు శక్తిని బట్టి ఒక పద్ధతి ప్రకారం వారు కొత్త వాహనాలకు మళ్లే విధానాన్ని రూపొందించడం పాత వాహనాలకు తగిన విలువ నగదు రూపంలో అందేలా చేయడం వంటి చర్యలు కొంత వరకు ప్రయోజనం కలిగించవచ్చు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News