Sunday, April 28, 2024

కాంగ్రెస్ ఓ పాత మంచం.. శబ్దాలు ఎక్కువ

- Advertisement -
- Advertisement -

Why is the old cot making a noise says Shiv Sena

అసమ్మతి స్వరాలు ఆ పార్టీ చరిత్ర
ఎప్పుడు ఎటువైపు మొగ్గుతారో వారికి బాగా తెలుసు
మహా సర్కారులో కాంగ్రెస్ మూడో స్తంభం
కూటమి కోసం చాలా త్యాగాలు చేశాం
అయితే..సంకీర్ణానికి వచ్చిన ముప్పేమీ లేదు
‘సామ్నా’లో శివసేన విసుర్లు

ముంబయి: మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వంలో తమ కు తగిన ప్రాబల్యం లేకపోవడంపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులలో అసంతృప్తి నెలకొన్నట్లు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఆ పార్టీని కిరకిరలాడే పాత మం చంగా శివసేన అభివర్ణించింది. అయితే రాష్ట్రంలో మహా వికాస్ అఘాది(ఎంవిఎ) ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని కూటమిలో భాగస్వామ్యపక్షమైన శివసేన స్పష్టం చేసింది. తన అధికార పత్రిక సామ్నాలో మంగళవారం ప్రచురితమైన సంపాదకీయంలో శివసేన ఈ వ్యాఖ్యలు చేసింది. భిన్న సిద్ధాంతాలతో కూడిన పార్టీలతో ఏర్పడిన కూటమిలో అసంతృప్తి సహజమేనని కూడా శివసేన వ్యాఖ్యానించింది. అయితే, శివసేన వ్యాఖ్యలను కాంగ్రెస్ తోసిపుచ్చింది.

తప్పుడు సమాచారం ఆధారంగానే సామ్నా ఈ వ్యాఖ్యలు చేసిందని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలాసాహెబ్ తోరట్ పేర్కొన్నారు. కాంగ్రెస్ చాలా పురాతన పార్టీ అని, అసమ్మతి స్వరాలు ఎక్కువగా ఉండే చరిత్ర ఆ పార్టీదని సామ్నా వ్యాఖ్యానించింది. మంచం చాలా పాతది. తరచు కిరకిరలాడుతుంటుంది. పాత మంచమైనా దానికో ఘనమైన చరిత్ర ఉంది. మంచం పైన చాలా మంది(నాయకులు) ఉన్నారు. వారు తమ వైఖరిని మార్చుకుంటూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ లేదా ఎన్‌సిపి(శరద్ పవార్ నాయకత్వం)లో ఆరితేరిన నాయకులు ఉన్నారు. ఎప్పుడు అసమ్మతి బయటపెట్టాలో, ఎప్పుడు ఏ వైపు మొగ్గాలో వారికి బాగా తెలుసు అంటూ సామ్నాలో శివసేన వ్యంగ్యాస్త్రాలు సంధించింది. వైఖరులు మార్చుకునేవారు కాంగ్రెస్‌లో చాలామంది ఉన్నారని, ఈ కారణంగానే ఆ పార్టీలో అసమ్మతి రాగాలు వినిపిస్తున్నాయని సామ్నా అభిప్రాయపడింది.

కూటమిలో ఇటువంటి అసమ్మతి రాగాలను భరించడానికి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే సిద్ధంగా ఉండాలని కూడా సలహా ఇచ్చింది. అయితే ఎంవిఎ ప్రభుత్వం కూలిపోతుందని ఎవరూ ఆలోచించవలసిన అవసరం లేదు. మరోసారి తెల్లవారుజామున తమ కోసం రాజ్‌భవన్ గేట్లు తెరుచకుంటాయని ఎవరూ ఊహించవద్దు అంటూ శివసేన పరోక్షంగా బిజెపికి చురకలు అంటించింది. గత ఏడాది నవంబర్‌లో బిజెపి-శివసేన మధ్య అధికార పంపకంపై ప్రతిష్టంభన ఏర్పడిన సందర్భంలో బిజెపి నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, ఎన్‌సిపి నాయకుడు అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా తెల్లవారుజామున రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేసిన ఉదంతం తెలిసిందే.

ఇదిలా ఉండగా, ప్రభుత్వ నిర్ణాయక ప్రక్రియలో తమకు అధిక భాగస్వామ్యం కల్పించాలని కాంగ్రెస్ నాయకులు ఇటీవల కోరుతున్నారు. కరోనా వైరస్ విజృంభన, నిసర్గ తుపాను బాధితులకు సహాయక చర్యలు తదితర ముఖ్యమైన సమస్యలపై ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్‌తో చర్చలు జరుపుతున్నారే తప్ప తమను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ కోటాలో శాసన మండలికి నియమించే 12 మంది సభ్యుల పేర్లను ఖరారు చేసేందుకు మూడు పార్టీలతో సమావేశాన్ని త్వరితంగా నిర్వహించాలని కూడా కాం గ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి థాక్రేను కోరుతున్నారు.దీనిపై కూడా సామ్నా తన సంపాదకీయంలో ప్రస్తావించింది. అసెంబ్లీలో సంకీర్ణ ప్రభుత్వంలోని ఒక్కో పార్టీ బలాన్ని బట్టి 12 మంది కౌన్సిల్ సభ్యుల లో ఏ పార్టీ వాటా ఎంతో తేలుతుంది. శివసేనకు 56 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఎన్‌సిపి 54 మంది ఉన్నారు.

కాంగ్రెస్‌కు 44 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్‌ను మూడవ స్తంభంగా వర్ణించిన శివసేన త్రిపక్ష ఒప్పందంలో శివసేన చాలా త్యాగం చేయవలసి వచ్చిందని సామ్నా వ్యాఖ్యానించింది. కాంగ్రెస్‌కు అసెంబ్లీ స్పీకర్ పదవి కేటాయించడంపై ఎన్‌సిపి అధినేత శరద్ పవార్ అభ్యంతరం తెలిపిన సందర్భంలో ఒక మంత్రి పదవిని శివసేన త్యాగం చేయవలసి వచ్చిందని సామ్నా గుర్తు చేసింది. ఒక మంత్రి పదవి స్థానంలో అదనంగా రెండు మంత్రి పదవులను కాంగ్రెస్‌కు ఇవ్వవలసి వచ్చిందని కూడా సామ్నా వ్యాఖ్యానించింది. కాగా.. ఈ వ్యాఖ్యలు అసంపూర్ణ సమాచారం ఆధారంగా సామ్నా చేసిందని పిసిసి అధ్యక్షుడు తోరట్ వివరించారు. వ్యాఖ్యల వల్ల తమ పార్టీపై ప్రజలలో తప్పుడు అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాము సంకీర్ణ ప్రభుత్వానికే కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News