Saturday, April 27, 2024

మహిళల టి-20 ప్రపంచకప్‌కు సర్వం సిద్ధం

- Advertisement -
- Advertisement -

Womens T20 World Cup

 

సిడ్నీ: మహిళల ట్వంటీ20 ప్రపంచకప్‌కు సర్వం సిద్ధమైంది. ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న ఈ మెగా టోర్నమెంట్‌లో మొత్తం పది జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఈసారి కూడా డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. అయితే భారత్, ఇంగ్లండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్లతో ఆస్ట్రేలియాకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్ జట్లు కూడా ట్రోఫీపై కన్నేశాయి. గతంతో పోల్చితే భారత్ ఈసారి చాలా బలంగా కనిపిస్తోంది. కొన్నేళ్లుగా భారత్ మహిళల క్రికెట్‌లో బలమైన శక్తిగా ఎదిగింది. దీంతో ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో భారత్ భారీ ఆశలు పెట్టుకుంది. ఇంగ్లండ్ కూడా బలంగా ఉంది. ఇక, పసికూన థాయిలాండ్ కూడా ప్రపంచకప్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా థాయిలాండ్ వరల్డ్‌కప్‌కు అర్హత సాధించింది.

మరోవైపు బంగ్లాదేశ్ కూడా క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల ద్వారా ప్రపంచకప్ బెర్త్‌ను దక్కించుకుంది. కాగా, వరల్డ్‌కప్‌లో పాల్గొంటున్న జట్లను ఎ, బి గ్రూపులుగా విభజించారు. గ్రూప్‌ఎలో ఆతిథ్య ఆస్ట్రేలియాతో పాటు భారత్, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. గ్రూప్‌బిలో మాజీ ఛాంపియన్‌లు ఇంగ్లండ్, వెస్టిండీస్‌లతో పాటు దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, థాయిలాండ్ జట్లకు చోటు కల్పించారు. ఫిబ్రవరి 21న సిడ్నీ వేదికగా భారత్‌ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో ఏడో మహిళల టి20 ప్రపంచకప్‌కు తెరలేస్తుంది. మార్చి 8న జరిగే ఫైనల్‌తో ప్రపంచకప్‌కు తెరపడుతుంది. ప్రపంచకప్‌లో భాగంగా మొత్తం 23 మ్యాచ్‌లు జరుగుతాయి. లీగ్ దశలో ప్రతి జట్టు తన గ్రూప్‌లోని జట్టుతో తలపడుతోంది. ప్రతి గ్రూప్ నుంచి అగ్రస్థానంలో నిలిచే రెండేసి జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.

సెమీఫైనల్ మ్యాచ్‌లు మార్చిన 5న సిడ్నీలో జరుగుతాయి. ఒకే రోజు రెండు సెమీఫైనల్ మ్యాచ్‌లను నిర్వహిస్తారు. ఇక, మార్చి 8న ఆదివారం జరిగే ఫైనల్ సమరానికి చారిత్రక మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా నిలువనుంది. ఇదిలావుండగా ఫిబ్రవరి 21న ప్రారంభమయ్యే లీగ్ మ్యాచ్‌లు మార్చి రెండున ముగుస్తాయి. చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాన్యూజిలాండ్ జట్లు తలపడుతాయి. ఇక, గ్రూప్‌ఎలో భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య సెమీస్ కోసం గట్టి పోటీ ఖాయంగా కనిపిస్తోంది. ఆస్ట్రేలియా సెమీస్ చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే రెండో బెర్త్ కోసం కివీస్‌భారత్ మధ్య గట్టి పోటీ నెలకొంది. భారత్‌తో పోల్చితే కివీస్ బలంగా కనిపిస్తోంది. కానీ, కొంతకాలంగా ప్రపంచ క్రికెట్‌లో భారత్ కూడా నిలకడైన విజయాలు సాధిస్తోంది. ఇటీవలే జరిగిన మహిళల ముక్కోణపు టి20 టోర్నీలో భారత్ రన్నరప్‌గా నిలిచింది. టోర్నీలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి అగ్రశ్రేణి జట్లను ఓడించింది.

ఫైనల్లో కూడా చివరి వరకు గట్టిగా పోరాడింది. ఈసారి భారత్ భారీ ఆశలతో పోరుకు సిద్ధమైంది. మరోవైపు గ్రూప్‌బిలో మాత్రం ఇంగ్లండ్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్ల మధ్య రెండో బెర్త్ కోసం తీవ్ర పోటీ ఖాయమనే చెప్పాలి. ఇరు జట్లలో కూడా ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదు. దీంతో సెమీస్ సమరం కోసం హోరాహోరీ తప్పక పోవచ్చు. ఇక, పాకిస్థాన్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. కానీ, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, విండీస్‌లను వెనక్కి నెట్టి సెమీస్ బెర్త్‌ను సొంతం చేసుకోవడం పాకిస్థాన్‌కు దాదాపు అసాధ్యమనే చెప్పాలి.

ఎదురులేని ఆస్ట్రేలియా
ఇక, మహిళల ట20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాకు తిరుగులేని రికార్డు ఉంది. ఇప్పటి వరకు ఆరు టి20 ప్రపంచకప్‌లు జరుగగా ఆస్ట్రేలియా ఏకంగా నాలుగు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. మరోసారి రన్నరప్‌ను సాధించింది. దీన్ని బట్టి టి20 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా ఎలాంటి ఆధిపత్యం చెలాయిస్తుందో ఊహించుకోవచ్చు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే క్రికెటర్లకు ఆస్ట్రేలియాలో కొదవలేదు. దీంతో ప్రతి టోర్నీలోనూ ఆస్ట్రేలియా చిరస్మరణీయ ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఇక, సొంత గడ్డపై జరుగుతున్న ఈ ప్రపంచకప్‌లో కూడా ఆస్ట్రేలియా ట్రోఫీపై కన్నేసింది. ఈసారి కూడా కూడా గెలిచి తన ఖాతాలో ఐదో ట్రోఫీని జత చేసుకోవాలని తహతహలాడుతోంది.

భారీ ఆశలతో భారత్
మరోవైపు భారత మహిళా జట్టు ఈసారి భారీ ఆశలతో ప్రపంచకప్‌కు సిద్ధమైంది. ఇప్పటి వరకు మూడు సార్లు సెమీఫైనల్‌కు చేరుకున్న భారత్ ఒక్కసారి కూడా ఫైనల్‌కు అర్హత సాధించలేక పోయింది. ఈ వరల్డ్‌కప్‌లో ఆ లోటును పూడ్చుకోవాలని భావిస్తోంది. ఇటీవల కాలంలో భారత్ చిరస్మరణీయ విజయాలు సాధిస్తూ అగ్రశ్రేణి జట్లలో ఒకటిగా ఎదిగింది. ఈసారి ఎలాగైన ప్రపంచకప్‌ను గెలిచి చరిత్ర సృష్టించాలని తహతహలాడుతోంది. స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్, సఫాలీ వర్మ, వేదా కృష్ణమూర్తి, శిఖా పాండే, దీప్తి శర్మ, పూనమ్ యాదవ్ తదితరులతో భారత్ చాలా బలంగా ఉంది.

ఎటువంటి జట్టునైనా ఓడించే సత్తా ప్రస్తుత జట్టుకు ఉంది. దీంతో భారత్ కూడా టోర్నీ ఫేవరెట్లలో ఒకటిగా చెప్పక తప్పదు. ఇక, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లకు కూడా ప్రపంచకప్ గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయి. రెండు జట్లలోనూ ప్రపంచ స్థాయి క్రికెటర్లు ఉన్నారు. ఎటువంటి జట్టునైనా చిత్తుగా ఓడించే సత్తా ఈ రెండు జట్లకు ఉంది. వెస్టిండీస్, సౌతాఫ్రికాలను కూడా తక్కువ అంచన వేయలేం. అయితే బలమైన జట్లను వెనక్కినెట్టి ట్రోఫీని సాధించడం ఈ జట్లకు దాదాపు అసాధ్యమనే చెప్పక తప్పదు.

Womens T20 World Cup is ready
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News