Monday, April 29, 2024

ఈసారీ చాంపియన్లు కంగారూలే

- Advertisement -
- Advertisement -

Womens T20 world cup

 

ఐదో సారి ప్రపంచకప్‌ను ముద్దాడిన ఆసీస్ మహిళలు n ఫైనల్లో బోల్తాపడిన హర్మన్ సేన n 85 పరుగులు తేడాతో ఘోర పరాజయం

మెల్‌బోర్న్: టోర్నీ ఆరంభంనుంచి అప్రతిహత విజయాలతో ఫైనల్‌కు దూసుకు వచ్చిన భారత మహిళా క్రికెట్ జట్టు తుది మెట్టుపై బోల్తాపడింది. మెల్‌బోర్న్ వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో 85 పరుగుల తేడాతో టీమిండియా ఘోర పరాజయాన్ని చవి చూసింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో విఫలమై తొలి కప్‌ను ముద్దాడే అవకాశాన్ని కోల్పోయింది. ఫలితంగా ఆసీస్ అయిదో సారి చాంపియన్‌గా నిలిచి రికార్డు సృష్టించింది. తొలుత బ్యాట్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగుల భారీ స్కోరు చేసింది.

స్టార్ బ్యాటర్ అలెస్సా హీలీ (39 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 75పరుగులు), మరో ఓపెనర్ బెత్ మూనీ (54 బంతుల్లో 10 ఫోర్లతో 78 నాటౌట్) అర్ధ సెంచరీలతో రాణించడంతో ఆసీస్ భారీ స్కోరు చేసింది. టీమిండియా ఫీల్డింగ్ లోపాలు కూడా వారికి కలిసి వచ్చాయి. అనంతరం బరిలోకి దిగిన బారత్ 19.1 ఓవర్లలోనే 99 పరుగులకే కుప్పకూలింది. దీప్తి శర్మ చేసిన 33 పరుగులే జట్టులో అత్యధిక స్కోరు కావడం గమనార్హం. ఆసీస్ బౌలర్లలో షట్ కేవలం 18 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి భారత్ వెన్ను విరచగా, జొనాసెన్ 20 పరుగులకు 3 వికెట్లు పడగొట్టి రాణించింది.

బ్యాటర్ల విఫలం
బౌలింగ్‌లో సత్తా చాటలేకపోయిన వేళ.. భారత బ్యాటర్లు గట్టిగా పోరాడాల్సి ఉండగా వరసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. టోర్నమెంట్ చివరిదాకా సూపర్ ఫామ్‌లో ఉండిన షెఫాలీ(2) షట్ బౌలింగ్‌లో కీపర్ హీలీ చేతికి చిక్కింది. వన్‌డౌన్‌లో వచ్చిన తానియా తలకు బంతి తగిలి గాయం కావడంతో రెండో ఓవర్‌లోనే రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన జెమిమా పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరింది. అవతలి ఎండ్‌లో ఉన్న మరో ఓపెనర్ స్మృతి వరసగా రెండు ఫోర్లు బాది ఆశలు రేకెత్తించినప్పటికీ ఆ తర్వాత కొద్ది సేపటికే 11 పరుగులకే పెవిలియన్ దారి పట్టింది. క్లిష్ట పరిస్థితుల్లో నిలబడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతుందనుకున్న కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కూడా నాలుగు పరుగులకే వెనుదిరిగింది.

దీంతో భారత్ 5.4 ఓవర్లలోనే 30 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన వేదా(24 బంతుల్లో 19)తో కలిసి దీప్తి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసింది. అయితే వీరిద్దరూ నిదానంగా ఆడుతుండడంతో కావలసిన రన్‌రేట్ భారీగా పెరిగిపోయింది. పరుగుల వేగం పెంచే క్రమంలో దీప్తి ఔటవగా, ఆ తర్వాత కొద్ది సేపటికే వేదా కూడా పెవిలియన్ చేరింది. చివర్లో శిఖా పాండే 18 బంతుల్లో 18 పరుగులు చేయడంతో భారత్ 99 పరుగులు మాత్రమే చేయగలిగింది. టీమిండియా ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్స్ కూడా లేకపోవడం గమనార్హం. ఛేదనలో ఏ దశలోను హర్మన్ సేన ఆసీస్‌పై ఆధిక్యత కనబర్చకపోవడం గమనార్హం.

ఓపెనర్ల శుభారంభం
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు. భారత ఫీల్డర్ల తప్పిదాలతో ఔట్‌అయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్నఅలిస్సా హీలీ, బెత్ మూనీలు అర్ధ శతకాలతో రాణించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు శతక భాగస్వామ్యం (115) నమోదు చేశారు. హీలీ ఆదినుంచి సిక్పర్లు, బౌండరీలతో భారత బౌలర్లపై విరుచుకుపడగా, మూనీ మాత్రం కాస్త సంయమనంతో ఆడింది. హీలీ జోరు చూస్తే శతకం చేస్తుందేమోననిపించింది. అయితే రాధా ఆమెను బోల్తా కొట్టించి ఆసీస్ జోరుకు బ్రేక్ వేసింది. ఆ తర్వాత వచ్చిన మెక్‌లానింగ్ (16), ఆష్లీ (2),రేచల్(4)లు ఎక్కువ సేపు క్రీజులో నిలవలేక పోయారు. ఓ వైపు సహచరులంతా పెవిలియన్‌కు క్యూ కడుతున్నా మూనీ మాత్రం చెక్కు చెదరకుండా బ్యాట్ ఝళిపించింది. చివరిదాకా క్రీజులో నిలబడి జట్టు స్కోరును 184 పరుగులకు చేర్చింది. కాగా మెరుపు వేగంతో 75 పరుగులు చేసిన అలిస్సా ప్లేయర్ ఆఫ్ ది మాచ్ అవార్డు దక్కగా, బెత్ మూనీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా ఎంపికయింది.

Womens T20 world cup winner Australia
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News