Monday, April 29, 2024

రిటైర్డ్ ఆర్‌టిసి ఉద్యోగుల సంక్షేమానికి కృషి

- Advertisement -
- Advertisement -

టిఎస్ ఆర్‌టిసి ఎండి విసి సజ్జనార్ వెల్లడి

మన తెలంగాణ / హైదరాబాద్ : రిటైర్డ్ ఆర్‌టిసి అధికారులు, సిబ్బంది సంక్షేమానికి టిఎస్ ఆర్‌టిసి యాజమాన్యం కట్టుబడి ఉందని ఆ సంస్థ ఎండి విసి సజ్జనార్ తెలిపారు. దీనికోసం ప్రభుత్వ సహకారంతో కృషి చేస్తామని అన్నారు. ప్రజా రవాణా వ్యవస్థ బాగుకోసం రిటైర్డ్ ఉద్యోగులు అకుంఠిత దీక్షతో నిబద్దత, క్రమ శిక్షణతో చేసిన సేవలు గొప్పవని ఆయన కొనియాడారు. హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో స్టేట్ రోడ్డు ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్స్ రిటైర్డ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆదివారం నిర్వహించిన ఐదో వార్షిక సమావేశానికి సజ్జనార్ ముఖ్య అతిథిగా హాజరైనారు. 75 ఏండ్లు నిండిన 41 మంది విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగులను ఆయన ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. అనంతరం సజ్జనార్ మాట్లాడుతూ రిటైర్డ్ ఆర్‌టిసి ఉద్యోగుల సలహాలు, సూచనలతో సంస్థలో ఎన్నో వినూత్న కార్యక్రమాలను ప్రవేశపెట్టామని తెలిపారు.

ఆర్‌టిసి రెగ్యులర్ అధికారులు, సిబ్బందితో పాటు రిటైర్డ్ ఎంప్లాయిస్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని.. టిఎస్‌ఆర్‌టిసి తార్నాక ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. తార్నాక ఆస్పత్రిలో ఒక్క గుండె సంబంధిత సర్జరీలు తప్ప మిగతా అన్ని వైద్య సేవలను అందిస్తున్నామని వివరించారు. రిటైర్డ్ ఎంప్లాయిస్‌కు లైఫ్ టైం ఐడీ కార్డులను సంస్థ మంజూరు చేసిందని, స్పౌస్ తో పాటు రిటైర్డ్ ఎంప్లాయిస్‌కి ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించినట్లు వివరించారు. ఉమ్మడి ఆర్టీసీలో రిటైరైన ఎంప్లాయిస్‌కు డీలక్స్ బస్సుల వరకు ఇంటర్ స్టేట్‌లో ఉచితంగా ప్రయాణించే వెసులుబాటును కల్పించామని తెలిపారు. పదవీ విరమణ పొందగానే సెటిల్ మెంట్ డ్యూస్ ని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో తమ సమస్యలను రిటైర్డ్ ఆర్‌టిసి అధికారులు సంస్థ ఎండి విసి సజ్జనార్ దృష్టికి రాగా.. వాటిని ప్రభుత్వ సహకారంతో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News