Monday, April 29, 2024

గండం గడిచినా.. వీడని జలదిగ్బంధం

- Advertisement -
- Advertisement -

 గోషామహల్ డివిజన్ కొత్తబస్తీలో కూలిన పాతభవనం
 పాతబస్తీ కామాటిపురాలో కూలిన పురాతన ఇళ్లు.. తప్పిన ప్రమాదం
 బేగంబజార్‌లో ఓ పురాతన భవనాన్ని జేసీబీతో నేలమట్టం చేసిన జీహెచ్‌ఎంసీ అధికారులు
 శాంతించు గంగమ్మా.. మూసీ నదికి బోనం, పట్టు వస్త్రాల సమర్పణ
 ఎట్టకేలకు తెరుచుకున్న జీడిమెట్ల ఫాక్స్ సాగర్ చెరువు తూము
 మంజీరా వరద ఉద్ధృతిలో చిక్కుకున్న మత్సకారులను రక్షించిన రెస్యూటీమ్…

మన తెలంగాణ/హైదరాబాద్: అల్పపీడనం ప్రభావంతో భాగ్యనగరంతో సహా రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు హైదరాబాద్ వాసుల గుండెల్లో మళ్లీ గుబులు రేపుతున్నాయి. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాగల 24 గంటల్లో వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకురాలు నాగరత్నం తెలిపారు. రాగల 24 గంటల పాటు రాష్ట్రంలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, నేటి నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నందున ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు. ఈ నెల 13వ తేదీ నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వేలాది సంఖ్యలో కాలనీలు నీటమునిగాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. పాతబస్తీ జలదిగ్బంధంలోనే కొనసాగుతోంది. ప్రధానంగా లోతట్టు కాలనీల్లో ముంపు కష్టాలు వీడటం లేదు. సరూర్‌నగర్‌లోని పలు కాలనీలు ఇంకా వరద గుప్పిట్లోనే కొనసాగుతున్నాయి. తగ్గిందనుకునే లోపే మళ్లీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. తమను ఆదుకునే వారు లేరంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా కురుస్తున్న వర్షాలు భాగ్యనగర వాసుల జీవితాన్ని మరింత అల్లకల్లోలానికి గురిచేస్తున్నాయి. జోరు వానలతో సరస్వతీనగర్, సింగరేణి కాలనీలలో వరదనీరు వచ్చి చేరుతోంది. వర్షం కారణంగా పురాతన ఇళ్లు గోడలు కూలుతున్నాయి. పాతబస్తీ కామాటిపురా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ పురాతన ఇళ్లు కూలింది. ఇంట్లో నివాసం ఉండే ఇద్దరికి ప్రమాదం తప్పింది. బుధవారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇంటి పైకప్పు నుంచి మట్టి రాలడాన్ని ఇంట్లో అద్దెకు వుండే ఓ వ్యక్తి గమనించాడు. దీంతో అప్రమత్తమై బయటకు పరుగులు పెట్టడంతో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. గోషామహల్ డివిజన్ కొత్త బస్తీలోని ఆర్య సమాజం వద్ద ఓ పాతభవనం కుప్పకూలింది. ఇంటి యజమాని పూజ చేసి బయటకు వస్తున్న సమయంలో ఒక్కసారిగా కూలినట్లు బాధితులు తెలిపారు. ఇంట్లో ఎవ్వరూ లేని కారణంగా పెద్ద ప్రమాదం తప్పిందంటున్నారు. స్వల్ప ఆస్తి నష్టం సంభవించింది. మరోవైపు భారీ వర్షాల కారణంగా ముందస్తు చర్యల్లో భాగంగా పురాతన భవనాలను జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. నగరంలో పురాతన భవనాలను గుర్తించి వాటిని కూల్చివేస్తున్నారు. అందులో భాగంగా బేగంబజార్‌లోని ఓ పురాతన భవనాన్ని బుధవారం అధికారులు జేసీబీతో పడగొట్టారు. చెరువులు, కుంటలను కబ్జా చేసి ఇళ్లు నిర్మించుకోవటం.. నాలాల ఆక్రమణే వరద ముంపునకు కారణమని ప్రధాన కారణమని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు. తార్నాక డివిజన్ లాలాపేటలోని సత్యనగర్, సిబిఎన్ నగర్, కృష్ణానగర్ కాలనీ, మహేంద్ర హిల్స్ కాలనీల్లో నాలాలు పొంగిపొర్లుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. తమ ఇళ్లు, ఆస్తులకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న నాలాలు ఇప్పుడున్న జనాభాకు అనుగుణంగా లేవని తెలిపారు. వాటిని వెడల్పు చేయడం, పూడిక తీయడం, సామర్థం పెంపుతో పాటు నాలాల ఆక్రమణలు, చెరువుల కబ్జాను అరికట్టడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నారు. నల్లకుంటలోని పద్మాకాలనీ ప్రజలు నిరసనకు దిగారు. నాలా ఆక్రమణల వల్ల వరద ముంపునకు గురైన ఆస్తి, ప్రాణనష్టం జరుగుతుందని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు.

నగరంలో కురిసిన భారీ వర్షాలకు పద్మకాలనీ, నల్లకుంట, నాగమయ్యకుంట, రాంనగర్ తదితర ప్రాంతాలు ప్రజలు వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నల్లకుంటలోని వెజిటబుల్ మార్కెట్ పక్క వీధిలో ఓ భవన యజమాని నాలాను ఆక్రమించి నిర్మాణం చేపట్టడం వల్లే ఈ ప్రాంతాలు వరద ముంపుకు గురవుతున్నాయని ఆరోపించారు. నాలాల ఆక్రమణలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. భారీ వర్షాల కారణంతో 185 చెరువులు పూర్తిస్థాయిలో నిండగా…53 చెరువులు దెబ్బతిన్నాయి. బండ్లగూడ, మన్సూరాబాద్, మూసాపేట చెరువులు తెగాయనే వార్తల్లో నిజం లేదని అధికారులు స్పష్టీకరిస్తున్నారు. జీడిమెట్ల ఫాక్స్ చెరువు తూము రెండ్రోజుల పాటు శ్రమించిన అనంతరం తెరుచుకుంది. సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు నిపుణులు తూము తెరవగలిగారు. అంతకు ముందు జీడిమెట్ల ఫాక్స్ సాగర్ చెరువు పూర్తిస్థాయిలో నిండటం వల్ల తూము తెరిచేందుకు అధికారులు విశ్వప్రయత్నం చేశారు. భారీ వర్షాలకు, వరదలకు ఉస్మాన్‌సాగర్‌లో ఇళ్లు నీట మునిగాయి. వరద నీరు తొలగించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. మరోవైపు మూసీ నది మహోగ్రరూపం దాల్చి అనేక ప్రాంతాలపై విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. ఇటీవల కురిసిన అతి భారీ వర్షాలకు మూసీ నదీ పోటెత్తింది. దాంతో మూసీ పరివాహక ప్రాంతం వరద గుప్పిట్లో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో మూసీ నది శాంతించాలంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తదితరులు పురానాపూల్ వద్ద మూసీ నదికి శాంతి పూజలు నిర్వహించారు. గంగమ్మతల్లికి బోనం సమర్పించడంతో పాటు పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమ, పూలు నివేదించారు. కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, 1908లోనూ భారీ వరదలు సంభవించడంతో నాటి నిజాం పాలకుడు మీర్ మహబూబ్ అలీఖాన్ కూడా మూసీనదికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత మూసీ నదికి అంతటి స్థాయిలో వరదలు రావడం మళ్లీ ఇదే ప్రథమం. హైదరాబాద్ చరిత్రలో రెండో అతి పెద్ద వాన కాగా, 1908 తర్వాత హైదరాబాద్ నగరంలో తొలిసారి ఇంత భారీస్థాయిలో వర్షం పడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ ఎత్తున పంట నష్టం జరిగింది. సుమారు 70 మంది ప్రజలు వరదల కారణంగా మృతి చెందారు. 37 వేల కుటుంబాలు ముంపు బారిన పడ్డాయి.

Minister Talasani Offering Bonam to Gangamma Thalli

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News