Monday, April 29, 2024

మరో మూడు రోజులు ముప్పే!

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం

అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం : వాతావరణ శాఖ ప్రకటన

రంగంలోకి పర్యాటక శాఖ బోట్లు
సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్న వివిధ విభాగాల సిబ్బంది
ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచన

మన తెలంగాణ/హైదరాబాద్:మంగళవారం ఉదయం 8.30 గంటలకు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొన్నారు. అల్పపీడనానికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అది మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని చెప్పారు. రాగల 48 గంటల్లో ఉపరితల ఆవర్తనం వాయువ్య దిశగా ప్రయాణిస్తుందని రాబోయే మూడు రోజుల్లో ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణిస్తుందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో తెలంగాణతో పాటు ఏపిలోనూ అక్కడక్కడ భారీ వర్షాలు, పలు చోట్ల మోస్టరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని వివరించింది. రాష్ట్రానికి వాతావరణ శాఖ అరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
అలర్ట్‌గా ఉండండి.. అవసరమైతేనే బయటకు రండి: సజ్జనార్
హైదరాబాద్‌లో వరదలపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను నమ్మవద్దని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రజలను కోరారు. సైబరాబాద్ పరిధిలో ఇప్పటివరకూ ముంపునకు గురైన మైలార్‌దేవ్‌పల్లిలోని పలు కాలనీలలో.. సహాయక చర్యలు చేపట్టామని సీపీ తెలిపారు. రాజేంద్రనగర్ అప్ప చెరువుకు గండి పడి కొట్టుకుపోయిన శంషాబాద్ జాతీయ రహదారిని అధికారుల సాయంతో రెండ్రోజుల్లో అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. ఇళ్లు నీటమునిగి సర్వం కోల్పోయిన వారికి సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్‌తో పాటు పలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఆహారాన్ని అందిస్తున్నామని సజ్జనార్ తెలిపారు.
వివిధ ప్రాంతాలలో వర్షపాతం నమోదు వివరాలు ఇలా…
కీసరలో 50.5 మి.మీ, మేడిపల్లి 28.0 మి.మీ, హయత్‌నగర్ (సౌత్ హస్తినాపురం, సౌత్ కమ్యూనిటీ హాల్) 25.0 మి.మీ, ముషీరాబాద్ 24.3 మి.మీ, సరూర్‌నగర్ 23.8మి.మీ, చార్మినార్ 22.8, ఉప్పల్ 22.5 మి.మీ, హయత్‌నగర్ (ప్రశాంతనగర్ కమ్యూనిటీ హాల్, వనస్థలిపురం), 22.3 మి.మీ, హయత్‌నగర్ (వైదేహినగర్) 22.3 మి.మీ, రాజేంద్రనగర్ (ఆర్డీవో ఆఫీసు, అత్తాపూర్) 21.8 మి.మీ, చార్మినార్(సర్దార్ మహల్) 21.0 మి.మీ, ఉప్పల్ (హబ్సీగూడ) 20.5 మి.మీ, సైదాబాద్ 19.8 మి.మీ, ఉప్పల్ (నాచారం) 19.5 మి.మీ, సరూర్‌నగర్ (అల్కాపురి కమ్యూనిటీ హాల్) 19.5 మి.మీ, ఆసిఫ్‌నగర్ (జియాగూడ) 19.3 మి.మీ, ఆసిఫ్‌నగర్ (అల్లబద వాటర్ రిజర్వాయర్) 19.3 మి.మీ, ఉప్పల్ (రాజీవ్‌నగర్ కమ్యూనిటీ హాల్) 19.3 మి.మీ, ఉప్పల్ (రామంతపూర్ వార్డు ఆఫీసు) 18.8 మి.మీ, గోల్కొండ 18.3 మి.మీ, ఉప్పల్ (శాంతినగర్) 18.3 మి.మీ, సరూర్‌నగర్ (రాక్‌టౌన్ కాలనీ, నాగోల్) 18.0 మి.మీ, ఆసిఫ్‌నగర్ 17.8 మి.మీ, బహదూర్‌పురా 17.5 మి.మీ, ఆసిఫ్‌నగర్(గుడిమల్కాపూర్ ఎస్‌బీఐ కాలనీ) 17.3 మి.మీ, రాజేంద్రనగర్ 17.3 మి.మీ, సరూర్‌నగర్ (భవానీనగర్ కమ్యూనిటీ హాల్) 17.0 మి.మీ, ఉప్పల్(మారుతీనగర్) 17.0 మి.మీ, ముషీరాబాద్ (చిలకలగూడ) 16.8 మి.మీ, ముషీరాబాద్ (రాంనగర్) 16.5 మి.మీ వర్షపాతం నమోదైంది.

గతంలో ముంచెత్తిన ముప్పులివే…!
హైదరాబాద్ నగరంలో ఈ నెల 13వ తేదీన కురిసిన భారీ వర్షంతో నగరం నీటి మునిగిపోయింది. 117 ఏళ్ల తర్వాత నగరంలో భారీ వర్షం కురిసిందని అధికారులు ప్రకటించారు. అయితే గతంలో కూడా భారీ వర్షాలు హైదరాబాద్‌ను ముంచెత్తాయి. గతంలో కురిసిన సమయంలో నాలాలు, చెరువులు నుండి నీరు దిగువకు వెళ్లిపోయే పరిస్థితి ఉండటంతో అంత పెద్దగా ప్రమాదం లేదనే అభిప్రాయాలున్నాయి. అయితే గతానికి భిన్నంగా హైదరాబాద్ నగరంలో పరిస్థితులు ఉన్నాయి. నాలాలు, చెరువులు కబ్జాకు గురయ్యాయి. వీటిపై నిర్మాణాలు చోటు చేసుకున్నాయి. దీంతో నగరం వరదనీటిలో మునిగిపోయిందనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు. నాలాలు, చెరువులు కబ్జాలకు గురికావడం ఒక్కరోజుతో జరిగింది కాదు. అన్ని ప్రభుత్వాల హయాంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయని స్వయంగా మంత్రి కెటిఆర్ సోమవారం నాడు ప్రకటించిన సంగతి విదితమే. హైదరాబాద్ నగరంలో 1908 సెప్టెంబర్ 2వ తేదీన 153.2 మి.మీ వర్షపాతం నమోదైంది. 1954 ఆగస్టు 1న 190.5 మి.మీ, 1970 ఆగస్టులో 140 మి.మీ, 2000 ఆగస్టు 24న 250 మి.మీ వర్షపాతం నమోదైంది. 2001 ఆగస్టులో 230.4 మి.మీ, 2002 ఆగస్టులో 179.4 మి.మీ, 2006 ఆగస్టులో 218.7 మి.మీ వర్షపాతం నమోదైంది. 2008 ఆగస్టులో 220.7 మి.మీ వర్షపాతం, 2016 సెప్టెంబర్‌లో 215 మి.మీ వర్షపాతం నమోదైనట్లుగా రికార్డులు చెబుతున్నాయి. ఈనెల 13వ తేదీన 32 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఈ నెల 17న సగటున 10 సెం.మీ వర్షపాతం నమోదైనట్లుగా అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ నగరంలో 2006 ఆగస్టు మాసంలో 36 గంటల్లో 230 మి.మీ వర్ఫపాతం నమోదైంది. 2016 సెప్టెంబర్ వరకు ఈ రికార్డు అలానే ఉందని అధికారులు చెబుతున్నారు.

భారీ వర్షానికి లాక్‌డౌన్ కారణమా…!
భారీ వర్షానికి లాక్‌డౌన్ కారణమా…!? అంటే అవుననే చెబుతున్నారు. అక్టోబర్ వచ్చిదంటే వర్షాకాలం ముగిసినట్లే. అయినా చాలా ప్రాంతాల్లో కుండపోత వర్సాలు కురుస్తున్నాయి. ఈ కాలంలో ఇంత భారీ వర్షాలేంటన్న ప్రశ్న పరతి ఒక్కరిలోనూ మెదలడం సహజం. అలాంటి వేళ వాతావరణ కేంద్రాలతో పాటు శాస్త్రవేత్తలు, అధ్యయనాలు చేసి ఓ అంచనాకు వచ్చారు. ఇంతటి భారీర వర్షాకు కరోనా కూడా కారణమని అభిప్రాయపడుతున్నారు. ఈ వేసవి కాలమంతా అనగా మార్చి మూడవ వారం నుంచి జులై వరకు దేశవ్యాప్తంగా సంపూర్ణ లాక్‌డౌన్ అమలైందని గుర్తు చేసిన శాస్త్రవేత్తలు.. ఈ సమయంలో కాలుష్యం కనిష్టానికి పడిపోయిందని, ఫలితంగా గాలిలో స్వచ్ఛత ఏర్పడి, తేమ శాతం పెరిగిందని స్పష్టం చేశారు. వాతావరణంలో ఏర్పడిన అనూహ్య మార్పు, మరిన్ని వర్షాలకు దారితీసిందని, దీనికి తోడు వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనాల కారణంగా, నైరుతీ రుతుపవనాలు వెనక్కు వెళ్లడం ఆలస్యమైందని, అదే సమయంలో పసిఫిక్ మహాసముద్రంలలో ఏర్పడే ఎల్ నినో ప్రభావం భారరత ఉపఖండంప ఏమాత్రమూ కనిపించలేదని వెల్లడించారు. ఈ కారణంతోనే వర్షాలు అథికంగా కురుస్తున్నాయని తెలిపారు. గడిచిన 11 సంవత్సరాల్లో 2018లో మాత్రమే నైరుతి రుతుపవనాలు అత్యంత ఆలస్యంగా సెప్టెంబర్ 29న నిష్క్రమణను ప్రారంభించాయని, ఈ సంవత్సరం సెప్టెంబర్ 28నే అవి వెనక్కు వెళ్లాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. వాస్తవానికి ఆ రోజుతో వర్షాకాలం ముగింపు మొదలైనట్టే. ఇదే సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాల కారణంగా వస్తున్న తేమగాలులు, మధ్యప్రదేశ్‌పై ఉన్న రుతుపవనాలకు అడ్డుగా నిలిచి వాటిని ఎటూ కదలకుండా ఆపేశాయి. ప్రస్తుత పరిస్థితుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణ నుంచి ఎప్పుడు వెళ్లిపోతాయన్న విషయాన్ని ఇప్పటికిప్పుడు చెప్పలేమని, బంగాళాఖాతంలో ప్రశాంతత ఏర్పడితేనే అవి పూర్తిగా వెనుదిరుగుతాయని అంచనా వేశారు. కనీసం మరో నాలుగైదు రోజుల పాటు రుతుపవనాల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉండి తీరుతుందని ఆ తరువాతే వర్షాలు తగ్గేందుకు అవకాశం ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు.

Heavy Rains in Telangana for next 3 days

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News