Monday, April 29, 2024

చినుకు వణుకు

- Advertisement -
- Advertisement -

భాగ్యనగరాన్ని వదిలిపెట్టని వర్షం
మంగళవారం తెల్లవారుజాము నుంచే వివిధ ప్రాంతాల్లో ప్రతాపం
పలుచోట్ల నేలకూలిన పురాతన ఇళ్లు
వరుస వానలతో బెంబేలెత్తుతున్న హైదరాబాదీయులు

మన తెలంగాణ/హైదరాబాద్: అల్పపీడన ప్రభావంతో భాగ్యనగరంతో సహా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో పాతబస్తీ వాసులు హడలిపోతున్నారు. వారం రోజులుగా వరుణుడు భాగ్యనగర వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. లోతట్టు ప్రాంతాలన్నీ బురదలో చిక్కుకున్నాయి. ఆయా ప్రాంతాల్లో దుర్గంధం వ్యాప్తి చెందుతోంది. ఆ పరిస్థితుల నుంచి ఏ విధంగా బయటపడాలనుకునే తరణంలో మళ్లీ మంగళవారం తెల్లవారు జాము నుంచి వరుణుడు మళ్లీ తన ప్రతాపాన్ని చూపాడు. కురుస్తున్న వర్షాలు నగర ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. మంగళవారం మధ్యాహ్నం నుంచి మరోసారి విస్తారంగా వర్షం కురిసింది. దీంతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, సుల్తాన్ బజార్, కోఠి, కొత్తపేట, దిల్‌సుఖ్‌నగర్, సరూర్‌నగర్, చంపాపేట్, కుషాయిగూడ, నాగారం, దమ్మాయిగూడ, చర్లపల్లి, మల్కాజ్‌గరి, మలక్‌పేట్, ఏఎస్‌రావునగర్, కీసర, తార్నాక, లాలాపేట, హబ్సీగూడ, మల్లాపూర్, నాచారం, బోడుప్పల్, కాప్రా, సైనికపురి, ఫిర్జాదిగూడ, గోల్కొండ, లంగర్‌హౌస్, చంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, ఉప్పుగూడ, బార్కస్, చార్మిననార్, మెహిదీపట్నం, గుడిమల్కాపూర్, అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, ఖైరతాబాద్, అమీర్‌పేట, ముషీరాబాద్, రాంనగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పలకరించింది.

మధ్యాహ్నం నుంచి భాగ్యనగరంలోని పలు ప్రాంతాలలో కుండపోత వర్షం కురిసింది. అయితే తమకు ఏ మాత్రం సహాయం అందడం లేదని, ఎవరైనా ప్రజా ప్రతినిధులు, మీడియా వస్తేనే అందరూ వచ్చి తమకు సహాయం చేసినట్లుగా పాలప్యాకెట్టు, వాటర్ బాటిళ్లు ఇచ్చి షో చేస్తున్నారంటూ ముంపు బాధితులు బహిరంగంగానే ఆరోపిస్తుండటం ఈ సందర్భంగా గమనార్హం. రామంతపూర్‌లో వరద ఇంకా తగ్గుముఖం పట్టలేదు. అనేక కాలనీలు ఇంకా జలదిగ్భంధంలోనే ఉన్నాయి. జలదిగ్భంధంలో నుంచి ప్రజలు బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నారు. చాలా కాలనీల్లో విద్యుత్ స్తంభాలు పడిపోయి.. ఇప్పటికీ విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరగలేదు. ఇక్కడి లక్ష్మీనగర్ కాలనీలోని వెయ్యి ఇళ్లలో వరద నీరు చేరింది. ఆ కాలనీలోని ప్రజలు వేరే చోటుకు వెళ్లలేకుండా ఉంది. అక్కడ సహాయక చర్యలు చేపట్టడం కూడా కష్టంగా మారింది. తాము అనేక ఇబ్బందులకు గురైనా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు వాపోతున్నారు. నాగార్జున సర్కిల్ మీదుగా మాసబ్ ట్యాంక్ వెళ్లే రహదారిపై భారీ ఎత్తున రాకపోకలకు అంతరాయమేర్పడింది. ఎక్కడ వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లోని జీవీకే మాల్ ఎదురుగా ఉన్న డ్రైనేజీ పైపులైను లీకేజే దీనికి కారణం. లీకేజీ వల్ల మాసబ్ ట్యాంక్ వెళ్లే రహదారి దెబ్బతింది. దీనికి తోడు వర్సం కురుస్తుండటంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. మరమ్మతు పనులు చేపట్టారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మాసబ్‌ట్యాంక్ వైపునకు వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. కురుస్తున్న భారీ వర్షాలకు బషీర్‌బాగ్ స్కైలాన్ థియేటర్ లైన్‌లోని ఓల్డ్ కామేల బస్తీలో రెండు ఇళ్లు కూలిపోయాయి.

ఆ సమయంలో ఇళ్లల్లో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణనష్టం సంభవించలేదు. ఎడ తెరపి లేకుండా కురుస్తున్న వానలతో ఇళ్లు కూలిపోవడం. శిథిలావస్థకు చేరిన ఇళ్లను జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేయడంతో చాలా మంది నిరాశ్రయులయ్యారు. ఇళ్లు కూలి నిరాశ్రయులైన తమని ప్రభుత్వం, సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు వాపోయారు. ఉండడానికి ఉన్న నీడ కాస్తా కోల్పోయి రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమని ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. భారీ వర్షాలకు పాతబస్తీ చార్మినార్ సమీపంలోని ఓ పురాతన ఇంటిపై అంతస్తు గోడ కూలిపోయింది. ఆ ఇంటి కింద ఉన్న దుకాణంతో పాటు ఓ కారు ధ్వంసమైంది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. శిథిలావస్థలో ఉన్న గోడలు ప్రమాదకరంగా మారడంతో అటుగా వెళ్లే ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.

ఎడతెరపి లేకుండా వర్షాలు కురవడం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వరుసగా కురుస్తున్న వర్షాలకు న్యూనల్లకుంట ఫీవర్ ఆసుపత్రి వద్ద రోడ్డు కుంగింది. రోడ్డుకు సొరంగం ఏర్పడటం వల్ల పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న గ్రేటర్ సిబ్బంది ఎలాంటి ప్రమాదాలు జరగకుండా రోడ్డుకిరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేసి ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అవసరమైతే తప్ప రోడ్లపైకి జనం రావద్దని ప్రజా ప్రతినిధులు, అధికారులు కోరుతున్నారు. కుండపోత వర్షానికి హైదరాబాద్‌లోని ముషీరాబాద్ నియోజకవర్గం బోలక్‌పురిలోని మహ్మద్‌నగర్‌లో ఓ ఇల్లు కూలిపోయింది. సమయానికి ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సమాచారం తెలుసుకున్న స్థానిక ఎంఎల్‌ఎ ముఠా గోపాల్ బాధిత కుటుంబాన్ని ఆదుకున్నారు. వారికి నిత్యావసర సరుకులు అందజేశారు. భారీ వర్షాలతో పూర్తిగా నిండిన జీడిమెట్ల ఫాక్స్ సాగర్ చెరువును స్థానిక ఎంఎల్‌ఎ వివేక్, ఎంఎల్‌సి శంభీపూర్ రాజుతో కలిసి సైబరాబాద్ సిపి సజ్జనార్ పరిశీలిచారు. 37 అడుగుల చెరువు పూర్తి నీటి మట్టానికి ప్రస్తుతం 34 అడుగుల మేర నీరు చేరింది. గతంలో తూము లీకేజీ అవుతుందని దాన్ని పూర్తిగా మూసివేశారు. గతంలో మూసిన తూమును నాగార్జునసాగర్, శ్రీశైలం డ్యామ్ నిపుణుల బృందం సాయంతో తెరిచేందుకు యత్నిస్తున్నారు. తూము తెరిస్తే ముంపు ప్రాంతాల వారు ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు. మరో రెండ్రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో మాదాపూర్, ఉప్పల్ శిల్పా రామంలకు అధికారులు సెలవులు ప్రకటించారు. రెండ్రోజుల పాటు శిల్పారామాల్లో సందర్భకులకు అనుమతి లేదని అధికారులు ప్రకటించారు.
పురాతన భవనాలను కూల్చేస్తున్నాం: జీహెచ్‌ఎంసీ కమిషనర్
భాగ్యనగరంలో భారీ వర్షాల కారణంగా శిథిలావస్థలో ఉన్న పురాతన భవనాలను కూల్చివేస్తున్నామని జీహెచ్‌ఎంసీ కమిసనర్ లోకేష్‌కుమార్ తెలిపారు.ప్రజలను రక్షించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టి శిథిలావస్థకు చేరిన భవనా కూల్చివేత కొనసాగిస్తా మన్నారు. వారం రోజుల్లో శిథిలావస్థలో ఉన్న 65 భవనాలను కూల్చివేసినట్లు పేర్కొన్నారు. ప్రజలను పునరావాస కే్ందరాలకు తరలిస్తున్నట్లు కమిషనర్ చెప్పారు. వర్షాలు పడుతున్నందున పురాతన భవనాలు ఖాళీ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అతి భారీ వర్షాలున్నాయ్.. జాగ్రత్తగా ఉండండి
మరోవైపు భాగ్యనగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జిహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌ కుమార్ సూచించారు. అధికారులు ఫ్లడ్ రిలీఫ్ స్పెషల్ ఆఫీసర్లు, మాన్సూన్ ఎమర్జెన్సీ, డీఆర్‌ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. శిథిల భవనాఉ, లోతట్టు ప్రాంతాల ప్రజలను రిలీఫ్ సెంట్లకు తరలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు రావొద్దని జిహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఈడి విశ్వజిత్ పేర్కొన్నారు. రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా డిఆర్‌ఎఫ్ బృందాలను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. నగర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తున్నాయని నగర మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సంబంధిత అధికారులు పునరావాస శిబిరాలకు తరలించాలని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మేయర్ సూచించారు.
ఆర్మీ బలగాలు సిద్ధం: భారత సైన్యం ప్రకటన
భాగ్యనగరంలో భారీ వర్షాల నేపథ్యంలో ఆర్మీ బలగాలు సిద్ధంగా ఉన్నట్లు భారత సైన్యం ప్రకటించింది. రానున్న రెండు, మూడు రోజులు నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఆర్మీ బలగాలు సిద్ధంగా ఉన్నాయి. ఏ క్షణంలోనైనా స్పందించేందుకు తొమ్మిది సహాయక బృందాలు బోట్లతో సన్నద్ధంగా ఉన్నట్లు భారత సైన్యం వెల్లడించింది. అవసరాన్ని బట్టి మరికొన్ని బృందాలను రంగంలోకి దింపుతామని ప్రకటించింది. హైదరబాద్‌లో కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన బండ్లగూడ ప్రాంతంలో 153 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి ఆహారాన్ని అందించినట్లు వివరించింది. ప్రస్తుతం కర్ణాటకలోని బీమ, కృష్ణ నదుల వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి కోసం ఆరు వరద సహాయక బృందాలు బోట్లు, వైద్య సామాగ్రితో సహాయక చర్యలు చేపడుతున్నామని తెలిపింది. 427 మందిని పునరావాసాలలకు తరలించి వారికి ఆహార పొట్లాలను అందించినట్లు ఆర్మీ వెల్లడించింది.
జీహెచ్‌ఎంసీ అప్రమత్తం.. నగరానికి 40 పర్యాటక శాఖ బోట్లు
హైదరాబాద్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ప్రభుత్వం ముమ్మరం చేసింది. మహానగరానికి మరో మూడు రోజులు భారీ వర్షాల ముప్పు ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జిహెచ్‌ఎంసి అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించేందుకు అవసరమైన బోట్లను సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో వివిధ రిజర్వాయర్ల వద్ద ఉన్న మర పడవలను హైదరాబాద్‌కు తరలించారు. 40 బోట్లను సహాయక చర్యల కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు పర్యాటక శాఖ జిహెచ్‌ఎంసీకి సమకూర్చింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఎపి ప్రభుత్వం కూడా మరో ఐదు బోట్లు, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందిని పంపించింది. రవీంద్రభారతి నుంచి అవసరమైన వరద ప్రభావిత ప్రాంతాలకు బోట్లను తరలించనున్నారు.
సామాజిక మాధ్యమంలో ఆ వార్తలన్నీ అవాస్తవం: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
రంగారెడ్డి జిల్లా మీర్‌పేట పెద్ద చెరువుకు గండిపడిందంటూ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమైన వార్తలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీర్‌పేట కార్పోరేషన్ పరిధిలో ఉన్న మూడు చెరువుల్లో ఎలాంటి గండ్లు పడలేదని, ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్‌తో కలిసి పెద్ద చెరువును సందర్శించారు. చెరువుకు గండిపడిదని అబద్ధపు ప్రచారం చేసిన వారిని గండి చూపించాలంటూ మండిపడ్డారు. అవాస్తవాలు ప్రచారం చేస్తూ లోతట్టు ప్రాంత ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాని రాచకొండ పోలీసులను ఆదేశించారు. ప్రజలెవరూ అవాస్తవాలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. పెద్ద చెరువు కట్టకు ఎలాంటి ప్రమాదం లేదని, బలహీనంగా ఉన్న చోట మరమ్మతు పనులు పూర్తి చేసినట్లు తెలిపారు.
‘వరద సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం’
వరద బాధితులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. బాధితులకు సహాయం అందించేందుకు అధికారులతో కలిసి ఆమె మీర్‌పేట్‌లో పర్యటించారు. నష్టపోయిన వాళ్లందరికీ రూ.10వేల రూపాయల సాయం అందించాలని ప్రభుత్వం ఇప్పటికే కచ్చితమైన ఆదేశాలు జారీ చేసిందని వెల్లడించారు. రెండు, మూడు రోజుల్లోగా అందరికీ సహాయం అందుతుందని, ఎవరికైనా సహాయం అందకపోతే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ విపత్తును ఎవరూ ఊహించలేదని, ప్రస్తుతం ఈ సమస్యకు తాత్కాలిక పరిష్కారం చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చేసేలా కృషి చేస్తుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

Heavy Rain Alert to Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News