Monday, April 29, 2024

మీకు మేమున్నాం..

- Advertisement -
- Advertisement -

అధైర్య పడొద్దు.. అందరినీ ఆదుకొని తీరుతాం

ఇంటింటికీ వెళ్లి వరద బాధితులకు రూ. 10వేలు నగదు అందజేత
ఇది తాత్కాలిక, తక్షణ సహాయమే, అవసరమైతే మరింత పెంపు
భవిష్యత్‌లో ముంపు ముప్పు రాకుండా శాశ్వత చర్యలు
బాధితులకు మంత్రి కెటిఆర్ భరోసా
ఇంకా భారీ వర్షాలున్నాయ్, అప్రమత్తంగా ఉండాలని సూచన
జిహెచ్‌ఎంసి ముంపు ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు, పాల్గొన్న మంత్రులు మహమూద్ అలీ, తలసాని, సబిత, మల్లారెడ్డి, ఎంఎల్‌ఎలు, అధికార యంత్రాంగం

మన తెలంగాణ/హైదరాబాద్: ముంపు ప్రభావిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు సష్టం చేశారు. వరద నీటిలో చిక్కుకున్న ప్రతి కుటుంబాన్ని ఆదుకుని తీరుతామన్నారు. ఈ విషయంలో ఎవరు అధైర్యపడొద్దు…ఆందోళన చెందవద్దని ఆయన భరోసా ఇచ్చారు. ప్రభుత్వం తక్షణ సాయంగా ప్రకటించిన రూ.10వేల ఆర్థిక సహాయాన్ని ప్రతి బాధిత కుటుంబానికి అందజేస్తామన్నారు. అధికారులే స్వయంగా బాధితుల ఇంటికి వచ్చి ప్రభుత్వ సహాయాన్ని అందజేస్తారని తెలిపారు. ప్రస్తుతం అందిస్తున్న పదివేల సహాయం తాత్కాలిక, తక్షణ సహాయం మాత్రమేనని అన్నారు. వరదల్లో ఇళ్లు పాక్షికంగా, లేదా పూర్తిగా నష్టపోతే వారికి మరింత సహాయం అందిస్తామన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం దిశగా తగు చర్యలు తీసుకుంటామన్నారు.
మంగళవారం వరద ముంపుకు గురైన ఖైరతాబాద్‌లోని ఎంఎస్ మక్తతో పాటు షేక్ పేట, నదీమ్ కాలనీ, నాగోల్, లింగోజిగూడా తదితర ప్రాంతాల్లో వర్షపు నీటిలో చిక్కుకున్న పలు కుటుంబాలను మంత్రి కెటిఆర్ పరిశీలించారు. వారితో నేరుగా మాట్లాడి తక్షణ సాయంగా ప్రభుత్వం తరఫున అందిస్తున్న రూ.10వేల నగదును అందజేశారు. ఈ సందర్భంగా ముంపుకు గురైన పలు కుంటుంబాలను మంత్రి కెటిఆర్ పరామర్శించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలపై కూడా ఆరా తీశారు.

అనంతరం మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, సిఎం కెసిఆర్ సూచనల మేరకు హైదరాబాద్ పరిసరాల్లో వరద బాధిత ప్రాంతాల్లోని 3-4 లక్షల కుటుంబాలకు నేటి నుంచి రు.10వేల చొప్పున రాష్ట్ర మునిసిపల్ శాఖ ఆర్థిక సాయం అందజేస్తుందని తెలిపారు. బాధిత కుటుంబాలకు అవసరమైతే ఈ సహాయం ఇంకా పెంచడానికి కూడా సిద్ధమేనని మంత్రి కెటిఆర్ తెలిపారు. వర్షాల వల్ల ఇబ్బంది పడ్డ ప్రతి వ్యక్తికి, ఆ కుటుంబానికి సాయం విధిగా అందాలని సిఎం కెసిఆర్ ఆదేశించారన్నారు. ఈ విపత్కర సమయంలో శాసనసభ్యులు, కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్‌లు, ఎన్‌జిఒలు కలిసికట్టుగా ప్రజలకు సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. రానున్న ఒకటి, రెండు రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసేందుకు అవకాశమున్న నేపథ్యంలో ప్రజలు మరింతగా జాగ్రత్తగా ఉండాలని మంత్రి కెటిఆర్ సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రజలు బయటకు రావాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఎలాంటి భారీవర్షాలు పడ్డా ప్రజలకు ఆస్థినష్టం, ప్రాణనష్టం జరగకుండా పకడ్భంది చర్యలు తీసుకున్నామన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఎనభై మంది సీనియర్ అధికారులను కూడా నియమించిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ గుర్తు చేశారు.ఈ పర్యటనలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, శాసనసభ్యులు దానం నాగేందర్, సుధీర్ రెడ్డితో పాటు ఆయా నియోజకవర్గాలకు చెందిన స్థానిక కార్పొరేటర్లు, వివిధ విభాగాలకు చెందిన అధికారులు ఉన్నారు.

ప్రజాప్రతినిధులంతా వరద ముంపు ప్రాంతాల్లోనే
సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్, శివారు ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులంతా వరద ముంపు ప్రాంతాల్లోనే ఉండి సహాయక చర్యలను పరిశీలించారు. ప్రభుత్వ పక్షాన బాధిత కుటుంబాలకు రూ.10వేల నగదును అందజేశారు. సికింద్రాబాద్‌లో డిప్యూటీ స్పీకర్ టి. పద్మారావు, సనత్‌నగర్ నియోజకవర్గంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మీర్‌పేట్‌లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి, ముషీరాబాద్‌లో స్థానిక శాసనసభ్యుడు ముఠాగోపాల్, అంబర్‌పేట్‌లో శాసనసభ్యుడు కాలేరు వెంకటేశ్, జూబ్లీహిల్స్‌లో మాగంటి గోపినాథ్, కంటోన్మెంట్‌లో జి. సాయన్న తదితరులతో పాటు పాతబస్తీలో పలు నియోజకవర్గంలో మజ్లిస్ శాసనసభ్యులు విస్తృతంగా వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారు. బాధితులకు ప్రభుత్వ సాయాన్ని అందించారు.

మరో పది రోజులు క్షేత్ర స్థాయిలోనే ఉండాలి
అంతకు ముందు నగరానికి చెందిన ప్రజాప్రతినిధులతో ప్రగతి భవన్‌లో మంత్రి కెటిఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో వరద బాధితులకు అందితున్న సహాయక చర్యలు, ప్రభుత్వ పక్షాన అందుతున్న సాయం తదితర అంశాలపై చర్చించారు. నగరంలో మరో రెండు, మూడు రోజుల పాటు భారీగా వర్షాలు పడే అవకాశమున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులంతా రానున్న పది రోజుల పాటు క్షేత్రస్థాయిలో ఉండాలని ఆదేశించారు. అలాగే వారి పలు సూచనలు కూడా చేశారు. ప్రతి ఒక్క శాసనసభ్యుడు వరద ప్రభావిత ప్రాంతాల్లోనే ఉండి సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. నగరంలో వరదలతో నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పక్షాన తక్షణ సాయం అందాలన్న సిఎం కెసిఆర్ ఆలోచన మేరకు పనిచేయాలన్నారు. తక్షణ సహాయం అందిస్తూనే మరోవైపు సహాయక చర్యలను పర్యవేక్షించాలన్నారు. అలాగే జిహెచ్‌ఎంసి ఏర్పాటు చేసిన షెల్టర్ క్యాంపులను పరిశీలించి అక్కడ అందుతున్న సహాయక చర్యలను కూడా పర్యవేక్షించాలన్నారు. అక్కడ అవసరమైన టాయిలెట్స్, దుప్పట్లు, మందులు, భోజనాలు అందేలా చూడాలన్నారు. ప్రస్తుతం జిహెచ్‌ఎంసి చేపట్టిన పారిశుద్ధ కార్యక్రమాలను ప్రత్యేకంగా పర్యవేక్షించాలన్నారు.

రెండు నెలల వేతనాన్ని విరాళంగా ప్రకటించిన ప్రజాప్రతినిధులు
సిఎం కెసిఆర్ పిలుపు మేరకు జిహెచ్‌ఎంసి పరిధిలోని శాసనసభ్యులు, ఎంఎల్‌సిలు, ఎంపిలు తమ రెండు నెలల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయనిధి ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వారు నిర్ణయాన్ని మంత్రి కెటిఆర్ స్వాగతిస్తూ, ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

KTR Gives Rs 10000 to flood affected people in Hyd

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News