Home తాజా వార్తలు 1269 కొత్త కేసులు

1269 కొత్త కేసులు

1269 New Corona Cases reported in Telangana

8 మంది మృతి, జిహెచ్‌ఎంసిలో 800, జిల్లాల్లో 469 మందికి వైరస్
ప్రభుత్వ ఆసుపత్రుల్లో 90% బెడ్లు ఖాళీ : వైద్య ఆరోగ్యశాఖ

మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి రాజ్‌భవన్‌కు చేరుకుంది. రాజ్‌భవన్‌లో పనిచేస్తున్న 28 మంది భద్రతా సిబ్బందికి, మరో 20 మంది రాజ్‌భవన్‌లో పనిచేస్తున్న సిబ్బందికి, వారి కుటుంబసభ్యులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మొత్తం 395 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 347 మందికి నెగెటివ్‌గా వచ్చిందని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. కరో నా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన 28 పోలీసు సిబ్బందిని ఐసోలేషన్ వార్డుకు, మిగతా 20 మందిని ఎర్రగడ్డలోని ఆయుర్వేద ఆస్పత్రికి తదుపరి చికిత్స నిమిత్తం తరలించినట్టు రాజ్‌భవన్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో పాటు పలువురు సీనియర్ అధికారులకు ఫలితాల్లో నెగెటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయమై గవర్నర్ స్పందిస్తూ తాను కరోనా పరీక్షలు చేయించుకున్నానని, మిగతా వారు చే యించుకోవాలని ఆమె సూచించారు. రెడ్‌జోన్‌లో ఉన్న వ్యక్తులు, వారికి కాంటాక్ట్‌లో ఉన్న వారు దయచేసి ముందస్తుగానే పరీక్షలు చేయించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ముందస్తు రోగ నిర్ధారణ పరీక్షలు మనల్ని రక్షించడమే కాకుండా ఇతరులను కూడా రక్షిస్తాయని ఆమె పేర్కొన్నారు. పరీక్షలు చేయించుకోవడానికి ఎవరూ సంకోచించవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. నాలుగు టీ (టెస్ట్, ట్రేస్, ట్రీట్, టీచ్)లను పాటించాలని ఆమె పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం 8153 మందికి టెస్టులు చేస్తే 1269 మందికి పాజిటివ్ తేలింది. అదే విధంగా వైరస్ దాడిలో మరో 8 మంది చనిపోయినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. కొత్తగా వైరస్ సోకిన వారిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 800 మంది ఉండగా, రంగారెడ్డి132, మేడ్చల్ 94, సంగారెడ్డి 36, ఖమ్మం 1,వరంగల్ అర్బన్ 12, వరంగల్ రూరల్ 2, నిర్మల్ 4,కరీంనగర్ 23, జగిత్యాల 4, యాదాద్రి 7, మహబూబాబాద్ 8, పెద్దపల్లి 9, మెదక్ 14, మహబూబ్‌నగర్ 17, మంచిర్యాల 3, భద్రాది కొత్తగూడెం 3, నల్గొండ 15, సిరిసిల్లా 3, ఆదిలాబాద్ 4, వికారాబాద్ 6,నాగర్‌కర్నూల్ 23, జనగాం 6, నిజామాబాద్ 11, వనపర్తి 15, సిద్దిపేట్ 3, సూర్యాపేట్ 7, గద్వాల్‌లో ఏడుగురు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 34,671కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 22,482కి చేరింది. ప్రస్తుతం ప్రభుత్వం పర్యవేక్షణలో 11883మంది చికిత్స పొందుతుండగా, వైరస్ దాడిలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 356కి పెరిగిందని వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ డా శ్రీనివాసరావు ప్రకటించారు. ప్రభుత్వం ఆసుపత్రుల్లో 90 శాతం బెడ్లు ఖాళీగా ఉన్నాయని ఆయన తెలిపారు. కేవలం గాంధీ ఆసుపత్రిలో 1092 పరుపులు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించారు.

1269 New Corona Cases reported in Telangana