Saturday, May 11, 2024

ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఒకే కుటుంబంలోని 19 మంది మృతి

- Advertisement -
- Advertisement -

రఫా : ఇజ్రాయెల్, హమాస్ మధ్య సాగుతున్న భీకరపోరులో బాంబు దాడులకు వేలాది అమాయక ప్రజల ప్రాణాలు బలవుతున్నాయి. నివాసాలను ఖాళీ చేసి వేరే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాల్సిందిగా హెచ్చరికలు చేస్తున్నా కొద్ది క్షణాల్లోనే దాడులు జరగడంతో ప్రజలు దిక్కులేక చిక్కుకుంటున్నారు. దక్షిణ గాజా స్ట్రిప్‌లో హెచ్చరికలు జారీ అయిన కొద్ది క్షణాల్లోనే ఒక నివాస భవనంపై వైమానిక దాడులు జరగడంతో ఒకే కుటుంబానికి చెందిన 19 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

ఈ దుర్ఘటన శనివారం జరిగింది. ఇజ్రాయెల్ దళాలు తమ ప్రాంతంలో వైమానిక దాడులు చేస్తాయని ముఖ్యంగా తన పొరుగింటిపై దాడి జరుగుతుందని తెలుసుకున్న 57 ఏళ్ల నాజర్ అబుకుతా తన కుటుంబం మొత్తాన్ని తన నాలుగు అంతస్తుల భవనం గ్రౌండ్‌ఫ్లోర్‌కు సురక్షితంగా చేర్చాడు. తానొకటి తలస్తే ఇంకొకటి జరిగినట్టు పొరుగింటిపై కాకుండా నేరుగా తన ఇంటిపైనే వైమానిక దాడి జరిగింది. తన కుటుంబం లోని మొత్తం 19 మంది ప్రాణాలు కోల్పోయారు. తన భార్య, బంధువులు అంతా క్షణాల్లోనే విగతజీవులయ్యారు. పొరుగింటిలోని ఐదుగురు శరణార్థుల బయటను నిల్చి ఉండగా బాంబు దాడికి వారు కూడా ప్రాణాలు కోల్పోయారు.

తన ఇంటిపైనే ఇజ్రాయెల్ దాడులు ఎందుకు చేశారో తనకు అర్ధం కాక అబుకుతా దీనంగా దిక్కులు చూస్తూ ఉండిపోయాడు. తన నివాసభవనంలో మిలిటెంట్లు ఎవరూ లేరని, అలాగే తన కుటుంబానికి ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేవని వాపోతున్నాడు. ముందుగా హెచ్చరించి ఉంటే వారు అక్కడ ఉండేవారు కాదని అబుకుతా బంధువు ఆవేదన వెలిబుచ్చాడు. ఈ షాక్ నుంచ అబుకుతా ఇంకా తేరుకోలేక పోతున్నాడు. ఆదివారం తన కుటుంబీకుల, బంధువుల మృతదేహాలకు అంత్యక్రియలు చేయడానికి అబుకుతా సిద్ధపడ్డాడు.

అయితే చాలా మృతదేహాలు ఇంటి శిధిలాల కిందనే ఉన్నాయి. శిథిలాల నుంచి వెలికి తీసిన మృతదేహాలు మసిబారి పోల్చుకోలేని విధంగా ఉన్నాయి. తన కుటుంబం లోని 14 మంది మృతదేహాలను గుర్తించ గలిగాడు. ముఖ్యంగా శవాగారంలో ఉన్న నలుగురు పిల్లల మృతదేహాలను గుర్తించ గలిగాడు. ఇంకా ఒక మృతదేహం ఎక్కడుందో వెతుకుతున్నాడు. ఈ విషాద సంఘటనకు ఇజ్రాయెల్ మిలిటరీ తక్షణం స్పందించలేదు. తాము ప్రజలను ఎవరినీ లక్షం చేసుకోలేదని మిలిటెంట్లను వెతికి హతమార్చడానికే ప్రయత్నిస్తున్నామని మిలిటరీ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News