Monday, April 29, 2024

టైమ్స్ ర్యాంకుల్లో 91 భారతీయ యూనివర్శిటీలకు చోటు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకును లండన్‌కు చెందిన టైమ్స్‌హయ్యర్ ఎడ్యుకేషన్ (టిహెచ్‌ఇ) మ్యాగజైన్ ప్రకటించింది.ఈసారి యూనివర్శిటీ ర్యాంకుల్లో రికార్డు స్థాయిలో భారత్‌కు చెందిన 91 యూనివర్శిటీలకు చోటు దక్కింది. గత ఏడాది 75 విశ్వవిద్యాలయాలకు చోటు దక్కగా, ఈ సారి అంతకన్నా ఎక్కువ కావడం విశేషం. బెంగళూరు లోని ది ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్‌సి) భారత్ లోని ఉత్తమ యూనివర్శిటీగా మరోసారి స్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ ర్యాంకుల్లో ఈ యూనివర్శిటీకి 250 వ ర్యాంకు లభించింది.2017 తరువాత మరోసారి ఈ ర్యాంకు లభించింది. 108 దేశాల్లోని 1904 యూనివర్శిటీలు ఈసారి ర్యాంకింగ్‌లో పాల్గొన్నాయి. ఈ ర్యాంకులన్నిటిలో ఇంగ్లండ్ లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీకి మొదటి స్థానం లభించింది. తర్వాత కాలిఫోర్నియా లోని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం, కేంబ్రిడ్జి మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు వరుసగా, రెండు, మూడు స్థానాలు కైవసం చేసుకున్నాయి.

అయితే మనదేశం లోని అగ్రశ్రేణి ఐఐటీలు వరుసగా నాలుగో ఏడాది కూడా ఈ ర్యాంకులను బహిష్కరించాయి. గత ఏడాది ఈ ర్యాంకుల్లో భారత్ ఆరోస్థానంలో ఉండగా, ఈసారి 91 యూనివర్శిటీలకు చోటు దక్కడంతో భారత్ స్థానం నాలుగుకు మెరుగుపడింది. భారత్ లోని అన్నా విశ్వవిద్యాలయం, జామియా మిలియా ఇస్లామియా, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాలు, స్కూలిని యూనివర్శిటీ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్, ఈ నాలుగు విశ్వవిద్యాలయాలు 501 నుంచి 600 ర్యాంకుల మధ్య నిలిచాయి. గువాహటి, ధన్‌బాద్ ఐఐటీలు, గతసారి 1001 నుంచి 1200 ర్యాంకుల శ్రేణి జాబితాలోఉండగా, ఈసారి 601 నుంచి 800 శ్రేణి జాబితా లోకి చేరుకుని మెరుగయ్యాయి. కోయంబత్తూరు లోని భారతీయార్ విశ్వవిద్యాలయం,జైపూర్ లోని మాలవీయ ఎన్‌ఐటి కూడా ఈ జాబితా లోకి వచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News