Monday, April 29, 2024

తాలిబన్ల ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

A key statement of the Afghan Taliban

 

అఫ్ఘన్ ప్రజలకు క్షమాభిక్ష ప్రకటించిన తాలిబన్లు
 విధులకు హాజరు కావాలని ప్రభుత్వ ఉద్యోగులకు ఆదేశం
మహిళలు ప్రభుత్వంలో పాలు పంచుకోవాలని విజ్ఞప్తి
ప్రజలు మామూలుగా రోజువారీ కార్యకాలాపాలు జరుపుకోవచ్చు
ప్రభుత్వం ఏర్పాటుపై హమిద్ కర్జాయ్ తదితరులతో మంతనాలు
మా నిర్ణయం సరైనదే : జో బైడెన్, అమెరికా విదేశాంగ
మంత్రి బ్లింకన్‌తో భారత్ చర్చలు, ప్రధాని మోడీ సమీక్ష

కాబూల్: అఫ్ఘానిస్థాన్‌ను పూర్తిగా హస్తగతం చేసుకున్న తాలిబన్లు మంగళవారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రజలందరికీ క్షమాభిక్షప్రసాదిస్తున్నామని ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులు విధుల్లో చేరాలని ఆదేశించారు. అలాగే మహిళలను తమ ప్రభుత్వంలో చేరాలని కోరారు. అఫ్ఘాన్‌లో తాలిబన్ల రాజ్యస్థాపన నేపథ్యంలో అంతర్జాతీయ సమాజంనుంచి ఆందోళన వ్యక్తమవుతున్న వేళ వారు శాంతిమంత్రం పఠించడం గమనార్హం. ‘ ప్రతి ఒక్కరికీ క్షమాభిక్ష ప్రకటిస్తున్నాం. అందువల్ల మీరు పూర్తి విశ్వాసం, భరోసాతో జీవనం సాగించండి. ప్రజలందరూ సాధారణ, రోజువారీ కార్యకలాపాలను కొనసాగించుకోవచ్చు. ప్రభుత్వ అధికారులందరూ విధులకు హాజరు కావాలి’ అని తాలిబన్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అంతేకాకుండా మహిళలు ప్రభుత్వంలో భాగస్వాములు కావాలని కూడా పిలుపునిచ్చారు. ఈ మేరకు తాలిబన్ సాంస్కృతిక కమిషన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎనాముల్లా సమంగామి ఒక ప్రకటన చేశారు. ‘మహిళలు బాధితులుగా మారడం మాకు ఇష్టం లేదు. షరియా చట్టాలను అనుసరించి ప్రభుత్వ వ్యవస్థలో వారు కూడా భాగస్వాములు కావచ్చు. అయితే ఇంతవరకు మేము ప్రభుత్వ విధివిధానాలను ఖరారు చేయలేదు. కానీ ఇస్లామిక్ నాయకత్వంలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉంటుంది’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అఫ్ఘాన్ తాలిబన్ల వశం కావడంతో అక్కడి ప్రజలుతీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. మళ్లీ చీకటి రోజులు తప్పవని భీతిల్లుతున్నారు. గతంలో తాలిబన్ల అరాచక పాలన ఎరిగిన ప్రజలు దేశంనుంచి పారిపోయేందుకు విమానాశ్రయాలకు పోటెత్తుతున్నారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణిస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాలిబన్లు క్షమాభిక్ష ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

కాగా అఫ్ఘాన్ ఆక్రమణల్లో తాలిబన్లు ఈ సారి తమ సహజ వైఖరికి భిన్నంగా శాంతిమంత్రం పఠించారు. ఎక్కడా విధ్వంసానికి తెగబడలేదు. తమ ఆక్రమణతో ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించడానికి ప్రయత్నాలు కొనసాగిస్తుండడం గమనార్హం. ఎవరికీ ఎలాంటి హానీ తలబెట్ట బోమని సోమవారం మరోసారి భరోసా ఇచ్చారు. అనుమతి లేకుండా ఎవరి ఇళ్లలోకి ప్రవేశించవద్దని తాము ఫైటర్లను ఆదేశించామని.. ప్రజల ప్రాణాలు,ఆస్తులు, గౌరవాన్ని పరిరక్షించాల్సిందిగా వారికి సూచనలు చేశామని తాలిబన్ల అధికార ప్రతినిధి సుహైల్ షహీన్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. అలాగే అమెరికా నేతృత్వంలోని కూటమి తరఫున పని చేసిన వారిపై తామేమీ ప్రతీకారం తీసుకోబోమని తాలిబన్ సహ వ్యవస్థాపకుడు అబ్దుల్ ఘనీ బరాదర్ హామీ ఇచ్చారు. అఫ్ఘాన్ ప్రజల్లో అనవసర భయాందోళనలు రేకెత్తించవద్దని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు.

యధావిధిగా పనులకు వెళ్లాలని తాలిబన్లు టీవీల్లో ప్రకటనలు కూడా ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాలిబన్ల హామీలను గౌరవించాల్సిన అవసరం ఉందని ఐక్య రాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ ప్రతినిధి రుపర్ట్ కోల్విల్లే ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం. ఇదిలా ఉండగా దేశంనుంచి వెళ్లిపోవాలనుకునే వారికి ఏకైక మార్గమైన కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం మంగళవారం అమెరికా బలగాల పహరా మధ్య మిలిటరీ విమానాల కోసం మంగళవారం తిరిగి తెరుచుకుంది. తమ దేశాల దౌత్య సిబ్బందిని, ఇతర పౌరులను తీసుకెళ్లడం కోసి వివిధ దేశాలనుంచి వచ్చే విమానాలు దిగడం, వెళ్లడం కనిపిస్తోందని నాటో సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. కాగా ప్రస్తుతం విమానాశ్రయంనుంచి పని చేస్తున్న అమెరికా ఎంబసీ, దేశంనుంచి వెళ్లిపోవాలనుకునే అమెరికన్లు ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాలని, అయితే తమను సంప్రదించకుండా విమానాశ్రయానికి రావద్దని తమ దేశ పౌరులను కోరింది. భారత్ సహా చాలా దేశాలు కాబూల్‌లోని తమ దౌత్య సిబ్బందిని ప్రత్యేక మిలిటరీ విమానాల్లో స్వదేశాలకు తరలించాయి.

ప్రభుత్వం ఏర్పాటుపై చర్చలు

మరోవైపు గత ఇరవై ఏళ్ల కాలంలో అఫ్ఘాన్‌లో పరిస్థితులు మారిన నేపథ్యంలో తాలిబన్ల ప్రభుత్వం ఎలా పని చేయాలనే దానిపై తాలిబన్లు గతంలో అఫ్ఘాన్ ప్రభుత్వంలో పని చేసిన కీలక నేతల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని పేరు వెల్లడించడానికి ఇష్టపడనివర్గాలు తెలిపాయి. మాజీ అఫ్ఘాన్ అధ్యక్షుడు హమిద్ కరాజయ్, గతంలో తాలిబన్లతో చర్చలకోసం ఏర్పాటయిన కౌన్సిల్‌కు నేతృత్వం వహించిన అబ్దుల్, అబ్దుల్లా తదితరులతో ఈ చర్చలు జరుగుతున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. సోమవారం రాత్రంతా ఒక దఫా చర్చలు కొనసాగాయని, ఒకటి, రెండు రోజుల్లో ‘ఓ మంచి వార్త’ వెలువడగలదని ఆశిస్తున్నామని ఆ వర్గాలు తెలిపాయి. తాలిబన్లు కాని వారిని కూడా ప్రభుత్వంలో భాగస్వాములను చేయడమే లక్షంగా ప్రధానంగా ఈ చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News