Monday, April 29, 2024

మందుబాబులా… మజాకా?

- Advertisement -
- Advertisement -

SS-Wines

చిల్డ్ బీర్స్ వద్దు.. హాట్ బ్రాండ్సే ముద్దు…
శనివారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా
రూ.200 కోట్లకు పైగా విలువైన మద్యం విక్రయాలు
మతలబు తెలియక వైన్‌షాపు యజమానుల బిత్తరచూపులు…

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. తొలి రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మందుబాబులు తమ తమ పరిధిలోని వైన్‌షాపుల వద్ద పోటెత్తారు. ఎండలు దంచికొట్టే సమయంలో సాధారణంగా మందుబాబులు చిల్డ్ బీర్‌ని ఆస్వాదించడం పరిపాటి. అయితే అనూహ్యంగా మందుబాబులు చిల్డ్ బీర్ వద్దు.. హాట్ బ్రాండ్సే ముద్దు అంటూ వాటి కొనుగోలుకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తుండటంతో అందులో దాగి ఉన్న మతలబు తెలియక బిత్తరచూపులు చూడటం వైన్‌షాపు యజమానుల వంతయిందట. రాష్ట్రంలో మద్యం విక్రయాలు మొదలైన తొలి రోజు నుంచి ఇదే తంతు కొనసాగుతోందని అంటున్నారు.

సహజంగా ఎండా కాలంలో చిల్డ్ బీర్‌లకు డిమాండ్ ఉంటుందనేది వైన్‌షాపు యజమానుల వాదన.. కాదు అదే వాస్తవం. అయితే, అంచనాలకు భిన్నంగా మందుబాబులంతా హాట్ బ్రాండ్స్ వైపు మొగ్గుచూపడం ఒకింత విస్మయానికి గురిచేసే అంశమే. అయితే ఇందులో ఏదో మర్మం దాగుందనే అనుమానాలు పొడచూపుతున్నాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఆయా మద్యం షాపుల వద్ద మందుబాబులు పోటీలు పడి మరీ మద్యంను కొనుగోలు చేస్తున్నారు. అనేక ప్రాంతాల్లో భౌతిక దూరాన్ని పాటించని సీన్లు కూడా కనిపిస్తున్నాయి. దీంతో మందుబాబులంతా భౌతిక దూరం పాటించే విధంగా పోలీసులు ఆయా షాపుల వద్ద నిరంతరం పడరాని పాట్లు పడుతున్నారనేది నిర్వివాదాంశం. భౌతిక దూరం పాటించని పక్షంలో కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వాలు హెచ్చరికలు చేస్తున్నా మందుబాబులు అవేమీ పట్టించుకోకుండా మద్యం కొనుగోలుకు పోటీ పడుతుండటం గమనార్హం.

గతంలో చిల్డ్ బీర్లు దొరకని వైన్‌షాపుల వద్ద ఘర్షణలు చోటు చేసుకున్న ఘటనలు లేకపోలేదు. ప్రస్తుతమున్న ప్రత్యేక పరిస్థితుల్లో అసలు ఆ చిల్డ్ బీర్ వైపు మద్యం బాబులు కన్నేసి కూడా చూడటం లేదు. పైపెచ్చు అధిక మొత్తంలో హాట్ బ్రాండ్స్ విస్కీ, బ్రాందీ తదితరాలను కొనుగోలు చేస్తున్నా రు. కాగా, కొన్ని చోట్ల పరిమిత సంఖ్యలో మద్యం విక్రయాలు కొనసాగించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ అది ఆచరణ సాధ్యం కావడం లేదని తెలుస్తోంది. తమదైన రీతిలో మందుబాబులు విడతలవారీగా మద్యం కొనుగోలు చేస్తూ తమ వద్ద స్టాక్ ఉంచుకునే విధంగా యత్నిస్తుండటమే ఇందుకు కారణమని చెబుతున్నారు. లాక్‌డౌన్ సడలింపులు తర్వాత రాష్ట్రవ్యాప్తంగా శనివారం నాటికి రూ. 200 కోట్లకు పైగానే విక్రయాలు జరిగా యి. కాని బీర్ల విక్రయాలు గణనీయంగా పడిపోయాయి.

ఇంతకీ చిల్డ్ బీర్ల వైపు మందుబాబులు ఎందుకు అనాసక్తత కనబరుస్తున్నారనే విషయాన్ని ఒకసారి పరికిస్తే.. లాక్‌డౌన్ కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితు ల్లో మళ్లీ మున్ముందు పరిస్థితులు ఏ విధం గా ఉంటాయోనన్న బెంగ సదరు మందుబాబులో ఉందని అంటున్నారు. ఈ క్రమం లో చిల్డ్ బీర్లు కొనుగోలు చేయడం వల్ల వచ్చే ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువగా ఉండవచ్చన్నది మందుబాబుల ఆలోచన కావొచ్చు. పైపెచ్చు బీర్‌లు కొనుగోలు చేస్తే ఫ్రిజ్‌లు తప్పనిసరిగా ఉండాలి. కానీ ప్రతి ఒక్కరి దగ్గర ఆ సౌకర్యం ఉండే అవకాశం లేదు. దీంతో ముందుచూపుగా చిల్డ్ బీర్ల కొనుగోలు కంటే హాట్ బ్రాండ్స్ కొనడంపైనే మందుబాబులు తమ సర్వశక్తులు ఒడ్డుతున్నారనడంలో అతిశయోక్తి లేదు. మందుబాబులా? మజాకా? అని ప్రతి ఒక్కరూ అనకుండా ఉండలేకపోతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News