Monday, April 29, 2024

అవి విజ్ఞాన శాస్త్రాలు కావు!

- Advertisement -
- Advertisement -

Article about Modern Science

ఆధునిక విజ్ఞాన శాస్త్రం వేరు. మన పూర్వీకుల సంప్రదాయ వాదుల శాస్త్రాలు వేరు. ఈ రెండూ వేర్వేరు. సంప్రదాయ వాదుల శాస్త్రాల్లో విషయాలు ఎప్పటికీ మారవు. అవి వేల ఏళ్ల నాటివి. అందులో కాలానుగుణంగా మార్పులు, చేర్పులు ఉండవు. ఇది నీరు నిలువ ఉన్న నీటి గుంట. ఈ శాస్త్రాల్ని బలపరిచే వారు మెదడ్లు కూడా ఆ విధంగానే ఉంటాయి. ఆ నీటి గుంట ఆవల ఏముందో వారికి తెలియదు. శాస్త్రాన్ని పండితులు బల్లి శాస్త్రం కిందికి దిగజార్చారు. ఆధునిక విజ్ఞాన శాస్త్రం నిత్య నూతనం. అది జరుగుతున్న పరిశోధనలకు అనుగుణంగా వెలువడుతున్న నూతనాంశాలకు అనుగుణంగా విషయం మారుతూ ఉంటుంది. ఇది నిరంతరం కదలిపోయే నీటి ప్రవాహం. అన్ని దశల్ని దాటుకుంటూ ఇది సుదూర తీరాలకు వెళుతుంది. దాహం తీరుస్తుంది. పొలాలకు నీరందిస్తుంది. ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచుతుంది. జీవితాన్ని అర్థవంతం చేస్తుంది. అందువల్ల సంప్రదాయ శాస్త్రాన్ని విశ్వసిస్తూ బతకడమా లేక ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని జీవితంలో ప్రధాన భాగంగా చేసుకోవడమా? అనేది ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందే మాది శాస్త్రీయం అని చెప్పుకోవడం అందరికీ ఒక అలవాటైపోయింది. తమ పవిత్ర గ్రంథాలే శాస్త్రీయమైనవి అంటూ ఆయా మతాల మత బోధకులు, భక్తులు వాదిస్తుంటారు. బైబిల్, ఖురాన్‌లు కూడా శాస్త్ర బద్ధమైనవే అని అంటుంటారు. ఈ జాబితాలో ఇటీవల వాస్తు, జ్యోతిస్యం అక్యుపంక్చర్, హోమియోపతి వంటి వాటిని కూడా పోటీపడి చేరుస్తున్నారు. ఇలాంటి సందర్భంలో శాస్త్రీయమంటే ఏది? అశాస్త్రీయమంటే ఏది అనేది నిర్ధారించుకోవడం అవసరమవుతోంది. కొందరు సైంటిస్టులే, టెక్నాలజీ నిపుణులే మూఢ నమ్మకాలలో శాస్త్రీయత ఉందని చూపే ప్రయత్నం చేస్తూ… వారు, వారి విలువను పోగొట్టుకుని విమర్శలకు గురి అవుతున్నారు.
ఒకటి మాత్రం నిజం! ‘శాస్త్రీయం’ అనే పదం వాడితే అది గౌరవప్రదంగా మారిపోతుందని అనుకుంటున్నారు. ఇది ఒక రకంగా సైన్సు విజయమే! పురాణ గ్రంథాల విజయం కాదు. ‘ఇవే మా పురాణ గ్రంథాలు అని’ ఏ వైజ్ఞానికుడూ తమ వైజ్ఞానిక గ్రంథాల గూర్చి పొరపాటున కూడా చెప్పుకోలేదు. మత బోధకులే తమ మత గ్రంథాలు శాస్త్రీయమైనవని చెప్పుకుంటున్నారు. అంటే, విలువైనవి ఏవీ? అన్నది అర్థం చేసుకోవాలి. నిస్సందేహంగా వైజ్ఞానిక దృక్పథానిదే విజయం. అది మత గ్రంథాల ముందు సాగిలపడి ఓటమిని ఒప్పుకోలేదు. మత భావన (దైవ భావన) మాత్రమే శాస్త్ర దృక్పథం ముందు “తమదీ శాస్త్రీయతే”నని వివరణలు ఇచ్చుకుంటున్నాయి. అంటే ఒక రకంగా అనుకరిస్తున్నాయి. ఉన్నత స్థాయిలో ఉన్నవాడు తన కింది స్థాయిలో ఉన్నవాడిని అనుకరించడు.. కింది స్థాయి వాడే ఉన్నతంగా ఉన్నవాడిని అనుకరిస్తాడు ఇదీ అలాంటిదే! కొందరు శాస్త్రం, శాస్త్రీయత అనే పదాల్ని పనికిరాని వాటికి ఆపాదించి, విరివిగా వాడినందు వల్ల అవి వాటి అర్థాల్ని స్ఫూర్తిని పోగొట్టుకున్నాయి. అన్ని మతాల వారు తమ తమ మత గ్రంథాల గూర్చి గొప్పగా చెప్పుకుంటారు కదా? అవి జన బాహుళ్యంలోకి పోవడానికి ప్రింటింగ్ మిషన్లే కదా ఉపయోగపడ్డాయి. ప్రింటింగ్ మిషన్లు సైన్సు వల్ల వచ్చినవే! సుప్రభాతాల దగ్గర్నుండి పవ్వళింపు సేవల దాకా పాటలు, భజనలు, అలాగే నమాజులు, ప్రేయర్లు… అన్ని మతాల ప్రార్థనలు జనానికి వినిపించడానికి మైకులు, లౌడ్ స్పీకర్లే ఉపయోగపడుతున్నాయి. అవన్నీ సైన్సు అందించినవేనని గుర్తుంచుకోవాలి. పుణ్య స్థలాలకు భక్తులు వెళ్లి రావడానికి టికెట్లన్నీ ఆన్‌లైన్‌లో బుక్ అవుతున్నాయి. అవి విజ్ఞాన శాస్త్ర ఫలితమే కదా? విగ్రహాల తయారీ సైన్సు ఫలితమే. ప్రార్థనా స్థలాల్లో నిర్మించిన భవనాలు సైన్సు ఫలితమే. మనిషి ప్రమేయం లేకుండా, అతను సంపాదిస్తూ వచ్చిన విజ్ఞానం లేకుండా ఏ మతమూ నిలబడలేదు. ప్రచారం కాలేదు. పరిఢవిల్ల లేదు. ఒకప్పటి తాళపత్ర గ్రంథమైనా, నేటి ఇ బుక్ అయినా, మనిషి వివేకంలోంచి క్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చిన విజ్ఞాన శాస్త్రమే ఉన్నపళంగా ఏ అతీంద్రియ శక్తి వల్లనో ఇవన్నీ జరిగాయి… అనడానికి ఆధారాలే లేవు. “మా విశ్వాసాలే మాకు ముఖ్యం ఏ ఆధారాలు లేకపోయినా మేం విశ్వసిస్తూనే ఉంటాం” అని ఎవరైనా అంటే అది వారి ఇష్టం. కాని, వారి మానసిక స్థితిపై తప్పక అనుమానం కలుగుతుంది.
సైన్సు ఎప్పుడూ సైన్స్ లాగా ఉండిపోలేదు. మానవ జీవితంలోని అన్ని రంగాల మీద అది ప్రభావం చూపుతూ వచ్చింది. సామాజిక, రాజకీయ, సాహిత్య, క్రీడా, కళారంగాలలో బలమైన ముద్ర వేస్తూ వచ్చింది. జీవితాన్ని వేగవంతమే కాదు, అర్థవంతం చేసింది కూడా! దుర్వినియోగం చేసినప్పుడు దుష్ఫలితాలనిచ్చింది. కాని, మనిషి దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. మనిషి రేపటి ప్రయాణానికి సైన్సు సర్వదా సహాయకారి అయింది. ఎప్పుడో నలభై యేల్ల కింద విన్న మధుర గీతం మళ్లీ ఇప్పుడు ఆస్వాదించాలనుకుంటే వినడానికి వీలవుతుంది. ఇంట్లో కూర్చుని విదేశంలో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ చూడగలుగుతున్నాం. మనిషి ఆరోగ్యం కాపాడడానికి ఎక్కడ ఏ దేశంలో ఏ శాస్త్రవేత్త మందు కనిపెట్టినా, అది అనతి కాలంలో మనకు ఇక్కడ లభిస్తోంది. ఇవన్నీ ఆధ్యాత్మిక శక్తివల్లనో, దైవానుగ్రహం వల్లనో, జరగడం లేదని దయ చేసి జనం గ్రహించుకుంటూ ఉండాలి. “మేం గ్రహించుకోం” అని ఎవరైనా అంటే, అది వారి ఇష్టం. ఇంగిత జ్ఞానం లేని వారి జాబితాలో వారు చేరిపోతారు. వారిని ఎవరూ కాపాడలేరు. కుల, మత ప్రాంతీయ భేదాలు తగ్గించడానికి విజ్ఞాన శాస్త్రం నిరంతరం కృషి చేస్తూనే వచ్చింది. అది ఎలాగా? అని అంటారేమో బస్సులు, రైళ్లు, విమానాలు అన్నీ సైన్సు ఫలితాలే కదా? వాటిలో మనుషులంతా ఏ భేదాలు లేకుండా ప్రయాణాలు చేస్తున్నారు కదా? ఒక దళితుణ్ణి తన ఇంటి ప్రహరీ గోడ బయట నిలబెట్టిన ఛాందసుడు నోరు మూసుకొని ప్రయాణాల్లో పక్క సీటు ఇవ్వాల్సిందే. హోటళ్లలో ఎవరు వంట చేస్తున్నారో తెలియదు. పక్కన కూర్చుని తిని వెళుతున్నది ఎవరో తెలియదు. విజ్ఞాన శాస్త్రం అందిస్తున్న ఆధునికత, నాగరికత, మనుషులందరినీ ఒక్కటిగా ఒక చోట కలపడానికి ప్రయత్నిస్తూనే ఉంది. కాని, సమాజంలోని కొంత మంది కుటిల మనస్కుల వల్ల పూర్తి ఫలితాలు లభించడం లేదు. ఏమైనా ఈ దేశంలో అన్ని మతాల మత గురువులు, మత ప్రబోధకులు, రాజకీయ నాయకులు విజ్ఞాన శాస్త్రం ఇచ్చిన నీడిలో తలదాచుకుంటున్నారు. అయితే ఆ విషయం ధైర్యంగా ఒప్పుకునే నిజాయితీ వారికి లేదు. ఒప్పుకుంటే తమకు తాము కల్పించుకున్న పవిత్రత మహిమ గౌరవం విలువ అన్నీ కుప్పగూలిపోతాయని వారి భయం. ఆ భయాన్ని అధిగమించి వారు నిజాయితీగా బయటికొస్తే, వారి విలువ ఎన్నో రెట్లు పెరుగుతుంది. కాని, వారికి అది అక్కర లేదు. భ్రమల్లో బతకడమే వారికి ఇష్టం! కొందరు మూఢ భక్తులు, అనుచరులు తమ చుట్టూ ఉంటే చాలు, ప్రపంచమే తమ చుట్టూ ఉందని సంతృప్తిపడుతుంటారు.
విజ్ఞాన శాస్త్రమంటే ఏ ముంది, కేవలం సాంకేతిక పరిజ్ఞానమే కదా? అని కొందరు దాన్ని తేలికగా తీసివేయాలని చూస్తారు. నిజమే! విజ్ఞానమే తరువాత సాంకేతిక పరిజ్ఞానంగా మారుతుంది. అందుకే శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు కలిసి చాలా చాలా శ్రమించాల్సి వస్తుంది. ఇక్కడే రుషులు, ఆధ్యాత్మిక వేత్తలు, మత గురువులు అందరూ ఘోరంగా విఫలమవుతూ వచ్చారు. సైన్సు, టెక్నాలజీగా మారి ప్రజలకు ఉపయోగపడ్డట్టు, ఈ ఆధ్యాత్మిక వేత్తల బోధనలు సామాన్యుడి దైనందిన జీవితంలో ఉపయోగపడడం లేదు. వీరి అంతర్గత ఆత్మశక్తి వల్ల, తపోశక్తి వల్ల, ఆధ్యాత్మిక శక్తి వల్ల, దైవ ప్రార్థనల వల్ల, నమాజులు, ప్రేయర్ల వల్ల చిన్న గుండు సూదిని కూడా కదిలించలేకపోతున్నారు. శతాబ్దాల కాలంలో వారి వల్ల మానవులకు ఉపయోగపడే పని ఏమైనా జరిగిందా? జరుగలేదు కదా? ఒక సన్యాసి మరి కొందరు సన్యాసులను తయారు చేసినట్టు ఒక మానసిక బలహీనుడు మరి కొంత మంది మానసిక బలహీనుల్ని తయారు చేయడం జరిగింది, జరుగుతూ ఉంది. గురువు భ్రమల్లో ఉంటూ తన శిష్యులను కూడా భ్రమల్లో ఉండమని ఉద్బోధిస్తాడు తప్ప నికరంగా సమాజానికి జరిగిన మేలు ఏముంటుంది? విజ్ఞానం అంటే జ్ఞానాన్వేషణ. అది మొదట ఒక సిద్ధాంతంగా రూపుదిద్దుకుంటుంది. ఆ సిద్ధాంతాన్ని ఆచరణలోకి మారిస్తే అది సాంకేతిక పరిజ్ఞానం అవుతుంది. ఆ రకంగా మానవ జీవన పరిణామ దశ నుండి మనిషి విజ్ఞాన శాస్త్రాన్ని సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతం చేసుకుంటూ వచ్చాడు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు. దాని ద్వారానే ఆధునికతను సంతరించుకుంటూ నిరతరం ప్రగతి పథంలోకి ప్రయాణిస్తూనే ఉన్నాడు. కంటికి కనబడని సూక్ష్మ జీవుల ఉనికిని కనుక్కోగలగడమైనా, గ్రహాంతర యానానికి పూనుకోవడమైనా వివేకవంతులైన శాస్త్రవేత్తలు స్పృహలో ఉండి సాధిస్తున్నవే. ధ్యానంలో మునిగిన వాళ్లు, సమాధిలోకి పోయిన వాళ్లు సమాజానికి కాదు కదా, కనీసం తమకు తాము కూడా ఏమీ చేసుకోలేకపోయారు. ఊర్ధలోకం కోసం, పుణ్యం కోసం, మోక్షం కోసం వెంపర్లాడుతున్న వారికి చుట్టూ ఉన్న ప్రపంచం కనబడదు. అందులో ఉన్న మంచిగాని, మానవత్వం గాని, సేవా భావన గాని కనపడదు. నూతన ఆవిష్కరణల కోసం పడే తపన వారిలో ఉండదు. కొత్త మార్గాల్ని అన్వేషించాలన్న ఉత్సుకత ఉండదు. వేల ఏళ్ల నాడు పూర్వీకులు నిర్ణయించిన మార్గదర్శకాలే వారికి ఆదర్శం. ఎవరైనా సరే, పుచ్చిపోయిన కర్ర పట్టుకుని ఎవరి మీదా అజమాయిషీ చేయలేరు కదా? కాని, వారు ఆ విషయం గ్రహించుకోరు. వేల ఏళ్ల నాటి సంప్రదాయపు కర్రలతో ఇటు సమకాలీన, అటు భవిష్యత్తు తరాల్ని అజమాయిషీ చేయాలనుకుంటారు. వారి ఆలోచనలు ఎక్స్ పైరీ అయిపోయిన మందు ల్లాంటివని, అవి సమాజానికి హాని చేస్తాయని గ్రహించుకోరు. విజ్ఞాన శాస్త్రం ఎప్పుడూ నిత్య నూతనం గనుక, నిరంతరం మారుతూ తనను తాను అప్‌డేట్ చేసుకుంటుంది. అందువల్ల అది ఎక్స్‌పైర్ అయ్యే ప్రసక్తే ఉండదు. ఇప్పుడు మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. కాలం చెల్లిన విధానాన్ని, విలువల్ని పట్టుకుని వ్రేలాడుదామా? లేక కాలంతో పాటు వేగంగా ముందకు కదులుదామా? మరొక ముఖ్య విషయమేమంటే సైన్సు అనేది ఏదో ఒక రంగానికి చెందిన ‘విజ్ఞాన శాస్త్రం’ మాత్రమే కాదు. సైన్సు అంటే సత్యాన్వేషణలో ఉపయోగించే ఒక పరికరం! అయితే, దాన్ని ఉపయోగించే తీరును బట్టే మళ్లీ.. ఫలితాలుంటాయి. హెచ్. నరసింహయ్య బెంగళూరు విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్స్‌లర్‌గా ఉన్నప్పుడు వైజ్ఞానిక దృక్పథం గురించి డిగ్రీ స్థాయి విద్యార్థులకు ఒక పాఠ్యగ్రంథం ఏర్పాటు చేశారు. తలిదండ్రులు, ఉపాధ్యాయులు వైజ్ఞానిక స్పృహ కలిగి ఉంటే, అది పిల్లలకు లాభదాయకమవుతుంది. అలా అలా రాబోయే తరాలు లాభపడతాయి. వైజ్ఞానిక దృక్పథం గురించి మనం మన రాజ్యాంగంలో పొందుపర్చుకున్న అంశాన్ని నిరంతరం గుర్తుంచుకుంటూ, భావి తరాల్ని తీర్చి దిద్దుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అలాగే CHANGE IS THE PHENOMINON OF LIFE అనేది కూడా గుర్తుంచుకోవాలి.

డా. దేవరాజు మహారాజు

Article about Modern Science

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News