Sunday, April 28, 2024

కశ్మీర్ ఫైల్స్‌కు జాతీయ సమైక్యత అవార్డా?: ఒవైసీ అభ్యంతరం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ది కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని 69వ జాతీయ చలనచిత్ర అవార్డులలో జాతీయ సమైక్యతపై ఉత్తమ చలన చిత్రంగా నర్గీస్ దత్ అవార్డుకు ఎంపిక చేయడం పట్ల ఎఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర అభ్యంతరం తెలిపారు.
ది కశ్మీర్ ఫైల్స్ జాతీయ సమైక్యతను పెంపొందించే చిత్రమా అని శుక్రవారం ఒక ప్రకటనలో అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు.

ముస్లింలను దుర్భాషలాడారు, విద్వేష ప్రసంగాలు చేశారు, ఈ కల్పిత చిత్రాన్ని ప్రదర్శించిన తర్వాత విద్వేషపూరిత వాతావరణాన్ని సృష్టించారు, కశ్మీరీలను నిందించారు అంటూ ఒవైసీ వ్యాఖ్యానించారు. కల్పిత కథతో ది కశ్మీర్ ఫైల్స్ నిర్మించారని, ఇలాంటి చిత్రాలను ప్రధాని నరేంద్ర మోడీ పెంచిపోషిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా కేరళ స్టోరీ చిత్రాన్ని కూడా ప్రధాని ప్రోత్సహించారని, ఇటువంటి చిత్రాలను ప్రోత్సహించడమే ప్రధాని పనిగా పెట్టుకున్నారా అంటూ ఒవైసీ ప్రశ్నించారు.

విద్వేషాన్ని వ్యాప్తి చేస్తూ సమాజంలో తప్పుడు అభిప్రాయాలను సృష్టించే ఈ చిత్రానికి జాతీయ సమైక్యతా అవార్డును ప్రకటించారని ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అది కూడా భిన్న మతాలకు, భిన్న భాషలకు నెలవైన భారత్‌లో ప్రజల మధ్య సమైక్యత కోసం విశేషంగా కృషి చేసిన నర్గీస్ దత్ పేరిట ఇచ్చే అవార్డుకు ఈ చిత్రాన్ని ఎంపిక చేశారని ఆయన విమర్శించారు.

కాగా..తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కూడా ది కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని జాతీయ సమైక్యత అవార్డుకు ఎంపిక చేయడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చవకబారు రాజకీయాల కోసం జాతీయ చిత్ర అవార్డుల ప్రతిష్ట విషయంలో రాజీపడడం తగదని ఆయన ప్రకటించారు. సాహిత్యం, చలనచిత్ర అవార్డులలో రాజకీయ పక్షపాతం ఉండకూడదని ఆయన పేర్కొన్నారు.

ఇలా ఉండగా జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ది కశ్మీర్ ఫైల్స్ చిత్రానికి జాతీయ సమైక్యత అవార్డును ప్రకటించడాన్ని ఎద్దేవా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News