Sunday, April 28, 2024

అరకొర సౌకర్యాలతో ఇబ్బందులు…. విండీస్ బోర్డుపై అశ్విన్ ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

చెన్నై: భారత్‌తో జరుగుతున్న సిరీస్‌లో కనీస సౌకర్యాలు కల్పించడంలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు పూర్తిగా విఫలమైందని భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విమర్శించాడు. విండీస్‌తో జరుగుతున్న టి20 సిరీస్‌లో తమకు సౌకర్యాలు కూడా లేవని టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్య వాపోయిన విషయం తెలిసిందే. దీనిపై అశ్విన్ కూడా తన యూట్యూబ్ ఛానెల్‌లో స్పందించాడు. టెస్టు సిరీస్‌లో కూడా విండీస్ బోర్డు సరైన సౌకర్యాలు కల్పించడంలో విఫలమైందన్నాడు. మైదానాల్లో మౌలిక సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయన్నాడు. కనీసం పిచ్‌పై గ్రాస్ కూడా లేదు. నెట్స్ కూడా పాతవే. మైదానంలో కూడా తమకు ఎలాంటి సదుపాయాలు కల్పించలేదు. ఇతర దేశాల్లో పర్యటించినప్పుడూ ఎప్పుడూ కూడా ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదన్నాడు. ఆయా దేశాల క్రికెట్ బోర్డులు మైదానాల్లో అధునాతన సౌకర్యాలు కల్పించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్న సమయంలో విండీస్ బోర్డు తిరోగమనంలో ప్రయాణించడం తనకు ఆశ్చర్యం కలిగిస్తుందన్నాడు.

వెస్టిండీస్ క్రికెట్ రోజురోజుకు తీసికట్టుగా తయారు కావడానికి ఆ దేశ బోర్డు వ్యవహరిస్తున్న తీరే ప్రధాన కారణమని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ఇప్పటికైనా విండీస్ క్రికెట్ బోర్డు మైదానాల అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నాడు. పరిస్థితి ఇలాగే ఉంటే విదేశీ జట్లు విండీస్ పర్యటనకు వచ్చేందుకు కూడా ఇష్టపడవని అశ్విన్ స్పష్టం చేశాడు. విండీస్‌తో తాము రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడామని, ఆతిథ్యం ఇచ్చిన రెండు గ్రౌండ్‌లలో కూడా కనీస సౌకర్యాలు లేవన్నాడు. బార్బడోస్‌లో కనీసం పచ్చిక కూడా లేదన్నాడు.

నెట్స్ కూడా చాలా పాతవిగా ఉన్నాయన్నాడు. మౌలిక వసతులు నాసిరకంగా ఉన్నాయి. ఇలాంటి స్థితిలో నాణ్యమైన క్రికెట్ ఆడేందుకు విండీస్ ఆటగాళ్లు తీవ్రంగా కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నాడు. ఇలాంటి పిచ్‌లపై ప్రాక్టీస్ చేసి భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ తదితర దేశాల్లో పర్యటించినప్పుడూ విండీస్ ఆటగాళ్లకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నాడు. ఇందుకే ప్రపంచ క్రికెట్‌లో విండీస్ పరిస్థితి రోజురోజుకూ తీసికట్టుగా తయారవుతుందన్నాడు. ఇప్పటికైనా విండీస్ బోర్డు దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టాలని అశ్విన్ సూచించాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News