Monday, April 29, 2024

కులగణన: ఆత్మరక్షణలో బిజెపి

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ ఎన్నికలకు సరిగ్గా తొమ్మిది నెలల ముందుగా బీహార్‌లో నితీశ్ కుమార్ ప్రభుత్వం విడుదల చేసిన కులాల సర్వే గణాంకాలు వరుసగా మూడోసారి 2024 ఎన్నికల్లో నరేంద్ర మోడీ గెలుపు అనివార్యం అంటూ బిజెపి వేసుకుంటున్న అంచనాలను సవాల్ చేసే విధంగా ఉన్నాయి. ఇప్పటికే ప్రతిపక్షాలు ఉమ్మడిగా పోటీ చేయడం అసాధ్యం అనే భరోసాతో రాజకీయంగా ఎదురు లేకుండా వస్తున్న మోడీకి ఎంతో శ్రమించి ప్రతిపక్షాలను ఒక చోటకు తీసుకొచ్చి ‘ఇండియా’ కూటమి ఏర్పాటులో కీలక పాత్ర వహించడం ద్వారా నితీశ్ కుమార్ కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఇప్పటికే సుమారు 400 సీట్లలో ప్రతిపక్షాలు ఒకే అభ్యర్థిని పోటీ కి దింపే ప్రయత్నం చేస్తుండడంతో కంగారులో మహిళా రిజర్వేషన్ బిల్లు, దేశం పేరు మార్పు, జమిలి ఎన్నికలు అంటూ పొంతనలేని అంశాలను తెరపైకి తెస్తున్నారు.

ఓ బిసి ప్రధానిగా ఉండడాన్ని సహింపలేక పోతున్నారు’ అంటూ తరచూ ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్న ప్రధాని మోడీ వ్యూహాత్మకంగా ఒబిసి ఓటర్లను తన వైపు తిప్పుకోవడంలో విజయం సాధిస్తున్నారు. వాజపేయి సారథ్యంలో బిజెపి అధికారంలో ఆరేళ్ళు వున్నప్పటికీ ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లోని అగ్రవర్ణాలు, ఒబిసిలలోని ముందున్న వర్గాల మద్దతు మాత్రమే ఆ పార్టీకి పరిమితం అవుతున్నది. అయితే ఒబిసిలలో అట్టడుగు వర్గాలను ఆకట్టుకోవడం ద్వారా 2009 కన్నా దాదాపు రెట్టింపు ఓట్లు 2014లో పొందగలిగారు.బీహార్ సర్వే వెల్లడితో వివిధ రాష్ట్రాల్లోనూ ఈ దిశగా కులగణనకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒబిసిల ఓటు బ్యాంకుపై కన్నేసిన విపక్షాలు దేశవ్యాప్తంగా కులగణనకు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్‌లో తాము అధికారంలోకి వస్తే కులగణన జరుపుతామని కాంగ్రెస్ ప్రకటించింది. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లోనూ కులగణనను నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభు త్వం సన్నద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది.

దీంతో మోడీ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం, ఉమ్మడి పౌరస్మృతిపై లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారానికి బిజెపి సమాయత్తమవుతుండగా, దీనిని కులగణనతో తిప్పికొట్టి దాని ఒబిసి ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు విపక్షాలు వ్యూహాత్మకంగా అడుగువేస్తున్నట్లు స్పష్టం అవుతున్నది. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే కచ్చితంగా కులగణన చేపడతామని కాంగ్రెస్ తేల్చేసింది.ఈ నేపథ్యంలో మోడీ ప్రభుత్వం కూడా ఈ దిశగా నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితులు నెలకొంటున్నాయి. అందుకనే చాలా కాలంగా పెండింగ్‌లో గల షెడ్యూల్డ్ కులాల వర్గీకరణను బిజెపి తెరపైకి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవంక, ఒబిసిలలో వర్గీకరణ కోసం నియమించిన జస్టిస్ రోహిణి కమిషన్ నివేదికను గోప్యంగా వుంచిన ప్రధాని మోడీ బైటకు తీస్తారా? అనే ప్రశ్న తలెత్తుతుంది. మరోవంక, నితీశ్ కుమార్ కులగణనను ప్రకటించడం ద్వారా కేవలం బిజెపిని మాత్రమే కాకుండా కాంగ్రెస్‌ను సహితం ఇరకాటంలో పెడుతున్నారు.

2024 ఎన్నికలకు విపక్షాలను ఏకతాటిపైకి తేవడానికి నితీశ్ చొరవచూపగా, కర్ణాటక విజయం తర్వాత కాంగ్రెస్ దానిని హైజాక్ చేసిందని జెడియు, ఆర్‌జెడి నేతలు గుర్రుగా ఉన్నారు. ఇప్పుడు బీహార్‌లో కులగణనను విజయవంతం చేసిన ఉత్సాహంతో నితీశ్ ఇతర విపక్షాల మద్దతు కూడగట్టేందుకు కసరత్తు మొదలుపెట్టే అవకాశాలున్నాయి. వాయిదా వేస్తూ వస్తున్న ఇండియా కూటమి కన్వీనర్‌గా నితీశ్‌ను ప్రకటించక తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయి.వాస్తవానికి జనాభా గణాంకాలలో కులాలను పరిగణనలోకి తీసుకోవాలని శతాబ్ద కాలంగా దేశంలో వాదనలు వినిపిస్తున్నా యి. దేశంలో 1881లో బ్రిటిష్ పాలకులు తొలిసారి జనగణనతోపాటే కులగణన చేపట్టారు. బ్రిటిష్‌వారి హయాంలో చివరి సమగ్ర కులగణన 1931లో జరిగింది. ఇప్పటికీ ఆ డేటా ఆధారంగానే ప్రభుత్వాల సంక్షేమ కార్యక్రమాలు నడుస్తున్నాయి. స్వాతంత్య్రానంతరం గద్దెనెక్కిన ప్రభుత్వాలేవీ కులగణన దిశగా అడుగులు వేయలేదు. కేవలం ఎస్‌సి, ఎస్‌టి జనాభాను మాత్రమే గణిస్తున్నారు.అందుకు ప్రధాన కారణం దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు అన్ని అగ్రకులాల ఆధిపత్యంలో కొనసాగడమే.

దేశంలో ఒబిసి జనాభా 52% ఉంటుందని మండల్ కమిషన్ సూత్రీకరించింది. ఈ నివేదిక దేశ రాజకీయాలను ఒక కుదుపు కుదిపివేసింది. ముఖ్యంగా కీలకమైన ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలలో ఒబిసిలు రాజకీయంగా నిర్ణయాత్మక స్థితికి ఎదిగేందుకు దోహదపడింది. లాలూ ప్రసాద్, నితీశ్ కుమార్, ములా యంసింగ్ యాదవ్ వంటి బలమైన నేతలు తెరపైకి వచ్చారు.1951 నుంచి జనగణన జరిగిన ప్రతిసారీ కులాలవారీ జనాభా లెక్కలు సేకరించాలన్న డిమాండ్ వస్తూనే ఉంది. సుదీర్ఘ చర్చలు, రాజకీయ పోరాటాల తర్వాత 2011లో అప్పటి కాంగ్రెస్ సారథ్యంలోని యుపిఎ ప్రభుత్వం ‘సామాజిక ఆర్థిక కుల గణన (ఎస్‌ఇసిసి)’ చేపట్టాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా సామాజిక న్యాయం అనే వాదన బయలుదేరింది. చరిత్రాత్మకంగా పొందుపరచబడిన వెనుకబాటుతనం, అసమానతలను పరిష్కరించడానికి ఇటువంటి గణాంకాలు సహకరిస్తాయనే అభిప్రాయాలు బలపడుతున్నాయి. 1990వ దశకంలో కేంద్రం లో మండల్ కమిషన్ నివేదికను అమలు చేయడంతో విస్తృత రాజకీయ గందరగోళానికి దారితీసింది.

చరిత్రాత్మకంగా నిర్లక్ష్యానికి గురైన వారిని సమీకరించడం ద్వారా ఉత్తరాది రాష్ట్రాల్లో నూతన రాజకీయ పార్టీలు, నూతన రాజకీయ శక్తులు ఆవిర్భవించాయి. అయితే అప్పటికే దక్షిణాదిన తమిళనాడులో డిఎంకె, తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌టి రామారావు, కర్ణాటకలో దేవెగౌడ వంటి వారు సహితం ఒబిసి వర్గాలకు రాజకీయంగా ప్రాధాన్యత ఇస్తూ ఉండడంతో ఈ ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఇటువంటి గణాంకాలు కేవలం సంక్షేమ పథకాల అమలులోనే కాకుండా ఉద్యోగాలు, రాజకీయాలలో సహితం ఒబిసి వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం లభించేటట్లు చేయగలవనే విశ్వాసం నెలకొంటుంది.కులగణన ‘హిందుత్వ’ అస్త్రాన్ని బలహీనపరుస్తుందని భయంతో బిజెపి తీవ్రంగా ప్రతిఘటిస్తూ వస్తున్నది.బీహార్‌లో నితీశ్ కుమార్ ప్రభుత్వం అందుకు పూనుకొంటే న్యాయస్థానాల ద్వారా ఆ ప్రయత్నాన్ని ప్రతిఘటించేందుకు విఫలయత్నాలు చేసింది. ఇప్పుడు బీహార్ ప్రభుత్వం కుల గణాంకాలను ప్రకటించడంతో ‘కులాల పేరుతో దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నారు’ అంటూ ప్రతిపక్షాలపై విరుచుకుపడటం ద్వారా ప్రధాని తన అసహనాన్ని వ్యక్తం చేశారు.

‘పేదలు’ అసలైన వెనుకబడినవారంటూ భాష్యం చెప్పుకొచ్చారు.ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా చెప్పుకుంటున్న భారత్‌లో చరిత్రాత్మక అన్యాయాన్ని పరిష్కరించడానికి కుల ఆధారిత రిజర్వేషన్లు ఒక ముఖ్యమైన సాధనంగా పరిగణిస్తున్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో విద్య, ఉద్యోగాలలో కుల ఆధారిత రిజర్వేషన్లను అమలు పరుస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళవుతున్నా ఇప్పటికే జాతీయ స్థాయి లో కీలకంగా వ్యవహరించిన కాంగ్రెస్, బిజెపి, వామపక్షాలు, పలు సోషలిస్టు పార్టీలలో ఏవీ ఒబిసి వర్గాల నుండి అధ్యక్షులను ఎన్నుకోలేదు. కాంగ్రెస్‌కు ఇప్పటి వరకు ఒబిసి అధ్యక్షుడు లేరంటూ బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా పేర్కొనడం గమనార్హం. నేడు ‘బిసి ప్రధాని’గా బిజెపి ప్రచారం చేసుకుంటున్నారు. నరేంద్ర మోడీ మంత్రివర్గంలో, ప్రభుత్వంలో కీలక స్థానాలలో అగ్రవర్గాల వారి ఆధిపత్యమే కొనసాగుతోంది. కీలక మంత్రిత్వ శాఖలు అగ్రవర్గాల వారిచేతులలోనే ఉన్నాయి.

తాజాగా పార్లమెంట్ ఆమోదం పొందిన మహిళా బిల్లులో ఒబిసిలకు ప్రత్యేక కోటా లేకపోవడంతోనే దశాబ్దాలుగా అమలుకు నోచుకోలేదు. 2008 నాటి మహిళా బిల్లులో యుపిఎ ప్రభుత్వం ఒబిసి సబ్ కోటాను చేర్చనందుకు ‘100% చింతిస్తున్నాను’ అని రాహుల్ గాంధీ చెప్పడం ద్వారా నేడు దేశ రాజకీయాలను ఈ అంశం ఎటువంటి ప్రభావం చూపనుందో వెల్లడి చేస్తుంది. కొద్ది రోజుల క్రితం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన ఒబిసి గుర్తింపు గురించి కాంగ్రెస్‌పై దాడి చేస్తూ ప్రతిపక్ష పార్టీ తనను క్రమం తప్పకుండా అవహేళన చేయడం ద్వారా ఒబిసిలందరినీ అవమానిస్తుందని ఆరోపించారు. ఇప్పుడు నితీశ్ కుమార్ వదిలిన కులగణన అస్త్రం బిజెపిని ఆత్మరక్షణలో పడవేసింది. ఇప్పటి వరకు యుపి, బీహార్ లలో అత్యంత వెనుకబడిన ఒబిసి వర్గాల మద్దతును కూడదీసుకొంటూ బిజెపి తన బలం పెంచుకొంటూ వస్తున్నది.

కానీ, ఇప్పుడు కులగణనతో పట్టణ ప్రాంతాలలోనే అగ్ర వర్గాలు, మధ్య తరగతి వర్గాలలో సాంప్రదాయకంగా నెలకొన్న మద్దతును నిలబెట్టుకుంటూ, అత్యంత వెనుకబడిన ఒబిసి వర్గాలను ఆకట్టుకోవడం బిజెపికి పెను సవాల్‌గా మారనుంది. ఈ వర్గాలను ఆకట్టుకోవడమే నితీశ్ కుమార్ కులగణన లక్ష్యంగా కనిపిస్తున్నది. మరోవంక రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు విధించిన 50% పరిమితిని మార్చాలనే వాదన సహితం ఇప్పుడు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. పరిపాలనలో ‘సమర్థత’ ను కొనసాగించాలనే అవసరాన్ని నొక్కి చెబుతూ సుప్రీంకోర్టు 1992లో ‘ఇంద్ర సాహ్నీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ లో ఇచ్చిన తీర్పులో రిజర్వేషన్లకు 50% పరిమితిని నిర్ణయించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News