Monday, April 29, 2024

చైనా అంతరిక్ష కేంద్రానికి ముగ్గురు వ్యోమగాములు

- Advertisement -
- Advertisement -

చైనా అంతరిక్షకేంద్రానికి ముగ్గురు వ్యోమగాములు
ముగ్గురిలో ఒకరు మొదటి పౌర వ్యోమగామి యూనివర్శిటీ ప్రొఫెసర్
నింగిలోకి దూసుకెళ్లిన షెంజు 16
బీజింగ్/జియుక్వాన్: ఒక పౌర వ్యోమగామితోసహా మొత్తం ముగ్గురు వ్యోమగాములతో చైనా మంగళవారం తన సొంత అంతరిక్ష కేంద్రం టియాంగాంగ్‌కు మూడో విడతగా విజయవంతంగా పంపగలిగింది. వాయువ్య చైనా లోని జియుక్వాన్ శాటిలైట్ లాంచ్ కేంద్రం నుంచి మంగళవారం ఉదయం 9.31 గంటలకు లాంగ్ మార్చ్ 2ఎస్ రాకెట్ ద్వారా షెంజు 16 వ్యోమనౌకను ప్రయోగించింది. ప్రయోగించిన పది నిమిషాల తరువాత భూమికి 400మీ ఎత్తున షెంజు 16 మాడ్యూల్ రాకెట్ నుంచి విడిపోయింది.

చైనా సొంత అంతరిక్షకేంద్రం పూర్తిగా అందుబాటు లోకి వచ్చిన తరువాత వ్యోమగాములు వెళ్లడం ఇదే మొదటిసారి అని చైనా మ్యాన్డ్ స్పేస్ ఏజెన్సీ (సిఎంఎస్‌ఎ) డిప్యూటీ డైరెక్టర్ లిన్ జికియాంగ్ వెల్లడించారు. ఇప్పటివరకు చైనా అంతరిక్షంలోకి వెళ్లిన వారంతా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన వ్యోమగాములు కాగా, ఈసారి పౌర వ్యోమగామి కూడా వెళ్లడం విశేషం. ఇప్పుడు వెళ్లిన వారిలో మిషన్ కమాండర్ జింగ్ హైపింగ్, స్పెషలిస్ట్ ఇంజినీర్ జూ యాంగ్జూ, పేలోడ్ నిపుణుడు గుయ్ హైచావ్ ఉన్నారు. వీరిలో జింగ్ హైపింగ్ నాలుగోసారి అంతరిక్షం లోకి వెళ్తున్న చైనా వ్యోమగామిగా ఈయనకు రికార్డు ఉంది. షెంజు 1, షెంజు 9. షెంజు 11 అంతరిక్షయాత్రల్లో కూడా ఈయన పాల్గొన్నారు. చివరి రెండు మిషన్లకు కమాండర్‌గా పనిచేశారు.

రెండో వ్యోమగామి గుయ్ హై చావో బీజింగ్ యూనివర్శిటీ ప్రొఫెసర్‌గా ఉంటున్నారు. అంతరిక్షం లోకి మొదటిసారి వెళ్తున్న పౌర వ్యోమగామిగా ఘనత ఈయనదే. జూయాంగ్‌జూ కూడా మొదటిసారి అంతరిక్షం లోకి వెళ్తున్నారు. వీరి కన్నా ముందు షెంజు 15 వ్యోమనౌకపై అంతరిక్ష కేంద్రానికి వెళ్లి నవంబర్ నుంచి అక్కడ ఉంటున్న వ్యోమగాములు వీరు వెళ్లగానే అక్కడ నుంచి తిరుగు ప్రయాణమవుతారు. ఇప్పుడు వెళ్లిన వారు అంతరిక్ష కేంద్రంలో వివిధ రంగాలకు సంబంధించి అనుకున్న లక్షాల మేరకు భారీ ఎత్తున ప్రయోగాలు నిర్వహిస్తారు. అత్యంత ఆధునిక క్వాంటమ్ అంశంపైన, అత్యధిక కచ్చితత్వ స్పేస్‌టైమ్ ఫ్రీక్వెన్సీసిస్టమ్స్, సాధారణ సాపేక్షికత, జీవి మూలాల పైన ఉన్నత స్థాయిలో శాస్త్రీయ ప్రయోగాలు చేస్తారు. చైనా నిర్మించిన అంతరిక్ష కేంద్రానికి ఎంతో ప్రత్యేకత ఉంది. దీ

నికి రెండు రోబో భుజాలు ఉన్నాయి. ఇవి చాలా పొడవు. ఎంత పొడవంటే అంతరిక్షం లో ఉన్న శాటిలైట్లను, వ్యర్ధాలను కూడా ఇవి పట్టుకోగలవు. చైనా అంతరిక్ష కేంద్రం పూర్తిగా పనిచేసినట్టయితే రష్యా మాదిరిగా సొంత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని సమకూర్చుకున్న ప్రపంచ స్థాయి ఘనత సాధిస్తుంది. ప్రస్తుతం రష్యా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)అనేక దేశాలకు సహకరించే కేంద్రంగా పనిచేస్తోంది. ఈ కేంద్రం కూడా 2030 నాటికి ఉపసంహరణ కాబోతోంది. ప్రస్తుతం చైనా ముగ్గురు వ్యోమగాములను పంపిన లాంగ్ మార్చ్ రాకెట్ మిషన్ 475గా రికార్డు కెక్కింది. 2030 నాటికి చంద్రుని పైకి మానవులను పంపిస్తామని లక్షంగా చైనా పెట్టుకుంది. చంద్రుని దక్షిణ ద్రువం పైని గడ్డకట్టిన నీటిపై తవ్వకాలు జరపడానికి 2025 నాటికి రెండోసారి వ్యోమగాములను పంపుతామని నాసా ప్రకటించిన తరువాత చైనా తన చంద్రయాత్రను ప్రకటించడం విశేషం.

Also Read: చైనా స్వంతంగా నిర్మించిన ప్రయాణికుల విమానం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News