Sunday, April 28, 2024

జాక్ మాకు చెక్ పెట్టిన చైనా!

- Advertisement -
- Advertisement -

జాక్ మా, అలీ బాబా పేరు ఏదైతెనేం, వ్యక్తి సంస్ద పేరు విడదీయలేనంతగా మారిపోయాయి. కొద్ది నెలల క్రితం జాక్ అదృశ్యమైనట్లు వార్తలు వచ్చాయి. జనవరిలో దర్శనమిచ్చిన తరువాత కట్టుకథలుపిట్టకథలకు తెరపడింది. తాజాగా చైనా ప్రభుత్వం జాక్‌మా కంపెనీల పెట్టుబడులపై తీవ్ర ఆంక్షలు విధించిందన్న సమాచారంతో మరోసారి వార్తలకు ఎక్కాడు. ఆలీబాబా, ఆంట్ తదితర గ్రూపు కంపెనీల నుంచి అతగాడు బయటికి పోవటం, కొన్ని వాటాల విక్రయం, మరికొన్నింటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటం వంటి అంశాల గురించి వార్తలు వస్తున్నాయి. తన వాటాలను కొన్నింటిని ప్రభుత్వానికి స్వాధీనం చేస్తానని నవంబరు నెలలోనే జాక్ మా ప్రతిపాదించినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ గతంలో రాసింది. జనవరి నుంచి పీపుల్స్ బాంక్ ఆఫ్ చైనా (మన రిజర్వుబ్యాంకు వంటిది), బ్యాంకింగ్, బీమా నియంత్రణ కమిషన్ వివిధ అంశాలకు సంబంధించి చర్చలు జరుపుతున్నాయి.

ఇంత వరకు ఏ విషయమూ ఇదమిత్థంగా తెలియదు. ఒకటి మాత్రం స్పష్టం, చైనా ప్రభుత్వం జాక్ మాను అదుపులోకి తెచ్చింది. దేశంలోని ఇతర ప్రైవేటు సంస్ధలను నిరుత్సాహ పరచకుండా ఒక వైపు అడుగులు వేసూ, మరో వైపు సోషలిస్టు వ్యవస్థకే ఎసరు తెచ్చే విధంగా బడా సంస్ధలను అనుమతించబోమనే సందేశాన్ని జాక్ మా ద్వారా చైనా కమ్యూనిస్టు పార్టీ ఇచ్చిందని చెప్పవచ్చు. ఇక్కడ అనేక మందిలో తలెత్తే సందేహం ఏమంటే అసలు అలాంటి బడా సంస్ధలను మొగ్గలోనే తుంచివేయకుండా ఎందుకు ఎదగనిచ్చింది? ప్రపంచ కార్పొరేట్ శక్తుల ప్రతినిధులు చెబుతున్నట్లుగా ఈ చర్యలతో చైనా నవకల్పనలు కుంటుపడతాయా? అభివృద్ధికి ఆటంకం కలుగుతుందా? కొంత మంది చైనాలో జాక్ మా యుగం ప్రారంభమైందని ప్రచారం చేశారు. అది నిజమే అని అతగాడు భ్రమించి చైనా వ్యవస్ధనే సవాలు చేశాడా? వాస్తవానికి చైనా యుగంలో జాక్ మా వంటి వారు కొందరు తప్ప వ్యక్తుల యుగాలు ఉండవు.

దీన్ని వివరిస్తే కొంత మందికి జీర్ణం గాకపోవచ్చు, అయినా తప్పదు.అందువలన క్లుప్తంగా చెప్పుకుంటే పెట్టుబడిదారీ విధా నం అంటే శ్రమను అమ్ముకొనే ఒప్పందం మేరకు పని, ఆ మేరకు వేతనం. మిగతా వాటితో సంబంధం ఉండదు. సోషలిజం అంటే శక్తికొద్దీ పని, శ్రమకొద్దీ ప్రతిఫలం. మొదటి దానిలో లాభం లేదా మిగులు పెట్టుబడిదారుల స్వంతం అవుతుంది. రెండవ దానిలో శ్రామికులకు గౌరవప్రదమైన వేతనాలతో పాటు మిగులు సామాజికపరం అవుతుంది. దాన్ని వివిధ రూపాలలో అందరికీ వినియోగిస్తారు. సోషలిజం అంటే దరిద్రాన్ని పారదోలటం తప్ప దాన్ని అలాగే ఉంచి అందరికీ పంచటం కాదు. సోషలిజం దాని తరువాత కమ్యూనిం అంటే శక్తికొద్దీ పని, అవసరం కొద్దీ వినియోగం. ఇప్పటికైతే కమ్యూనిజం ఒక ఉత్తమ భావన. మరి దీనికి ప్రాతిపదిక లేదా అంటే, ఉంది. ఆదిమ కమ్యూనిజం అనే దశలో నాటి మానవులు సామూహిక శ్రమ ద్వారా సాధించిన వాటిని అవసరం కొద్దీ పంచుకొనేవారు గనుక ఆ స్ధాయిలో ఉత్పత్తి సాధిస్తే ఆధునిక కమ్యూనిజం సాధ్యమే అన్నది మార్క్స్ ఎంగెల్స్ భావన.

దాన్ని సాధించాలంటే జనం అందరి అవసరాలు తీరేంతగా ఉత్పత్తిని, ఉత్పాదక శక్తులను పెంచటం ఎంత కాలంలో సాధ్యం అవుతుంది అంటే ఎవరమూ చెప్పలేము. వ్యక్తిగత ఆసక్తి కొద్దీ ఒకరు కత్తి పట్టుకొని వైద్యపరమైన శస్త్ర చికిత్సలు చేయవచ్చు, మరొకరు అదే కత్తితో అందమైన క్రాఫులూ చేయవచ్చు.ఏదిచేసినా సమాజం తగిన గుర్తింపు, గౌరవంతో పాటు వారి పూర్తి అవసరాలు తీరుస్తుంది. దోపిడీ, పీడన, యుద్ధాలు ఉండవు, మారణ హోమాలు జరగవు. అదే కమ్యూనిజం భావన. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ఆధునిక పెట్టుబడిదారీ విధానం అమల్లో ఉన్న ప్రాంతాలతో పాటు కొండకోనలకే పరిమితమై దుస్తులు కూడా వేసుకోని ఆది మానవుల లక్షణాలను ఇంకా కలిగి ఉన్న వారి వరకు వివిధ దశల్లో ఉన్న జనం ఉన్నారన్నది వాస్తవం. పెట్టుబడిదారీ వ్యవస్ధ సంక్షోభంలో ఉన్నపుడు దాని బలహీనపు లింకును తెగగొట్టి సోషలిస్టు వ్యవస్ధను ఏర్పాటు చేయవచ్చు అన్నది రష్యాలో కమ్యూనిస్టులు నిరూపించారు.

చైనాలో సోషలిస్టు వ్యవస్ధను ఏర్పాటు చేసిన వారు ఈ అనుభవాన్ని తీసుకొని తమదైన శైలిలో ఆ వ్యవస్ధను ముందుకు తీసుకుపోతున్నామని చెబుతున్నారు. దానిలో భాగమే జాక్ మా వంటి వారు, ఆంట్ వంటి సంస్ధలూ వాటి మీద చర్యలూ అని చెప్పవచ్చు. రష్యాలో విప్లవం వచ్చిన నాటికి ఆ ప్రాంతం అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ వ్యవస్ధలలో ఒకటి. అదే చైనా విప్లవ సమయంలో ఫ్యూడల్ సంబంధాలతో ఉన్న వ్యవస్ధ, పారిశ్రామికంగా మన కంటే వెనుకబడిన దేశం. పెట్టుబడిదారీ విధానం ఉన్నత స్ధాయిలోకి రావటం అంటే ఉత్పాదక శక్తులు గణనీయంగా అభివృద్ధి చెంది ఉత్పత్తి ఇబ్బడిముబ్బడి కావటం. దానితో పాటు దోపిడీ విపరీతంగా పెరిగి దాన్ని కూలదోసే సైన్యాన్ని కూడా అది పెంచుతుందన్నది కమ్యూనిస్టులు చెప్పే సిద్ధాంతం. ఈ నేపథ్యంలో చూసినపుడు చైనాలో సోషలిస్టు వ్యవస్థ లక్ష్యంగా ఉన్న కమ్యూనిస్టు పార్టీ అధికారానికి వచ్చిన తరువాత ఉత్పాదక శక్తుల పెరుగుదల ఆశించిన మేరకు పెరగలేదు.

కనుకనే డెంగ్‌సియావో పింగ్ సంస్కరణలలో భాగంగా విదేశీ పెట్టుబడులు, పెట్టుబడిదారులను చైనాకు ఆహ్వానించారు. దేశీయంగా కూడా పరిమితుల మేరకు అనుమతించారు.దీనికి తోడు జాక్ మా వంటి వారు ఐటి, దాని అనుబంధ రంగాలలో ప్రవేశించి అనూహ్య స్థాయిలో సంపదలను సృష్టించారు, బిలియనీర్లుగా పెరిగిపోయారు. అయితే వారు సోషలిస్టు వ్యవస్ధకే ఎసరు తెచ్చే సూచనలు వెల్లడిస్తే కమ్యూనిస్టు పార్టీ అనుమతిస్తుందా?

జాక్ మా వంటి వారి పెరుగుదలను చూసి ఇతర దేశాల్లో ఉన్న కమ్యూనిస్టుల్లో కొంత మంది ఇంకేముంది అక్కడ పెట్టుబడిదారీ విధానం అమల్లోకి వచ్చింది అని సూత్రీకరించారు, విచారపడ్డారు. ఇదేమిటని పెదవి విరిచారు. అదే జాక్ మా మీద ఆంక్షల విషయం వెల్లడి కాగానే ప్రపంచంలోని కమ్యూనిస్టు వ్యతిరేకులు, పెట్టుబడిదారులందరూ గుండెలు బాదుకున్నారు. మేము ఇలా అనుకోలేదు అంటూ మొసలికన్నీరు కార్చారు. ఇంకేముంది చైనా తిరోగమనం ప్రారంభం అయిందని చంకలు కొట్టుకున్నారు. ఒకటి స్పష్టం, గ్లాస్‌నోస్త్ పేరుతో నాటి సోవియట్ యూనియన్‌లో అమలు చేసిన అనుభవాలు చూసిన తరువాత తియన్మెన్ స్కేర్‌లో విద్యార్ధుల పేరుతో జరిపిన ప్రతీఘాత ప్రయత్నాన్ని చైనా కమ్యూనిస్టు పార్టీ మొగ్గలోనే తుంచి వేసింది. తాను పెరిగి, ఇతర సంస్థలను మింగివేసేందుకు పూనుకున్నట్లు జాక్ మా గురించి వచ్చిన వార్తలు, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినట్లు వెల్లడైన సమాచారం మేరకు తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి.

అలీబాబా, ఆంట్ ఇతర కంపెనీల్లోని జాక్ మా వాటాలను చిన్న మదుపర్లకు విక్రయిస్తారని, ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని పరిపరి విధాలుగా వార్తలు వస్తున్నాయి. ఏమి జరిగినప్పటికీ ప్రభుత్వ అనుమతుల మేరకు ఉంటాయి. గుత్త సంస్ధలు పెరగకుండా నిరోధించే చట్టాలు అన్ని దేశాలలో మాదిరి చైనాలో కూడా ఉన్నాయి. వాటిని లోపభూయిష్టంగా తయారు చేయటం, సరిగా అమలు జరపని కారణంగా అనేక దేశాలలో సంస్ధలు ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పెరిగి ప్రభుత్వాలనే శాసిస్తున్నాయి. చైనాలో వాటి అమలుకు నిదర్శనమే తాజా పరిణామాలు అని చెప్పవచ్చు. ఆంట్ కంపెనీ 37 బిలియన్ డాలర్ల వాటాల విక్రయానికి పూనుకోగా గతేడాది డిసెంబరులో చైనా ప్రభుత్వం అడ్డుకున్నది. ఈ చర్యలను చైనా అధినేత జీ జిన్‌పింగ్ తన వ్యతిరేకులను అణచివేసే వాటిలో భాగంగా తీసుకుంటున్నట్లు చిత్రిస్తున్నారు. మన దేశంలో కాంగ్రెస్ లేదా బిజెపి ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ప్రత్యక్ష రాజకీయాల్లో తమ ప్రత్యర్ధులుగా ఉంటూ వాణిజ్య, పారిశ్రామికవేత్తలుగా ఉన్న వారి మీదనే దాడులు జరుగుతాయి.

1999లో కేవలం 20 మంది స్నేహితులు, సిబ్బందితో తన స్వంత ఫ్లాట్‌లో ఐటి కార్యకలాపాలను ప్రారంభించిన జాక్ మా కేవలం రెండు దశాబ్దాల కాలంలోనే 2020 నాటికి ఏడాదికి 72 బిలియన్ డాలర్ల ఆదాయం తెచ్చే కంపెనీలకు అధిపతి అయ్యాడు. కెఎఫ్‌సి కంపెనీ తమ దుకాణంలో ఉద్యోగానికి పనికి రాడని జాక్ ను తిరస్కరించింది. తాను జన్మించిన పట్టణానికి వచ్చే విదేశీయుల పరిచయాలతో ఆంగ్లం నేర్చుకున్న జాక్ తరువాత ఆంగ్ల బోధకుడయ్యాడు.అదే సమయంలో ఇంటర్నెట్ చైనాలో ఊపందుకుంటున్నది. తన ఆంగ్లపరిజ్ఞానంతో వాణిజ్య సంస్థలకు వెబ్ పేజీలను తయారు చేయటంతో తన కార్యకలాపాలను ప్రారంభించి ఆ రంగంలో ఉన్నత స్ధానాలకు ఎదిగాడు. ఇలాంటి వారెందరో తమ ప్రతిభతో బిలియనీర్లుగా మారారు. చైనాలో బిలియనీర్లుగా ఉన్న వారిలో ఇలాంటి వారే అత్యధికులు. స్వాతంత్య్రం వచ్చినపుడు మన దేశంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాని ప్రయివేటు సంస్ధలు ఇప్పుడు ప్రభుత్వ అండతో బడా సంస్ధలుగా ఎదిగి ప్రభుత్వ రంగాన్నే కొనుగోలు చేసే స్ధాయికి ఎదిగినట్లుగా, తమకు అనుకూలమైన విధానాలను అనుసరించాలని శాసిస్తున్నారు. జాక్ మా వంటి వారు చైనా ప్రభుత్వ విధానాలనే ప్రశ్నించే స్థాయికి ఎదిగారు.

దానికి పరాకాష్టగా గతేడాది అక్టోబరులో చేసిన ఒక ప్రసంగంలో తన అంతరంగాన్నిబయటపెట్టారు. దేశ ఆర్ధిక, నియంత్రణ, రాజకీయ వ్యవస్ధలను సంస్కరించాలని, వస్తు తనఖా లేదా ఆస్తి హామీ లేకుండా రుణాలు ఇవ్వని వడ్డీ వ్యాపార దుకాణ ఆలోచనల నుంచి బ్యాంకులు బయటపడాలని చెప్పారు.

ఇవి చైనా వ్యతిరేక శక్తులు చేస్తున్న ప్రచారానికి ప్రతిబింబం తప్ప మరొకటి కాదన్నది స్పష్టం. 2008లో ఇతర ధనిక దేశాల్లో వచ్చిన బ్యాంకింగ్ సంక్షోభం చైనాను తాకలేదు, దీనికి కారణం అక్కడి వ్యవస్ధపై ప్రభుత్వ అదుపు, ఆంక్షలు ఉండటమే. అలీబాబా ప్రభావం ఎంతగా పెరిగిపోయిందంటే దాన్ని అదుపులోకి తేవాల్సినంతగా అని సాంగ్ క్వింగ్‌హుయ్ అనే ఆర్ధికవేత్త వ్యాఖ్యానించాడు. చైనా మీద తరువాత కాలంలో వాణిజ్య యుద్దం ప్రకటించిన డోనాల్డ్ ట్రంప్ తాను అధికారం స్వీకరించిన తరువాత భేటీ అయిన తొలి చైనీయుడు జాక్ మా అన్నది చాలా మందికి గుర్తు ఉండకపోవచ్చు. తొలి పది రోజుల్లోనే న్యూయార్క్‌లో వారి భేటీ జరిగింది. అమెరికా వస్తువులను తన వేదికల ద్వారా చైనాలో మార్కెటింగ్ అవకాశాలు కల్పించి పది లక్షల మంది అమెరికన్లకు ఉపాధి కల్పిస్తామని జాక్ మా ఆ సందర్భంగా ట్రంప్‌కు వాగ్దానం చేసినట్లు వార్తలు వచ్చాయి.

ఒక పారిశ్రామికవేత్తగా అలా చెప్పటాన్ని తప్పు పట్టనవసరం లేదు. తమ దేశ అవసరాలు, వ్యూహంలో భాగంగా చైనా ప్రభుత్వమే జాక్ మా వంటి వాణిజ్యవేత్తలను ప్రోత్సహించింది. ఐక్యరాజ్యసమితి వేదికల మీద రాజులు, రాణులు, దేశాల అధ్యక్షులు, ప్రధానుల సరసన కూర్చోపెట్టింది. దాన్ని చూసి అది తన పలుకుబడే, గొప్పతనమే అనుకుంటే అది పతనానికి నాంది. ఎంత పెద్ద వారైనా తిరుగుతున్న చట్రం మీద కూర్చున్న జీవులు తప్ప చట్రాన్ని తిప్పే వారు కాదు. ఈ నేపధ్యంలో చైనాలో జరుగుతున్న పరిణామాలను చూడాల్సి ఉంది. వ్యవస్ధకు కంపెనీలు, వ్యక్తులు అనువుగా ఉండాలి తప్ప వ్యక్తులు, సంస్ధల కోసం వ్యవస్ధలు కాదని చైనా నాయకత్వం స్పష్టం చేయదలచుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News