Monday, April 29, 2024

అక్టోబర్ 4న సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరి పరీక్ష..

- Advertisement -
- Advertisement -

అభ్యర్థులకు ఫేస్ మాస్కులు తప్పనిసరి
పరీక్షా హాలులో సొంత శానిటైజర్లకు అనుమతి
అక్టోబర్ 4న సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరి పరీక్ష
గైడ్‌లైన్స్ ప్రకటించిన యుపిఎస్‌సి

Civil Services Preliminary Examination on October 4

న్యూఢిల్లీ: వచ్చే నెల 4న జరగనున్న సివిల్ సర్వీసెస్(ప్రిలిమినరి) పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా ఫేస్ మాస్కులను ధరించాల్సి ఉంటుందని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యుపిఎస్‌సి) గురువారం ప్రకటించింది. అభ్యర్థులు తమ సొంత శానిటైజర్లు తీసుకురావచ్చని అయితే, అవి ట్రాన్స్‌పరెంట్ సీసాలలో(ద్రవం కనిపించే రీతిలో) ఉండాలని తెలిపింది.
సివిల్ సర్వీసెస్ పరీక్షలు ప్రతి ఏటా మూడు దశలలో జరుగుతాయి. ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వూ దశలలో పరీక్షలు ఉంటాయి. ప్రధానంగా ఈ పరీక్షల ద్వారా ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్‌ఎస్‌తోపాటు ఇతర సర్వీసులకు అధికారులను యుపిఎస్‌సి ఎంపిక చేస్తుంది. అభ్యర్థులందరూ తప్పనిసరిగా ఫేస్ మాస్క్ లేదా ఫేస్ కవర్ ధరించాల్సి ఉంటుందని, అవి ధరించని వారిని పరీక్షలకు అనుమతించబోమని యుపిఎస్‌సి ఒక ప్రకటనలో తెలిపింది. పరీక్ష హాలులో కొవిడ్-19 నిబంధనల మేరకు భౌతిక దూరంతోపాటు వ్యక్తిగత పరిశుభ్రతను అభ్యర్థులు పాటించాల్సి ఉంటుందని పేర్కొంది.

ఈ ఏడాది ప్రిలిమినరీ పరీక్ష మే 31న జరగాల్సి ఉండగా దేశవ్యాప్త లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. అక్టోబర్ 4 ఆదివారం నాడు ప్రిలిమినరీ పరీక్ష జరుగుతుందని యుపిఎస్‌సి తెలిపింది. అభ్యర్థుల సౌకర్యార్థం ఇ-అడ్మిట్ కార్డులను యుపిఎస్‌సి తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. ఇ-అడ్మిట్ కార్డులను అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ ఔట్ తీసుకోవాలని, సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్,2020 తుది ఫలితాలు ప్రకటించేంత వరకు వీటిని అభ్యర్థులు తమ వద్ద భద్రంగా ఉంచుకోవాలని యుపిఎస్‌సి తెలిపింది. ఈ పరీక్ష కోసం పేపర్ అడ్మిట్ కార్డును జారీచేయబోమని తెలిపింది. ప్రిలిమినరి పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఇ-అడ్మిట్ కార్డు ప్రింట్ ఔట్‌ను పరీక్ష కేంద్రం వద్ద చూపించాలని పేర్కొంది. అభ్యర్థులు తమ ఇ-అడ్మిట్ కార్డులో పేర్కొన్న ఫోటో ఐడి కార్డును తమ వెంట తీసుకురావలసి ఉంటుందని తెలిపింది. ప్రిలిమినరి పరీక్ష ఉదయం 9.30 గంటలకు ఉదయం సెషన్, మధ్యాహ్నం 2.30 గంటలకు మధ్యాహ్నం సెషన్ జరుగుతాయని, పరీక్షా సమయానికి 10 నిమిషాల ముందే పరీక్షా కేంద్రంలోకి ప్రవేశం మూసివేయడం జరుగుతుందని, ప్రవేశం మూసివేసిన తరువాత ఎవరినీ లోపలకు అనుమతించడం జరగబోదని యుపిఎస్‌సి పేర్కొంది.

అభ్యర్థులు తమ వెంట బ్లాక్ (నలుపు) బాల్ పాయింట్ పెన్‌ను తీసుకురావాలని, ఓఎంఆర్ ఆన్సర్ షీట్లను, అటెండెన్స్ లిస్ట్‌ను నల్ల రంగు బాల్ పాయింట్ పెన్‌తోనే రాయాల్సి ఉంటుందని తెలిపింది. పరీక్ష హాలులోకి సాధారణ చేతి గడియారాలను మాత్రమే అభ్యర్థులు ధరించ వచ్చని, అయితే స్మార్ట్ వాచీలు, ప్రత్యేక కమ్యూనికేషన్ పరికరాలు కలిగిన ఎలెక్ట్రానిక్ వాచీలను అభ్యర్థులు ధరించడం నిషిద్ధమని యుపిఎస్‌సి స్పష్టం చేసింది. అటువంటి వాచీలు ధరించిన అభ్యర్థులను హాలులోకి అనుమతించబోమని తెలిపింది. మొబైల్ ఫోన్(స్విచాఫ్ చేసినప్పటికీ), పేజర్ లేదా ఏదైనా ఎలెక్ట్రానిక్ పరికరం, ప్రోగ్రామబుల్ డివైస్, పెన్ డ్రైవ్, స్మార్ట్ వాచెస్ తదితర స్టోరేజ్ పరికరాలు, కెమెరా లేదా బ్లూటూత్ డివైసెస్, మరే ఇతర ఎలెక్ట్రానిక్ పరికరాలు, క్యాలిక్యులేటర్లు వంటివి పరీక్ష హాలులోకి తీసుకురావడం నిషిద్ధమని యుపిఎస్‌సి తెలిపింది. పరీక్ష కేంద్రంలోకి విలువైన వస్తువులు, బ్యాగులు కూడా నిషిద్ధమని తెలిపింది. ఈ నిబంధనలు అతిక్రమించే అభ్యర్థులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని, భవిష్యత్తులో పరీక్షలకు లేదా ఎంపికకు కూడా డిబార్ చేయడం జరుగుతుందని యుపిఎస్‌సి హెచ్చరించింది.

Civil Services Preliminary Examination on October 4

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News