Monday, April 29, 2024

జగన్ పాలన – వెలుగు నీడలు

- Advertisement -
- Advertisement -

Free Electricity to AP Farmers Says CM Jagan

డిసెంబర్ 21న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి జన్మదినం సంద ర్భంగా ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 47 వత్సరాల వయస్కులైన జగన్మోహన్ రెడ్డి జీవితం కొంత మందికి ఆదర్శం. మరి కొంత మందికి కంటకం. ఐదు పదుల రాజకీయ అనుభవం నిండిన చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయ ఉద్దండుల్ని ఎన్నికల్లో మట్టికరిపించిన చరిత్ర జగన్‌ది. 2019 శాసనసభ ఎన్నికల్లో 151 స్థానాల్లో ఆయన మ్రోగించిన విజయభేరి రాష్ట్ర చరిత్రలోనే రికార్డు బ్రేక్‌గా చెప్పవచ్చు. 2014లో నవ్యాంధ్రప్రదేశ్‌కు సాధారణ ఎన్నికలు జరిగాయి. అన్ని పార్టీలు ఏకత్రాటిపైకి వచ్చి చివరికి చంద్రబాబుకు పట్టం కట్టేలా చేశాయి. అంతటి పోటీలో కూడా జగన్ 67 స్థానాల్లో నెగ్గి 2014 నుండి 2019 వరకు ప్రతిపక్ష నాయకుడిగా నిలబడ్డారు. అసెంబ్లీలోనూ, బయటా చంద్రబాబు పార్టీ జగన్‌ని నానా మాటలతో, అవినీతి పరుడంటూ పేట్రేగి చాలా అవమానాలకు గురిచేశారు.

జగన్ పార్టీ నుండి నెగ్గిన 23 మంది శాసన సభ్యుల్ని కూడా ప్రలోభాలకు గురిచేసి టిడిపిలోకి లాగేసుకున్నారు. ఆ పరిణామాలే జగన్‌ను ఆలోచనలకు గురిచేశాయి. ప్రజా సంకల్ప యాత్ర చేయాలన్న సంకల్పం ఏర్పడింది. నవంబర్ 6, 2017న పాదయాత్ర ఆరంభించారు. ఆయనలోని పట్టుదల, దృఢత్వం, మొండితనం, ఆవేశం అన్నీ కలిసి ఆయన్ని 430 రోజులు, 3,640 కి.మీ. పాదయాత్ర చేయించాయి. దాదాపు రాష్ట్రమంతటా ఏకధాటిగా పాదయాత్ర చేశారు. జనాల్ని కలిశారు. జనం మధ్య తిరిగారు. జనం బాధలు విన్నారు. జనంలోనే గడిపారు. అంత చిన్న వయస్సులో ఆయనకు కొండంత ధైర్యం అండగా నిలిచింది. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలకు తన లక్ష్యం గూర్చి, తాను వస్తే చేయాలనుకుంటున్న మంచి పనుల గూర్చి సమగ్రంగా వివరించారు.

జనం తండోపతండాలుగా రాసాగారు. ప్రసంగం శ్రద్ధగా వినసాగారు. అందరిలోనూ ఒక ఆలోచన శ్రీకారం చుట్టింది. ఎలాగైనా ఒకసారి జగన్‌ను విశ్వాసానికి తీసుకొందాం అని నిర్ణయానికి వచ్చేసి ఎన్నికల కోసం ఎదురు చూడసాగారు. ఆయనపై వున్న నమ్మకమే 2019 ఎన్నికల్లో ఆయనకు ఓట్ల వర్షం కురిపించాయి. ఇదివరకు ఎవరూ చూడని, వినని ఘన విజయం ఆయన వరం అయింది. 2019 మే 30న ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి నిరాడంబరంగా ప్రమాణ స్వీకారం కావించారు. వినూ త్న విధానాలకు బీజం నాటారు. తొలిసారే బిసి కులాల నుండి, షెడ్యూల్డు కులాల నుండి, షెడ్యూల్డు తెగల నుండి, మైనారిటీల నుండి, మహిళల నుండి 5 మంది డిప్యూటీ ముఖ్యమంత్రుల్ని నియమించి తన సంక్షేమ విధాన లక్ష్యాల జెండాని ఎగురేశారు. ఆనాటి నుండి ఈనాటి వరకు దాదాపు 18 నెలలు జగన్ పాలనపై మంచి, చెడుల పరిశీలనే ఈ వ్యాస ఉద్దేశం.

జగన్ ఎన్నికల ముందు తన ఆలోచనల్ని, ప్రజా సమస్యల్ని తీర్చేందుకు ‘నవరత్నాల’ పేరున ఒక మేనిఫెస్టో తీసుకొచ్చారు. అదే తనకు ఒక భగవద్గీత అని, బైబిల్ అని, ఖురాన్ అని ప్రకటించారు. తదనుగుణంగా మొదటి రోజు నుండే మేనిఫెస్టోను ఆచరణలోకి తీసుకొచ్చేందుకు ప్రతి అడుగు ముందుకేస్తున్నారు. గత 8 నెలల కాలం ‘కరోనా’ వల్ల రాష్ట్రంలో పాలన కొద్దిగా స్తబ్దత ఏర్పడినా పథకాల అమలులో మాత్రం ఎలాంటి అలసత్వం కనపడలేదు. ఎన్నికలు రెండు సంవత్సరాలు కాకుండానే తన మేనిఫెస్టోలోని అన్ని అంశాల్ని దాదాపు పూర్తి కావించి రాజకీయాల్లోనే ఓ క్రొత్త ఒరవడిని సృష్టించి, దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయన ఇంకా ఏయే పథకాల్ని ప్రకటిస్తారో అని జనాలు ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన ప్రకటించిన పథకాల్ని రాయమంటే ఏ ఐఎఎస్ చదివే విద్యార్థి కూడా రాయలేకపోవచ్చు.

చివరికి ఆ పార్టీకి చెందిన నాయకులైనా చెప్తారో లేదో అన్పిస్తుంది. పథకాలు అలావుంచితే ప్రజా సంక్షేమానికి ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజానీకానికి దాదాపు 200 ప్రధాన నిర్ణయాలు తీసుకున్నట్లు ఫేస్‌బుక్‌లో వైరల్ అవుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో వెనుకబడ్డ కులాలకు చెందిన 56 మంది వ్యక్తుల్ని ఆయా కులాల కార్పొరేషన్ చైర్మన్లుగా నియమించడం, 600 మందికిపైగా వ్యక్తుల్ని ఆయా కార్పొరేషన్ల డైరెక్టర్లుగా కూడా నియమించడం ఆ కులాల్లో వెలుగులు నింపడమే. డిసెంబర్ 17న వారందరితో ‘బిసి సంక్రాంతి’ పేరున కన్నులపండుగగా ప్రమాణ స్వీకారం కూడా జరిగింది.
భారతదేశంలోనే మొదటిసారిగా గ్రామ స్థాయిలో గ్రామ సచివాలయాలు నెలకొల్పడం గొప్ప విషయం. ఏ గ్రామానికి చెందిన సమస్యల్ని అక్కడే పరిష్కరిస్తూ గ్రామ సచివాలయాలు మహోన్నత ఆశయంతో ముందుకు సాగుతున్నాయి. మహాత్ముని గ్రామ స్వరాజ్యాన్ని గుర్తుకు తెస్తున్నాయి. తమది ముమ్మాటికీ రైతు సంక్షేమ ప్రభుత్వమే అని చెప్పుకొనేందుకు గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల్ని స్థాపించడం జరిగింది. రైతుకు కావాల్సిన సమస్తమూ ఈ కేంద్రాల్లోనే లభ్యమవుతున్నాయి.

ఈ రెండూ కూడా భారతదేశానికే ఆదర్శం అని చెప్పవచ్చు. గ్రామ సెక్రటేరియట్‌లు, రైతు భరోసా కేంద్రాలు విజయం ఖచ్చితంగాగా జగన్‌కు భవిష్యత్ బాటలు వేస్తాయి. ఈ రెండింటి పర్యవేక్షణ బాధ్యత పాలకుల ప్రథమ కర్తవ్యం కావాలి. ఈ ఫలాలు పండాలంటే ఇక్కడ పని చేసే వాలంటీర్లు, ఉద్యోగస్థుల పనితీరుపై ఆధారపడి వుంటుంది. వీళ్ళలో అవినీతి, లంచగొండితనం ప్రవేశిస్తే వ్యవస్థ దుష్ఫలితాల్నిస్తుంది. జగన్ ఆశయాలకు గండిపడుతుంది. జగన్ లక్ష్యం అధికార్ల చిత్తశుద్ధిపైనే ఆధారపడి వుంటుందన్నది సత్యం. ఇప్పటి వరకు చాలామటుకు వీటి నిర్వహణపై మంచి అభిప్రాయాలే కన్పిస్తున్నాయి కానీ, అతి తక్కువ ప్రదేశాల్లో వాలంటీర్లు లంచాలు అడుగుతున్నట్లు తెలుస్తోంది. కరోనా కాలంలో తిరుపతిలో ఓ వలంటీరు మద్యం తయారు చేస్తూ పట్టుబడిన విషయం మనందర్నీ బాధించింది. ఇలాంటి దుష్పరిణామాల్ని ఆదిలోనే కఠినంగా అణచివేయాలి. వీళ్ళ వ్యవహారాలపై, కదలికపై నడవడికపై అనునిత్యమూ నిఘా వుండాలి. ఎందుకంటే ఈ పథకాలు జగన్ ప్రాణ నాడులు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికార్లు కూడా వీటిని చిత్తశుద్ధితో పర్యవేక్షించాలి.

ఇక జగన్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి కాబోయేది పోలవరం ప్రాజెక్టు… ఆంధ్రుల జీవనాడి ఇది. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నా జగన్ ఈ ఎన్నికల కాలవ్యవధిలోనే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి. సాగునీటి ప్రాజెక్టుల పితామహుడు అనగానే అందరూ రాజశేఖర్ రెడ్డి పేరే చెబుతారు. కానీ, ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే జగన్ కూడా రాష్ట్ర ప్రజల హృదయాల్లో గూడుకట్టుకోవడం ఖాయం. ఆయన ఆశించినట్లుగా అప్పడే అందరి ఇళ్లల్లో జగన్ ఫోటో వ్రేలాడుతుంటుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ విషయంలో గత పాలకుల తప్పిదాలు ఎత్తిచూపుతూ కాలం గడపక, పూర్తి కావించేందుకే అహర్నిశలు శ్రమపడాలి. ఇది కేంద్ర ప్రాజెక్టు కనుక నిధుల కోసం జగన్ మరో వందసార్లు ఢిల్లీ వెళ్ళినా తప్పులేదు. జగన్ ఇప్పటికే ఆ విధంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది. దీనితో పాటు చాలా కాలంగా పెండింగ్‌లో వున్న, నిర్మాణంలో వున్న ప్రాజెక్టులు కూడా పూర్తి కావించాలి.

వివిధ పథకాల క్రింద ఈ 18 నెలల కాలంలోనే దాదాపు 60 లక్షల కోట్ల నిధులు మహిళా తల్లులు, రైతన్నల అకౌంట్లలో జమ అయ్యాయి. ఈ విషయంలో ఎక్కడా ఓ చిన్న అవినీతి ఆరోపణలు కూడా రాకపోవడం హర్షణీయం. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రాజకీయ నాయకుల జోక్యం లేకుండా డైరెక్టుగా వాళ్ళకే అందడం అన్నది దేశంలోనే మొదటిసారి అని చెప్పవచ్చు. పెన్షన్లు కూడా వాలంటీర్లే ఇంటింటి కెళ్లి డైరెక్టుగా ఇచ్చేస్తున్నారు. ఇందులో కూడా ఎలాంటి అలసత్వం కనపడడం లేదు. ఇది చాలా శుభపరిణామమనే చెప్పవచ్చు. కాకుంటే ప్రజలు కూడా ప్రభుత్వం ఇస్తున్న నిధుల ఆశయాల్ని తుంగలో తొక్కి దుర్వినియోగం చేసుకోకూడదు. అమ్మవొడి లాంటి పథకాల నిధులు వృథా చేసుకుంటే అది తమ పిల్లలకే నష్టం అన్న విషయాల్ని తల్లులు విస్మరించరాదు. కొన్ని కొన్ని ప్రాంతాల్లోని ఇళ్లల్లో ఇప్పటికీ మగ పెత్తనమే నడుస్తోంది. అలాంటి దుర్మార్గుల వల్ల అరకొరగా నిధులు దుర్వినియోగం జరగవచ్చు. ఇది పాలకుల వైఫల్యం ఎంతమాత్రం కాదు. ప్రజల స్వయంకృతాపరాధమే అవుతుంది.

ఇక అవినీతికి ఆస్కారమిచ్చే కొన్ని పథకాలు వున్నాయి. ‘నాడు -నేడు’, ‘హౌసింగ్’ లాంటి కొన్ని పథకాల్లో అవినీతి చొరబడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రాష్ట్రంలోని విజిలెన్స్, ఇంటెలిజెన్స్, అవినీతి నిరోధక శాఖల్ని బలపరచాలి. వీటి పని తీరులో వేగం పెంచాలి. ఇందులో నీతివంతులకే స్థానం కల్పించాలి. దొరికిన అనకొండల్ని ఎన్ని సిఫార్స్‌లున్నా, ఎన్ని అవరోధాలు వున్నా శిక్షించడానికి వెనుకడుగేయరాదు. ఈ శాఖలపై ముఖ్యమంత్రే స్వయంగా ప్రతి నెలా సమీక్ష జరపాలి. రెవెన్యూ, మున్సిపల్ శాఖల్లో ఇంకా అవినీతి పేరుకుపోయే వుంది. దీనిని గొడ్డళ్ళతో తెగ నరకాలి. దోపిడీకి పాల్పడిన ఐఎఎస్, ఐపిఎస్ ఆఫీసర్లయినా సరే క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. కలుపు మొక్కల్ని ఏరివేస్తేనే తోట పచ్చగా వుంటుంది. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయిక్ మొదటిసారి సిఎం అయినప్పుడు అవినీతి ఐఎఎస్ ఆఫీసర్లపై చాలా పెద్ద వేటే వేశారు. అదో పెద్ద సంచలనమై ఒడిశా ప్రజలు నవీన్ పట్నాయిక్‌కు బ్రహ్మరథం పట్టారు. ఇప్పటికీ 20 సంవత్సరాలుగా పట్టం కడుతూనే వున్నారు. సంక్షేమ పథకాలకన్నా ముఖ్యమంత్రులకు ఎక్కువు లాభాన్నిచేవి అవినీతి నిరోధక చర్యలే. జగన్ ఆ దిశగా అడుగులు వేయాలి. రాజకీయ నాయకుల ఆరోపణల్నీ నిజమూ కాకపోవచ్చు. కానీ ప్రభుత్వంలో చిత్తశుద్ధి కనిపించాలి.

ఇకపోతే అధికారుల్లో జగన్ ఇంకా పట్టు సంపాదించలేదన్న విమర్శలు కూడా విన్పిస్తున్నవి. అధికార్ల ట్రాన్స్‌ఫర్లలో అప్పుడప్పుడు కొంత గొందరగోళం కన్పిస్తున్నది. పోస్టింగ్స్ ఈయడం, కేన్సిల్ చేయడం మళ్ళీ అదే స్థానానికి పోస్టింగ్ ఈయడం ఇటీవల చాలా జరిగాయి. ఇలాంటివి ప్రతిపక్షాల నోళ్ళకు అస్త్రాలు ఇచ్చినట్టువుతుంది. ప్రతి ట్రాన్స్‌ఫర్‌ను ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. అధికారుల్లో కూడా అంకితభావం, పని చేయాలన్న తపన కల్గించాలి. మంచికెప్పుడూ పెద్దపీఠ వేయాలి. ఇక ప్రభుత్వ పథకాల ప్రచారం గూర్చి మా పార్టీకి ప్రచార యావలేదు. అని తరచూ చాలా మంది మంత్రులు మాట్లాడే మాటలు ముమ్మాటికీ కరెక్ట్ కాదు. దేనికైనా ప్రచారం చాలా అవసరం. ఇవి ఎన్నికల్లో గెలిచేందుకు కాదు. పథకాల్ని గూర్చి ప్రజలందరూ కచ్చితంగా తెలుసుకోవాలి.

అందుకు ప్రచారం తప్పనిసరి. ‘ప్రస్తుతం కొందరి మాటల్లో చూస్తే ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్నది కొండంత ప్రచారం మాత్రం గోరంత’ అన్నది. దీనిని జగన్ కూడా ఆలోచించి ప్రస్తుత ధోరణి మార్చుకోవాలి. సమాచార శాఖను ప్రక్షాళనం చేసి నూతన ఉత్తేజాన్ని నింపాలి. ప్రజలకు చేసే ప్రతి మంచి పనిని ఆగమేఘాలపై ప్రజలకు చేరవేసేందుకు ఆ శాఖను సంసిద్ధపరచాలి. తమ పనుల్లో ఎంత హానెస్టీ వున్నా ప్రచారానికి తమకున్న ఒక ఛానల్, ఒక పేపర్ సరిపోవు. ఎల్లో పత్రికలు, ఎల్లో మీడియా కాకుండా ‘స్వచ్ఛత’తో నిష్పాక్షికతతో నడుస్తున్న మీడియా కూడా వుంది. దానిని సద్వినియోగం చేసుకోవాలి. గుర్రాల్ని, గాడిదల్ని ఒకే ఘాటికి కట్టకూడదు. మీడియా ఫీడ్ బ్యాక్ కూడా జగన్‌కు ఎంతైనా అవసరం. అందుకు నిష్ణాతులైన సీనియర్ ఎడిటర్స్‌తో తరచూ జగన్ సమావేశం కావాలి. వారి అభిప్రాయాల్లో మంచివని తోస్తే ఆచరించండి. వాళ్లతో గడిపే గంట సమయంలో ఎన్నో తెలుసుకోవాల్సిన విషయాలు కూడా వుంటాయి. ప్రెస్‌మీట్లను కూడా కెసిఆర్‌లా డీల్ చేయగలగాలి.

రెండేళ్ళు గడుస్తున్నా జగన్ ఇంకా ప్రజల్ని కలవడం లేదు. రాజశేఖర్ రెడ్డి క్రమం తప్పక వేకువ జామునే ఆయనను కలవాలని వచ్చేవారిని కలిసి వారి వినతి పత్రాలు స్వీకరించే వారు ‘రచ్చబండ’ క్రింద గ్రామాల్ని కూడా సందర్శించేవారు. ఆ అలవాటు జగన్‌లో లోపంగా కన్పిస్తున్నది. అది దిద్దుకోవాలి. ఎలాగైనా రోజుకు కనీసం అరగంట అయినా ప్రజామొరను ఆలకించేందుకు వెచ్చించాలి. నాయకులకు ఓపిక, సంయమనం కూడా చాలా అవసరం. జగన్ ఇంత వరకు ఓ రెండు మూడు సందర్భాలలో సహనం కోల్పోయిన ఘటనలు గుర్తు చేసుకుందాం. గత జులై 12వ తారీఖున అసెంబ్లీలో జీరో ఇంట్రెస్టు గూర్చి చదువుతున్న చర్చలో, చంద్రబాబుపై నిమిషం పాటు సహనం కోల్పోయి అనుచితంగా మాట్లాడినారు. మరొక ఘటన ప్రభుత్వానికి చెప్పాపెట్టకుండా, రాష్ట్ర ఎన్నికల సంఘం అధ్యక్షుడు ఉన్నపళంగా మధ్యంతరంగా పంచాయితీ ఎన్నికల్ని వాయిదావేశారు.

ఆ రోజు కూడా మార్చి 15న జగన్ ప్రెస్‌మీట్‌లో ఒక్క క్షణం సహనం కోల్పోయి నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను కులం పేరుతో దూషించారు. ముఖ్యమంత్రి స్థాయిలో అలా కామెంట్స్ చేసి వుండాల్సింది కాదు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎలాంటి వాడైనా వయసులో కాస్త పెద్దవారు. ఆయన జగన్ను రెచ్చగొట్టేందుకు ప్రతిక్షణం ప్రయత్నిస్తుంటారు. అది అర్థం చేసుకుని జగన్ నిగ్రహంతో వుంటే చాలా హుందాగా వుంటుంది. ప్రజలు ఎంతో రాజకీయ చతురులు అందర్నీ అర్థం చేసుకోగలరు. మంత్రివర్గం కూడా జగన్ ఆలోచన చేయాల్సి వుంది. దాదాపు అరడజను మంది మంత్రులు అసలు తమ ఉనికే చాటుకోలేకున్నారు. క్రొత్తగా అవకాశం వచ్చినందును ఎంతో రెచ్చిపోయి ప్రజాసేవలో పేరు తెచ్చుకోవాలి. ఇటీవలి కాలంలో జయరాం లాంటి ఒకరిద్దరిపై అనేక ఆరోపనలు వచ్చాయి. అలా రాకూడదు. మంత్రులందరూ సమష్ఠిగా, యాక్టివ్‌గా పని చేస్తేనే జగన్‌కి మంచి పేరొస్తుంది.

అది వాళ్ళు తెలుసుకోవాలి. 3 రాజధానుల సమస్య కూడా ఏదో విధంగా పరిష్కారం కావాలి. అమరావతి రైతులకు ఆర్థిక లాభం చేకూరే ప్లాన్‌ను తక్షణమే ప్రకటించాలి. వాళ్ళను పిలిపించి ఏం కావాలో అడిగి, 3 రాజధానులు ఆవశ్యకతను వివరించాలి. సమస్యకు మంగళం పాడాలి. ఏది ఏమైనా జగన్ అనేక గడ్డు సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. నిధుల కొరత, నిత్యమూ న్యాయస్థానాల్లో పోరా టం, ప్రతిపక్ష నేత రెచ్చగొట్టే ధోరణి ఇలా ఎన్నెన్నో ఒంటరిగా పోరాటం చేస్తున్నారు. అక్కడక్కడ సొంత పార్టీలో కొత్తగా వస్తున్న అంతర్గత రచ్చలు కూడా జగన్‌కు చికాకు తెప్పించేవే. తాను ఆశించినంతగా బిజెపి నుండి తగు సహకారం కూడా అందడం లేదు. అయినా, దేనికీ జడవక, బెదరక ముందుకెళ్తున్నారు. ఓ సినీ గేయం గుర్తుకొస్తోంది. భద్రాచలం సినిమాలో “కష్టాలు రాని, కన్నీళ్ళు రాని ఏమైనా కానీ, గెలుపు పొందు వరకు అలుపు లేదు మనకు.. గెలుపు కొరకే బ్రతుకు” జీవితంలో చిన్నతనంలోనే కొండల్ని ఢీ కొట్టి గెలిచిన జగన్ ఇక మూడేళ్లు ఎలా పరుగెత్తుతారో చూద్దాం! ఆల్ ది బెస్ట్!

డా. సమ్మెట
విజయ్ కుమార్
8886381999

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News