Sunday, April 28, 2024

సమతుల్యమైన.. ప్రగతిశీల బడ్జెట్

- Advertisement -
- Advertisement -

CM KCR

 

ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్‌రావును ప్రశంసించిన సిఎం కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : 2020-21 సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రవేశ పెట్టిన బడ్జెట్ పూర్తి సమతుల్యతతో ఉందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అభినందించారు. ఇది సంక్షేమ తెలంగాణ కోసం రచించిన ప్రగతిశీల బడ్జెట్ గా అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్ర ఆదాయ వనరులు – తెలంగాణ ప్రజల అవసరాలకు మధ్య సమతుల్యత సాధించిన వాస్తవిక బడ్జెట్ అని సిఎం అన్నారు.

అన్ని వర్గాల సంక్షేమం- అన్ని రంగాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం వేసుకున్న ప్రణాళికలకు అనుగుణంగా బడ్జెట్లో కేటాయింపులున్నాయని ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో ఆర్థిక మాంద్యం నెలకొని రాబడులు తగ్గి, కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో కోతలు పడినప్పటికీ రాష్ట్రాభివృద్ధి కుంటుపడకుండా ఉండే విధంగా బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించడం అభినందనీయమన్నారు.

తెలంగాణ గ్రామాలు, పట్టణాల వికాసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు, సంక్షేమ పథకాల్లో మరింత మంది పేదలకు అవకాశం రావాలనే సంకల్పానికి, ఎన్నికల హామీల అమలుకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించారన్నారు. బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం మంత్రి హరీశ్ రావును సిఎం ప్రత్యేకంగా అభినందించారు. మండలిలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, బడ్జెట్ రూపకల్పనలో పాలు పంచుకున్న ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, ఇతర ఆర్థిక శాఖ అధికారులకు సిఎం శుభాకాంక్షలు తెలిపారు.

CM KCR praised Finance Minister Harish Rao
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News