Monday, April 29, 2024

కిం కర్తవ్యం?

- Advertisement -
- Advertisement -

CM KCR

 

లాక్‌డౌన్ పొడిగింపు, సడలింపులపై ముఖ్యమంత్రి కెసిఆర్ విస్తృత సమాలోచనలు
తాజాగా పెరుగుతున్న కేసులపై ఆరా
వలస కార్మికులు, కేంద్రం మార్గదర్శకాలపై చర్చ
పరిస్థితులకు తగ్గట్టుగా తక్షణ చర్యలకు ఆదేశం

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసుల పెరుగుతుండడంతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రగతి భవన్‌లో మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న లాక్‌డౌన్ పరిస్థితులు, అమలు జరుగుతున్న తీరు, కరోనా నియంత్రణ, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి తదితర అంశాలపై సిఎం కెసిఆర్ ప్రధానంగా చర్చించినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం రాష్ట్రంలో గత రెండు, మూడు రోజులగా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్ విషయంలో ఎలా ముందుకు సాగుదామన్న అంశంపై అధికారులతో సిఎం సుధీర్ఘంగా చర్చించారు. కేంద్రం లాక్‌డౌన్‌ను ఈ నెల 17వ తేదీ వరకు పొడగిస్తూనే కరోనా కేసులు లేని ప్రాంతాల్లో ఆంక్షలలో పలు సడలింపులను ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనూ లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజలు పాటు పొడగించడమా? లేక పలు ఆంక్షలతో సడలింపులు ఇవ్వాలా? అన్న అంశఁపై సమావేశంలో సిఎం లోతుగా చర్చించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి ఈటల రాజేందర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్, డిజిపి మహేందర్‌రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. అలాగే రాష్ట్రంలో కరోనా నియంత్రణ, వలస కార్మికుల తరలింపు, లాక్‌డౌన్‌పై కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాలు, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితితో పాటు ఈ నెల 5న కేబినెట్ భేటీలో చర్చించాల్సిన అంశాలపై కసరత్తు చేశారు.వలస కార్మికుల తరలింపులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇతర రాష్ట్రాలతో తగు సమన్వయం చేసుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ను సిఎం కెసిఆర్ ఆదేశించారు.

కాగా రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం తీవ్రంగా శ్రమిస్తున్న నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం వరకు కేసులు తగ్గుముఖం పడుతున్నట్టు అనిపించినప్పటికీ గత రెండు, మూడు రోజులుగా మళ్లీ కొత్త కేసులు వెలుగుచూస్తుండడం పట్ల ఈ సందర్భఁగా సిఎం కెసిఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం నాటికి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1082కు చేరుకున్నారు. కరోనా వైరస్ కారణంగా మొత్తం రాష్ట్రంలో 29 మంది చనిపోయిన ఉదాంతంపై కూడా సమావేశంలో చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా జిహెచ్‌ఎంసి పెరిధిలోనే కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సిఎం కెసిఆర్ సూచించినట్లుగా తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ మార్గ దర్శకాల మేరకు లాక్‌డౌన్‌లో పలు ఆంక్షలు ఇవ్వడమా? లేక పెరుగుతున్న కేసులను దృష్టిలో పెట్టుకుని యథావిధిగా లాక్‌డౌన్‌ను పొడగించడమా? అన్న అంశంపై సిఎం కెసిఆర్ చర్చించారు.

ప్రస్తుతం రాష్ట్రంలోని హైదరాబాద్, వికారాబాద్, సూర్యాపేట్, వరంగల్ అర్భన్, రంగారెడ్డి, మేడ్చల్…మల్కాజ్‌గిరి జిల్లాలు రెడ్ జోన్ పరిధిలో ఉండగా, 17 జిల్లాలు ఆరెంజ్ జోన్, మరో 10 జిల్లాలు గ్రీన్‌జోన్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌జోన్‌లో ఉన్న ప్రాంతాల్లో పలు సడిలింపులను ఇచ్చింది. దీంతో పలు రాష్ట్రంలో జోరో కేసులు ఉన్న ప్రాంతాల్లో మద్యం విక్రయాలకు అనుమతులు ఇచ్చాయి. కాగా మన రాష్ట్రంలో కూడా వైన్స్ షాపులు తెరవాలన్న డిమాండ్ ప్రధానంగా వినిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో ప్రధానంగా ఎక్సైజ్ శాఖ నుంచే వస్తోంది. ప్రస్తుత రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో కేంద్రం సూచించిన విధంగా గ్రీన్‌జోన్ల పరిధిలో మద్యం విక్రయాలను అనుమతులు ఇస్తే దాని ప్రభావం ఏ మేరకు ఉంటుందన్న అంశంపై కూడా లోతుగా సిఎం కెసిఆర్ చర్చించినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ మద్యం విక్రయాలకు అనుమతులు ఇస్తే ఏ విధంగా ఇవ్వాలి? ఎన్ని గంటలకు పాటు అనుమతించాలి? అన్న అంశంపై కూడా అధికారులతో సిఎం చర్చించారు. ఈ అంశాలపై మంగళవారంనాడు జరిగే రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో మరోసారి చర్చించి సిఎం కెసిఆర్ తుది నిర్ణయం తీసుకోనున్నారు.

 

CM KCR review on Corona
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News