Monday, April 29, 2024

ప్రాణదాతలకు గ‘ఘన’ గౌరవం

- Advertisement -
- Advertisement -

Gandhihospital

 

కురిసింది పూల వర్షం, కరోనా యోధ హర్షం
కరోనా సేవలకు గుర్తింపుగా దేశవ్యాప్తంగా వైద్య సిబ్బందికి త్రివిధ దళాల సెల్యూట్, దవాఖానాలపై పూలవాన
హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిపై చరిత్రాత్మక ఘట్టం
వైద్య సిబ్బందిని సన్మానించిన సైనిక అధికారులు
పలు ప్రాంతాల్లో కొవిడ్ వారియర్స్‌కు ఘన స్వాగతాలు
ఆర్మీకి కృతజ్ఞతలు తెలిపిన వైద్యులు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కోవిడ్ వారియర్స్‌కు అద్బుతమైన ఆదరణ లభిస్తుంది. ప్రాణాలు పణంగా పెట్టి కరోనాపై పోరాటం చేస్తున్న యోధులకు ఆర్మీ సలామ్ చేసింది. కనివీని ఎరుగని చరిత్రలో వైద్యులకు ప్రత్యేక ఆధరణలు వస్తున్నాయి. యావత్ దేశాన్ని రక్షిస్తున్న ఆర్మీ తమకు అండగా నిలవడంతో కోవిడ్ వారియర్స్ కళ్లల్లో ఆనందబాష్పాలు కనిపించాయి. కరోనాపై యుద్ధం చేస్తున్న వ్యక్తులను తెలంగాణ ప్రజలు అభినందిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక కోవిడ్ ఆసుపత్రిగా రూపుదిద్దుకొన్న గాంధీ ఆసుపత్రిలో ఆదివారం చారిత్రాత్మకమైన ఘట్టం ఆవిష్కృతమైంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రాణదాతలకు గగన గౌరవం లభించడంతో వారియర్స్ ఆనందానికి ఆవధులు లేవు.

గత కొన్ని రోజులుగా పడుతున్న కష్టాన్ని ఒక్క నిమిషంలో మరచిపోయి, ఆర్మీ అందించిన వందనాన్ని స్వీకరించారు. ఆదివారం సుమారు ఉదయం 10.15 నిమిషాలకు ఆర్మీ ఐఎఎఫ్ విమానాలు వారియర్స్‌కు మద్దతుగా విన్యాసాలు చేస్తూ పూలవర్షం కురిపించడంతో గాంధీ ఆసుపత్రి ప్రాగణమంతా హర్షధ్వనులతో దద్దరిల్లింది. గాంధీ ఆసుపత్రి సూపరింటెండెండ్ డా రాజారావుతో పాటు వైద్యులు, పోలీస్, నర్సులు, పారిశుధ్య, వార్డు, ఇతర ప్రత్యేక సిబ్బంది గగన గౌరవాన్ని అందుకున్నారు. సుమారు 2 వేల మంది సోషల్ డిస్టెన్స్ పాటించి ఆర్మీ కురిపించిన పూలవర్షంతో పులకించిపోయారు. ఆర్మీ మోగించిన ప్రత్యేక బ్యాండ్‌ల మధ్య కోవిడ్ వారియర్స్‌ను సైన్యం సన్మానించింది. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత మీ పైనే ఉందంటూ మరో సారి ఆర్మీ అధికారులు వారియర్స్‌కు విజ్ఞప్తి చేశారు.

ఫీవర్ ఆసుపత్రిలో వారియర్స్‌కు ప్రత్యేక సన్మానం…..
కోవిడ్ బాధితులకు సేవలందిస్తున్న ఫీవర్ ఆసుపత్రి వారియర్స్‌ను ఆర్మీ అభినందించింది. ఉదయం 11.30 ని.లకు ఆసుపత్రి ఎంట్రన్స్‌లో ఉన్న కోవిడ్ హెల్ప్‌డెస్క్ వద్ద ఆర్మీ ప్రత్యేక వాహనంలో బ్యాండ్ మోగిస్తూ వైద్య, ఇతర సిబ్బందిలకు సైన్యం సలామ్ చేసింది. ఆసుపత్రి సూపరింటెండెంట్ డా శంకర్‌తో పాటు సిఎస్ ఆర్‌ఎంఓ డా పద్మజా, ఇతర ఆర్‌ఎంలు, వైద్యులు, నర్సులు, పారిశుధ్య, ఆయాలు, వార్డులలో పనిచేసే సిబ్బంది, ల్యాబ్‌లలో పనిచేసే టెక్నిషియన్లను ఆర్మీ ప్రత్యేకంగా సన్మానించి, వారియర్స్‌కు బహుమానాలు అందచేసింది. దీంతో పాటు అన్ని జిల్లాల్లోనూ వైద్య సిబ్బందిని ప్రజలతో పాటు, అందుబాటులో ఉన్న ఆర్మీ అధికారులూ సన్మానించారు.

వారియర్స్ ఇళ్ల వద్ద ఘనస్వాగతం పలికిన స్థానికులు
కరోనా బాధితులకు సేవలందించి ఇళ్లకు వస్తున్న వారియర్స్‌కు పలు ప్రాంతాల్లో ఘనస్వాగతాలు లభిస్తున్నాయి. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వైరస్‌తో ప్రాణాలు తెగించి పోరాడుతున్న వైద్యులపై స్థానికులు పూలవర్షం కురిపిస్తున్నారు.దీనిలో భాగంగా ఆదివారం తిరుమల గిరిలో గాంధీ ఆసుపత్రి సూపరింటెండెండ్ డా రాజారావు నివాసం ఉంటే ఇంటి వద్ద స్థానికులు, హర్వధ్వనుల మధ్య స్వాగతం పలికారు. అదే విధంగా బి శీతల్ సుహాసిని అనే స్టాఫ్ నర్సు గత నెల రోజులగా కోవిడ్ బాధితులకు సేవలందించి ఇంటికి చేరుకున్న నేపథ్యంలో ఆ అపార్ట్‌మెంట్ వాసులు ఘనస్వాగతం పలికారు. ప్రస్తుతం చాలా మంది వైద్య సిబ్బందికి ప్రజలు వినూత్నమైన పద్దతులతో వారియర్స్‌కు మద్దతుగా నిలుస్తున్నారు.

ముప్పు ఉందని తెలిసిన వెనుకాడటం లేదు
కోవిడ్ వైరస్ ఎదుర్కోవడంలో ప్రాణముప్పు ఉందని తెలిసినా వారియర్స్ వెనకాడటం లేదు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. ఈక్రమంలోనే ఆదివారం తివిధ దళ ఆర్మీ ప్రత్యేకంగా సలామ్ చేసింది.అత్యంత ప్రమాదం అని తెలిసినా, రాత్రి, పగలు అని తేడా లేకుండా 24 గంటల పాటు అహర్నిశలు కరోనా బాధితులకు సేవలు అందిస్తున్నారు. కుటుంబాలు, పిల్లలకు దూరంగా ఉంటూ కోవిడ్ రోగులకు వైద్యం అందించేందుకు ఆసుపత్రుల్లోనే కొట్టుమిట్టాడుతున్నారు. ముఖ్యంగా గాంధీ ఆసుపత్రిలో కరోనా పాజిటివ్ బాధితుల మాత్రమే ఉండటంతో అక్కడ సిబ్బంది మరింత ఆందోళనలతో వైద్యం అందిస్తున్నారు.

ఎవరికి వారు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని మరి విధులు నిర్వర్తిస్తున్నారు. వైరస్ తీవ్రతను తగ్గేందుకు వారి వైద్యసిబ్బంది ఎంతో కృషి చేస్తున్నారు. అయితే ఆర్మీ తీసుకున్న నిర్ణయంతో వైద్యుల్లో అంతులేని ఆనందం కనిపిస్తుంది. ఎంతటి పెనప్రమాదం వచ్చినా, వైరస్‌ను దీటుగా ఎదుర్కోంటామని వైద్యులు ముక్తకంఠంతో చెబుతున్నారు. డాక్టర్లు, నర్సులు, పోలీసు, మినిస్టీరియల్, పారామెడికల్, 4వ తరగతి ఉద్యోగులు, భద్రతా సిబ్బంది, పారిశుద్ధ సిబ్బంది సహా అందరికి మనోధైర్యాన్ని కలిగించిన ఆర్మీకి యావత్ తెలంగాణ సలామ్ కోట్టింది.

కృతజ్ఞతలు తెలిపిన వైద్య సంఘాలు
కోవిడ్ పై పోరాడుతున్న సిబ్బందికి ఆర్మీ ప్రత్యేకంగా సలామ్ చెప్పిన నేపథ్యంలో తెలంగాణ మెడికల్ సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి. ప్రాణాలకు తెగించి వైద్యం అందిజేస్తున్న వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులకు మద్దుతుగా మనోధైర్యం ఇచ్చినందుకు భారత ఆర్మీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షులు డా లాలు ప్రసాద్ రాథోడ్ కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా ప్రాణాలకు తెగించి వైద్యం అందజేస్తున్న వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు, డాక్టర్లు, నర్సులు, సానిటరీ సెక్యూరిటీకి మద్దతు తెలిపినందుకు మెడికల్ జేఏసి కన్వీనర్ పుట్ల శ్రీనివాస్ ఆర్మీ అధికారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

 

Military officers honored Medical personnel
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News