Sunday, April 28, 2024

‘మహా’తీర్పు.. దేశంలో మార్పు

- Advertisement -
- Advertisement -

నాయకులు కాదు.. ప్రజలు గెలవడం మొదలైతే అన్ని సమస్యలకు పరిష్కారం
ఇక్కడి ప్రభుత్వాలు బాగా పనిచేస్తే మహారాష్ట్ర బడ్జెట్ రూ.10లక్షల కోట్లకు పెరిగేది
దేశంలో దళితులు, ఆదివాసీల ఉద్ధరణ జరగాల్సిందే
తెలంగాణ లెక్కజేస్తే మరాఠా నేతలకు దివాలా.. ప్రజలకు దివాళీ
నాగపూర్ సభలో అధినేత, సిఎం కెసిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్: సంస్కరణే బిఆర్‌ఎస్ మిషన్ అని, అన్నిరంగాల్లో సంస్కరణలు జరిగేతేనే దేశంలోని సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు. దేశం మారాల్సిన సమయం వచ్చేసిందని, ఆలోచన తీరు మారకపోతే ఎన్నికలు ఎన్ని వచ్చినా ఎలాంటి మార్పురాదన్నారు. మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో బిఆర్‌ఎస్ పార్టీని ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కెసిఆర్ పాల్గొని ప్రసంగించారు. ముందుగా ఛత్రపతి శివాజీ, మహాత్మా జ్యోతిరావు ఫూలే, డా.బిఆర్. అంబేద్కర్, సావిత్రిబాయి పూలే, బసవేశ్వరుడు, అన్నా బహుసాటే చిత్రపటాలకు కెసిఆర్ పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అంతకుముందు సురేష్‌భట్ ఆడిటోరియంలో సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో పలు పార్టీలకు చెందిన నాయకులకు పార్టీ కండువా కప్పి బిఆర్‌ఎస్ పార్టీలోకి కెసిఆర్ ఆహ్వానించారు.

140 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో
ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ లక్ష్యం లేని దేశం ఎక్కడకు వెళుతోందని కెసిఆర్ ప్రశ్నించారు. ఈ విషయం ఆలోచిస్తే తనకు భయమేస్తోందన్నారు. చైనా దేశాన్ని అధిగమించి జనాభాలో ప్రపంచంలోనే నెంబర్‌వన్‌గా మనదేశం అవతరించిందని కెసిఆర్ తెలిపారు. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో ప్రజలను అపహాస్యం చేసే విధంగా రాజకీయ నాయకుల పోకడలున్నాయన్నారు. ఎన్నికల్లో గెలవడమే దేశ లక్ష్యంగా పరిణమించిందన్నారు. కొట్టండి, చంపండి, నరకండి, మందు, డబ్బులు పంచండి ఇలా ఏదైనా చేయండి కానీ, ఎన్నికల్లో గెలవాలన్న దిశగా రాజకీయాలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ఎన్నికల్లో గెలుపోటముల చక్రంలో మనం భ్రమలకు లోనవుతూ వస్తున్నా మన్నారు. ప్రజాస్వామ్య రాజ్యంలో ఎన్నికల్లో పార్టీలు, నాయకులు గెలవటం కాదనీ, ప్రజలు గెలవాలన్నారు. ప్రజలు గెలవడం మొదలైతే అన్ని సమస్యలు అవే పరిష్కారమవుతాయన్నారు. ప్రజలు చంద్రుడు, నక్షత్రాలను కోరుకోవడం లేదనీ, నీళ్లు ఇవ్వమని కోరుతున్నారని కెసిఆర్ పేర్కొన్నారు.

మహారాష్ట్రతో పాటు దేశ రాజధానిలోనూ అదే దుస్థితి
మహారాష్ట్ర దేశంలోనే నెంబర్‌వన్ రాష్ట్రమని కెసిఆర్ తెలిపారు. కానీ అలాంటి మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో 8 రోజులకు ఒకసారి త్రాగునీరు వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా ప్రజల స్థితిగతులు మారడం లేదన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోనూ అదే దుస్థితి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గంగా, యమునా డెల్టా ప్రాంతమైన ఢిల్లీలోనూ ఇదే పరిస్థితి ఉందని, ఢిల్లీలో త్రాగునీరే కాదు, విద్యుత్ సమస్య కూడా ఉందని కెసిఆర్ పేర్కొన్నారు. నా అంచనా ప్రకారం మహారాష్ట్ర ప్రభుత్వాలు బాగా పనిచేస్తే మహారాష్ట్ర బడ్జెట్ 6 లక్షల కోట్ల నుంచి 10 లక్షల కోట్లకు పెరిగేదని కెసిఆర్ తెలిపారు. ఈ విషయంపై ప్రజలందరూ చర్చించాలన్నారు. ఈ విపత్కర పరిస్థితులు కేవలం మహారాష్ట్రలో మాత్రమే లేవని, దేశమంతా ఇదే పరిస్థితి ఉందన్నారు. విధానాలను అసెంబ్లీ, పార్లమెంట్‌లోనే రూపొందిస్తారని కెసిఆర్ పేర్కొన్నారు.

బిఆర్‌ఎస్ అన్ని స్థాయిల ఎన్నికల్లో పోటీ
తాము తప్పకుండా ఎన్నికల్లో పోటీ చేస్తామని, గెలుస్తామని, భారత రాష్ట్ర సమితి పార్టీ అన్ని స్థాయిల్లో ఎన్నికల్లో పోటీకి అభ్యర్ధులను నిలబెడుతుందన్నారు. రైతులు ఎమ్మెల్యేలుగా, ఎంపిలుగా గెలవాలని, కిసాన్ సర్కార్‌ను ఏర్పాటు చేయాలని కెసిఆర్ పిలుపునిచ్చారు.
త్వరలో మధ్యప్రదేశ్‌లో బిఆర్‌ఎస్ కార్యకలాపాలు
త్వరలో మధ్యప్రదేశ్‌లోనూ బిఆర్‌ఎస్ కార్యకలాపాలను ప్రారంభిస్తామని కెసిఆర్ తెలిపారు. పంటలు పండించి దేశానికి అన్నం పెట్టే రైతులకు సంబంధించిన చట్టాలు, విధానాలను రూపొందించ లేరా? అని కెసిఆర్ ప్రశ్నించారు. అందరూ ఏకమై కృషి చేస్తే కలలు సాకారమవుతా యన్నారు. లక్ష కిలోమీటర్ల ప్రయాణమైన ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుందని కెసిఆర్ తెలిపారు. దేశంలో చేపట్టే సంస్కరణకు నాంది మహారాష్ట్రలోనే పడిందన్నారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి తాను నాందేడ్ వచ్చినప్పుడు మీకు ఇక్కడేం పని అని ప్రశ్నించారని ఆయన పేర్కొన్నారు. తాను భారతదేశ పౌరుడిని ఎక్కడికైనా వస్తానని కెసిఆర్ తెలిపారు. తెలంగాణ పథకాలను ఇక్కడ అమలు చేస్తే తాను ఇక్కడికి రానని మధ్యప్రదేశ్‌కు వెళతానని కెసిఆర్ స్పష్టం చేశాను.

రైతులను దళారులకు అప్పగించవద్ద
చరణ్ సింగ్ వాగ్మర్ముంబాయి పర్యటన చేపట్టినప్పుడు రైతు నినాదంగా ఏం మాట్లాడుతారని ప్రశ్నించినప్పుడు అంబానీల వ్యాపారాల నిర్వహణలో కార్మికులుగా ఎవరూ పనిచేస్తున్నారని ప్రశ్నిస్తానన్నారు. రైతుల బలహీనతలను ఆసరాగా చేసుకొని వారిని దళారీలకు అప్పగించడం ఏమాత్రం భావ్యం కాదని కెసిఆర్ సూచించారు.
కర్ణాటక సిఎం 27 లక్షల టన్నుల బియ్యం కావాలని….
బుధవారం కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్ చేసి 27 లక్షల టన్నుల బియ్యం కావాలని, రేటు చెప్పాలని అడిగారని కెసిఆర్ పేర్కొన్నారు. వరి పంట ఉత్పత్తి ఎక్కువైతే రేటు తగ్గుతుందన్నారు. నేటికి ఎందరో దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, అగ్రవర్ణాల్లోని పేదలు సంతులిత ఆహారం తీసుకోలేక పోతున్నారని, ఇతర దేశాలతో పోల్చితే మన దేశంలో ప్రజలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పంట ఉత్పత్తి ఎక్కువైతే బీద దేశాలకు పంపిస్తామని, సకల వనరులన్నప్పటికీ మన దేశం నుంచి ఇతర దేశాలకు ఎగుమతులు జరగడం లేదని కెసిఆర్ పేర్కొన్నారు.

ప్రతి మండలంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ….
దేశంలోని ప్రతి మండలంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను పెట్టాలని, మన దేశం నుంచి ఇతర దేశాలకు ఎగుమతులు పెరగాలని, మన ఆహారాన్ని ఇతర దేశాలు తినాలని, కానీ, ఇవన్నీ చేయకుండా నాయకులు కథలు చెబుతున్నారని ఆయన దుయ్యబట్టారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడితే ఇవన్నీ చేసి చూపెడుతుందని, కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్‌సిఆర్‌బి దేశంలో లక్షల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని లెక్కలు తేల్చిందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి చింతా లేదని, వారిని ఎలా మేల్కొలపాని కెసిఆర్ ప్రశ్నించారు.
దేశంలో దళితుల, ఆదివాసీల ఉద్ధరణ జరిగి తీరాల్సిందే…

మహారాష్ట్రలో అనేక పార్టీల నుంచి సిఎంలు వచ్చారని, ఈ రాష్ట్ర పరిస్థితులను మాత్రం ఏ సిఎం కూడా మార్చలేదని కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జనం గెలిచే రాజకీయాలు చేయాలని, ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో బిజెపి ఓడిందని, కాంగ్రెస్ గెలిచిందన్నారు. పరిస్థితుల్లో మార్పు రానప్పుడు ఎవరు గెలిచి ఏం ప్రయోజనమన్నారు. ప్రస్తుతం మన దేశంలో దళితుల పరిస్థితి ఏమిటీ..? ఎస్సీల పరిస్థితులు మారనంత కాలం దేశం అభివృద్ధి చెందదని కెసిఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. బరాక్ ఒబామా అధ్యక్షుడు అయ్యాకే అమెరికాలో పాప ప్రక్షాళన జరిగిందని, దేశంలో దళితుల, ఆదివాసీల ఉద్ధరణ జరిగి తీరాల్సిందేనని కెసిఆర్ స్పష్టం చేశారు.

దేశమంతా తెలంగాణ మోడల్ అమలయ్యే వరకు పోరాడుతా
దేశమంతా తెలంగాణ మోడల్ అమలయ్యే వరకు పోరాడుతూనే ఉంటానని బిఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు. దేశంలోని ప్రతి గ్రామానికి, ప్రతి గల్లీకి వెళ్లి తెలంగాణ పథకాలు వివరిస్తామని ఆయన స్పష్టం చేశారు. భారతదేశంలో మార్పునకు మహారాష్ట్ర నుంచే నాంది పలకాలని ఆయన పిలుపునిచ్చారు. రైతులు బలహీనులు కాదనీ, దేశాన్ని నడుపుతున్న బలమైన శక్తులని కెసిఆర్ ప్రశంసించారు. రైతులను అవమానించే వారికి తగిన శాస్తి తప్పదని ఆయన హెచ్చరించారు. దేశానికి అన్నం పెట్టే రైతు పార్లమెంట్‌లో చట్టాలు చేయలేడా? అని కెసిఆర్ ప్రశ్నించారు. దేశంలో 48 శాతం మంది రైతులే ఉన్నారని, వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తే 60 శాతం మందికి ఉపాధి లభిస్తుందని కెసిఆర్ తెలిపారు. సరిపడా సాగునీరు, విద్యుత్ ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యం కావాలన్నారు.

సాగును పండుగలా మార్చాం..
రెవెన్యూ వ్యవస్థలోని అవినీతిని పారద్రోలాలా.. వద్దా..? అని కెసిఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థను డిజిటలైజ్ చేసి అవినీతికి అడ్డుకట్ట వేశామన్నారు. తెలంగాణలో పండిన పంటంతా ప్రభుత్వమే కొంటోందన్నారు. పంట సొమ్ము నేరుగా రైతుల ఖాతాల్లో వేస్తున్నామని కెసిఆర్ తెలిపారు. ఉచిత విద్యుత్, ఉచిత నీరుతో తెలంగాణలో సాగును పండుగలా మార్చామన్నారు. ఇప్పుడు తెలంగాణ వరి ఉత్పత్తిలో పంజాబ్‌ను దాటేశామన్నారు. అంతేకాకుండా రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు అమలు చేసి రైతులకు, వారి కుటుంబాలకు అండగా ఉంటున్నామని కెసిఆర్ వివరించారు.తెలంగాణలో అమలు చేస్తున్న రైతుహిత కార్యక్రమాలతో వ్యవసాయాన్ని పండగలా మార్చామని స్పష్టం చేశారు. చిత్తశుద్ధి లేని సంప్రదాయ పార్టీల ప్రణాళికలు, మూస పరిపాలన విధానాలు ఉన్నంత వరకు దేశ అభివృద్ధి కుంటుపడుతుందని కెసిఆర్ అన్నారు.

ప్రతి ఇంటికీ నల్లా ద్వారా త్రాగునీరు
తెలంగాణలో ప్రతి ఇంటికీ నల్లా ద్వారా త్రాగునీరు అందిస్తున్నామని కెసిఆర్ తెలిపారు. త్రాగునీటి కోసం బిందెలు పట్టుకొని తిరిగే పరిస్థితి తెలంగాణలో ఎక్కడా లేదన్నారు. తెలంగాణ లాంటి చిన్న రాష్ట్రమే ఇన్ని సాధిస్తే, మహారాష్ట్ర ఎందుకు సాధించదని ఆయన ప్రశ్నించారు. తెలం గాణలా చేస్తే మహారాష్ట్ర దివాలా తీస్తుందని కొందరు మరాఠా నేతలు అంటున్నారని, తెలంగాణ తరహాలో చేస్తే మరాఠా నేతలు దివాలా తీస్తారా ? ప్రజలు దీపావళి జరుపుకుంటారని కెసిఆర్ పేర్కొన్నారు. రైతులు తలచుకుంటే ఏదైనా చేయగలరని, ఎలాంటి మార్పునైనా సాధించగలరని కెసిఆర్ పేర్కొన్నారు. మహారాష్ట్రలో తెలంగాణ నమూనా పాలన వచ్చే వరకు బిఆర్‌ఎస్ పోరాడుతుందన్నారు. మహారాష్ట్రలో అనేక మంది నేతలు బిఆర్‌ఎస్ వైపు చూస్తున్నారని కెసిఆర్ తెలిపారు. మహారాష్ట్రలో త్వరలోనే పరివర్తన వస్తుందని, అది దేశమంతా పాకుతుందని, నాగ్‌పూర్‌లో ఆఫీసు ప్రారంభించుకున్నాం, త్వరలోనే ముంబై, ఔరంగాబాద్, పుణెలోనూ పార్టీ ఆఫీసులను ప్రారంభిస్తామని కెసిఆర్ తెలిపారు.

త్వరలోనే లక్షల సంఖ్యలో పార్టీ సభ్యత్వాలు నమోదు
మహారాష్ట్రలో అనేక మంది నాయకులు బిఆర్‌ఎస్ వైపు చూస్తున్నారని కెసిఆర్ పేర్కొన్నారు. ఇప్పటికే 4 లక్షల మందికి పైగా బిఆర్‌ఎస్ పార్టీలో చేరారని, త్వరలోనే 25 నుంచి 30 లక్షల మందికి ఈ సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నానని కెసిఆర్ తెలిపారు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు బిఆర్‌ఎస్ వైపు చూస్తున్నారని, యువతకు అవకాశం కల్పించాలని తాము భావిస్తున్నామన్నారు. పార్టీ నిర్మాణంలో భాగంగా సభ్యత్వం డ్రైవ్, కమిటీల ఏర్పాటు చేస్తున్నారని కెసిఆర్ పేర్కొన్నారు.

మార్పు కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడతాం
వివాదాల్లోకి తాము వెళ్లాలని అనుకోవడం లేదని కెసిఆర్ తెలిపారు. సమకాలీన పరిస్థితులను ప్రజలకు వివరించి, మార్పు కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడతామన్నారు. మహారాష్ట్ర వేదికగా దేశాన్ని సంస్కరించేందుకు పడిన అడుగులు బలమైనవన్నారు. యావత్ దేశం తప్పకుండా సంస్కరించబడుతుందన్నారు. భారతదేశం బుద్ధిజీవులు దేశమని, బుద్ధిలేని జీవుల దేశం కాదని ఆయన పేర్కొన్నారు. భారతదేశం తప్పకుండా స్పందిస్తుందని తాను నమ్ముతున్నానన్నారు. అర్థమయ్యేరీతిలో చెబితే ఈ దేశంలోని కామన్ మ్యాన్‌కు సైతం సులభంగా అర్థమవుతుందని, వారికి గొప్ప కామన్ సెన్స్ (ఇంగిత జ్ఞానం) ఉందని కెసిఆర్ తెలిపారు.

ప్రస్తుతం భారత్ మార్పును కోరుకుంటుంది
దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన తర్వాత ప్రజలు ఇందిరాగాంధీని ఓడించి వేరే ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని, ఆ ప్రభుత్వం కూడా ప్రజలను ఇబ్బంది పెట్టడంతో తిరిగి ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని కెసిఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్ మార్పును కోరుకుంటుందని, ఇప్పటికే ప్రజలు విసిగి పోయారని, అవకాశం కోసం వేచి చూస్తున్నారని కెసిఆర్ తెలిపారు. దేశ ప్రజలు బిఆర్‌ఎస్‌ను ఆదరిస్తారన్న సంపూర్ణ విశ్వాసం తమకు ఉందన్నారు.

నాగ్‌పూర్ జిల్లా అధ్యక్షుడు జ్ఞానేష్ వాకోడ్కర్‌ను కుర్చీలో కూర్చోబెట్టిన కెసిఆర్
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని కెసిఆర్ గురువారం మధ్యాహ్నం ప్రారంభించారు. పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా పార్టీ జెండాను కెసిఆర్ ఆవిష్కరించారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి పార్టీ ఆఫీసులోకి ప్రవేశించారు. కార్యాల యంలో లోపల నిర్వహించిన అమ్మవారి పూజలో కెసిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెసిఆర్‌ను వేద పండితులు ఆశీర్వదించారు. అనంతరం నాగ్‌పూర్ జిల్లా అధ్యక్షుడు జ్ఞానేష్ వాకోడ్కర్‌ను కెసిఆర్ కుర్చీలో కూర్చోబెట్టారు. పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపిలు కేశవరావు, సంతోష్ కుమార్, బిబిపాటిల్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దానం నాగేందర్, ఎపి బిఆర్‌ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధుల, మహారాష్టకు చెందిన బిఆర్‌ఎస్ నేతలు పాల్గొన్నారు.

నాగ్‌పూర్ పట్టణమంతా ఫ్ల్లెక్సీలు, హోర్డింగ్‌లు, జెండాలతో…
నాగ్‌పూర్ పట్టణమంతా బిఆర్‌ఎస్ పార్టీకి సంబంధించిన ఫ్ల్లెక్సీలు, హోర్డింగ్‌లు, జెండాలతో నిండిపోయింది. ఎక్కడ చూసిన కెసిఆర్ చిత్రాలతో కూడిన అబ్‌కీ బార్.. కిసాన్ సర్కార్’హోర్డింగ్‌లు దర్శనమిచ్చాయి. కాగా, పట్టణంలోని గాంధీబాగ్‌లో విశాలమైన స్థలంలో నిర్మించిన మహారాష్ట్ర బిఆర్‌ఎస్ భవనాన్ని పార్టీ నాయకులు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.
పర్యటన సాగిన తీరు…
హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ నుంచి నాగ్‌పూర్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్న సిఎం కెసిఆర్‌కు విమానాశ్రయంలో బిఆర్‌ఎస్ పార్టీ మహారాష్ట్ర నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయానికి సిఎం కెసిఆర్ చేరుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News