Monday, April 29, 2024

త్రివిధ దళాల అనుభవంలో శత వసంతాలు

- Advertisement -
- Advertisement -
Colonel Prithipal Singh Gill's 100th Birthday
కల్నల్ ప్రీతిపాల్ సింగ్ 100 వ పుట్టిన రోజు వేడుక

సైనికునికి తుపాకీయే ప్రాణం. దాన్ని ఎప్పటికీ విడిచిపెట్టం. యుద్ధంలో పాక్ మా తుపాకీలను దొంగిలిస్తే వారితో పోరాడి తుపాకులు తెచ్చుకున్నాం. అని సింహంలా గర్జించారు ఓ వీరుడు. సైన్యం నుంచి రిటైరైనా ఆయనలో ధీరత్వానికి రిటైర్‌మెంట్ కనిపించలేదు. ఈ మాటలు వందేళ్ల వయసు పండిన వీరసైనికుడు కల్నల్ ప్రీతిపాల్ సింగ్‌వి. ఆయన గగన వీరుడే కాదు, సాహసవంతుడైన సైనికుడు, అలలకు ఎదురీదే నావికుడు…. ఈ విధంగా త్రివిధ దళాల్లో పనిచేసే ఏకైక యోధునిగా అనుభవం సాధించి గత ఘన చరిత్ర స్మృతుల అనుభూతులతో శతవసంతం లోకి అడుగు పెట్టిన చరిత్ర ఆయనకే దక్కింది. మూడు దళాల్లో పనిచేసే అదృష్టం ఎవరికి వస్తుంది? ఆయనే కల్నల్ ప్రీతిపాల్ సింగ్ గిల్ (రిటైర్డ్). నేడు 100 వ పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రీతిపాల్ సింగ్ జీవిత విశేషాలు ఎన్నో ఉన్నాయి.

1942 లో రాయల్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌తో తన సైనిక జీవితాన్ని ప్రీతిపాల్ ప్రారంభించారు. ఆయన మిలిటరీలో చేరడం కుటుంబీకులకు ఇష్టం లేదు. వాయుసేనలో చేరి కరాచీలో పైలట్ ఆఫీసర్‌గా పనిచేశారు. హోవర్డ్ యుద్ధ విమానాలను నడిపారు. ఏడాదికి పైగా ఎయిర్ ఫోర్స్‌లో పనిచేసినప్పటికీ విమాన ప్రమాదం జరిగితే తన కొడుకు ప్రాణాలు కోల్పోతాడన్న భయంతో ప్రీతిపాల్‌ను ఆయన తండ్రి మాన్పించేశారు. ఆ తరువాత 23 ఏళ్ల వయసులో ప్రీతిపాల్ భారత నౌకాదళంలో 1943 నుంచి 1948 వరకు పనిచేశారు. ఆ సమయం లోనే రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది.భారత్ తరఫున అందులో పాల్గొన్నారు. ఐఎన్‌ఎస్ తీర్‌పై విధులు నిర్వహించారు. నేవీ అధికారిగా పనిచేస్తూనే ఆర్డిల్లరీ ( ఆయుధాల) స్కూలులో లాంగ్ గన్నరీ స్టాఫ్ కోర్స్‌కు అర్హత సాధించారు. ఆ కోర్సు పూర్తి చేసుకుని 1951లో గన్నర్ అధికారిగా భారత ఆర్మీలో చేరారు. 1965 లో భారత్ పాకిస్థాన్ యుద్ధంలో మీడియం రెజిమెంట్‌కు నాయకత్వం వహించారు. చివరగా మణిపూర్‌లో అసోం రైఫిల్స్ సెక్టార్ కమాండర్‌గా పనిచేస్తూ 1970 లో రిటైర్ అయ్యారు.

పంజాబ్ సిఎం శుభాకాంక్షలు

100 వ పుట్టిన రోజు జరుపుకుంటున్న కల్నల్ ప్రీతిపాల్‌కు పంజాబ్ సిఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. త్రివిధ దళాల అనుభవంతో దేశ సేవ లో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రీతిపాల్ సింగ్ ఇంకా ఎన్నో ఏళ్లు ఆనందంగా, ఆరోగ్యంగా పాజీవించాలని ఎందరికో స్ఫూర్తి కలిగించాలని ప్రార్థించారు.

Colonel Prithipal Singh Gill’s 100th Birthday

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News