Monday, April 29, 2024

సామాజిక మాధ్యమాలపై కత్తి

- Advertisement -
- Advertisement -

Controversy between the Central govt and Social Media

 

స్వతంత్ర భావ ప్రకటన వేదికలుగా ఉపయోగపడుతున్న ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూ ట్యూబ్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమ వేదికలు దేశంలో మూతపడబోతున్నాయా? కొనసాగినా వాటి ద్వారా అభిప్రాయాలు ప్రకటించుకోడానికి, వాటి వినియోగదార్లు ప్రస్తుతం అనుభవిస్తున్న స్వేచ్ఛకు విఘాతం కలగనున్నదా? నిన్నటితో (మే 26) అమల్లోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వ కొత్త సమాచార సాంకేతిక నిబంధనలు ఈ ప్రశ్నలకు తావు కల్పిస్తున్నాయి. ఈ నిబంధనలకు కట్టుబడి ఉంటామని ఈ సంస్థలేవీ ఇంత వరకు ప్రభుత్వానికి తెలియజేయలేదు. మెసేజింగ్ సంస్థ వాట్సాప్ ప్రభుత్వ నిబంధనలపై ఢిల్లీ హైకోర్టులో దావా వేసింది. తమ వేదికలపై ప్రసారమయ్యే చాట్లు, సందేశాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఎవరు పెడుతున్నారో తెలుసుకోవాలంటే ప్రతి ఒక్క దానిపైనా నిఘా ఉంచాల్సి ఉంటుందని, అది ప్రజల గోప్యత హక్కును కాలరాస్తుందని వాట్సాప్ అభిప్రాయపడుతున్నది.

ఈ వాదనతోనే అది కోర్టుకెక్కింది. పంపే వ్యక్తికి మాత్రమే తెలిసే (ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్) ప్రస్తుత ఏర్పాటుకు విఘాతం కలిగి జోక్యందారీ విధానం నెలకొంటుందని వాట్సాప్ భావిస్తున్నది నిజమే, ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కొత్త నియమాలు ఈ వేదికలపై ఎటువంటి అవరోధం లేకుండా సాగుతున్న సమాచార ప్రవాహానికి అడ్డు కట్టలు వేస్తాయి. ప్రభుత్వానికి ఇష్టం లేని వాటిపై కత్తెర పడేలా చేస్తాయి. ప్రింట్, ఎలెక్ట్రానిక్ మీడియాలకు మాదిరిగానే సెన్సార్ షిప్ విధానం అమల్లోకి వస్తుంది. ప్రభుత్వం అభ్యంతరం తెలిపే మెసేజ్‌లను, సమాచారాన్ని తొలగించి తీరవలసిన అగత్యాన్ని కలిగిస్తాయి. ఇవి ప్రజల మానవ భంగం వాటిల్లజేసి అమాయకులను కూడా జైళ్లకు పంపించే పరిస్థితిని దాపురింప చేస్తాయని వాట్సాప్ చేస్తున్న వాదనను కొట్టి పారేయడానికి వీల్లేదు. కొత్త నియమాలతో ఈ వేదికలు ఫిర్యాదుల విభాగాలను నెలకొల్పవలసి ఉంటుంది. పత్రికల్లో, ఎలెక్ట్రానిక్ మీడియాలో ప్రచురణకు, ప్రసారానికి నోచుకోని అభిప్రాయాలను ప్రజలు ప్రస్తుతం ఈ మాధ్యమాల ద్వారా యధేచ్ఛగా ప్రకటించుకుంటున్నారు.

ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల మీద గాని, వాటి వైఖరుల మీద గాని, ప్రపంచంలోని అన్ని స్థాయిల్లో ఉత్పన్నమయ్యే పరిణామాలపై గాని మనసు విప్పి నిర్మొహమాటంగా వ్యాఖ్యానం చేయగలుగుతున్నారు. ఇంటర్‌నెట్ వ్యాప్తి, స్మార్ట్ సెల్‌ఫోన్ల వినియోగం విప్లవాత్మక స్థాయికి చేరిన తర్వాత సామాజిక మాధ్యమాల్లోని అభిప్రాయాలు ప్రజా ఉద్యమాలనే సృష్టించగలుగుతున్నాయి. సంప్రదాయ మీడియాలో రాకముందే సమాచారం అత్యంత తాజాగా సోషల్ మీడియాకు ఎక్కుతున్నది. మంచి చెడుల చర్చ లోతుగా జరుగుతున్నది. విజ్ఞాన తాత్వికాది అంశాల లోతుల పరిశీలన సాగుతున్నది. ఖాతాదార్లు తమ సృజనాత్మక పాటవాన్ని ప్రదర్శించుకోగలుగుతున్నారు. మహిళలు, అణగారిన సామాజిక వర్గాల వారు ఈ వేదికలను నిర్భయంగా వినియోగించ గలుగుతున్నారు. వీటిపై సెన్సార్ షిప్ అమలైతే ఏమి చెబితే ఏ ముప్పు ముంచుకొస్తుందో, ఏ అర్ధరాత్రి ఏ పోలీసులు తలుపు కొడతారో అనే భయం వీటి వినియోగదారులను ఆవహిస్తుంది.

ఈ మాధ్యమాలు ప్రాధాన్యతను కోల్పోయి సోషల్ మీడియా కాస్తా ఈగలు తోలుకునే వ్యవస్థగా మారిపోతుంది. ప్రస్తుతం దేశంలో ఫేస్‌బుక్ యాజమాన్యానికి చెందిన వాట్సాప్‌కు 53 కోట్ల మంది, యూ ట్యూబ్‌కు 44.8 కోట్ల మంది, ఫేస్‌బుక్‌కు 41 కోట్ల మంది, ఇన్‌స్టాగ్రామ్‌కు 21 కోట్ల మంది, ట్విట్టర్‌కు 1.75 కోట్ల మంది వినియోగదారులున్నట్టు సమాచారం. ఇవి ప్రభుత్వ నియమాలను అంగీకరిస్తే భవిష్యత్తులో పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోడానికి తాజా ఉదంతం ఒక దాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రధాని మోడీని, ఆయన ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచార వ్యూహాన్ని (టూల్ కిట్‌ను) ప్రయోగించిందని బిజెపి జాతీయ స్థాయి పెద్దలు కొందరు చేసిన ట్వీట్లపై ఆ పార్టీ ఫిర్యాదును పురస్కరించుకొని పరిశీలన జరిపిన ట్విట్టర్ యాజమాన్యం అటువంటి వారి ఆరేడు ట్వీట్లను వక్రీకరణలుగా వర్గీకరించింది. దానికి ఆగ్రహం చెందిన కేంద్ర ప్రభుత్వం తన ఐటి శాఖ ద్వారా తీవ్ర అభ్యంతరం తెలిపింది.

ఆ వర్గీకరణను తొలగించవలసిందిగా కోరింది. కేంద్రానికి, ట్విట్టర్‌కు మధ్య ఈ వివాదం ఇంకా పచ్చిగానే ఉంది. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, జపాన్ వంటి పలు దేశాల ప్రభుత్వాలు కూడా సామాజిక మాధ్యమాలలోని సందేశాలు, అభిప్రాయాల గోప్యతను సడలించాలని ఒత్తిడి తెస్తున్నాయి. భారత దేశంలో గల బహుళ సామాజిక వ్యవస్థకు, బిజెపి పాలకుల హిందుత్వ ఆధిపత్యానికీ మధ్య వైరుధ్యాలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నియమాలు దేశంలో స్వేచ్ఛాయుత చర్చను బలి తీసుకుంటాయి.అందుచేత ప్రజాస్వామిక స్వేచ్ఛలను గౌరవిస్తూ సామాజిక మాధ్యమాల మీద ప్రయోగించిన కాఠిన్యతను కేంద్ర ప్రభుత్వమే సహేతుక స్థాయికి సడలించుకోవలసి ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News