Saturday, April 27, 2024

గ్రేటర్ లో కరోనా రోజుకో డబుల్ సెంచరీ

- Advertisement -
- Advertisement -

ఈ నెలాఖరులో త్రిపుల్ సెంచరీ దాటచ్చొని భావిస్తున్న వైద్యులు
ప్రజలు జాగ్రత్తలు పాటించకపోతే వైరస్ రెక్కలు కట్టుకుంటుందని వెల్లడి
అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని అధికారుల సూచనలు

Corona spread in GHMC area

మన తెలంగాణ/సిటీబ్యూరో:  గ్రేటర్ నగరంలో కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తూ డబుల్ సెంచరీ దాటింది. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎంత శ్రమించినా వైరస్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. మూడు నెలల కాలంలో నమోదైన కేసుల్లో ఎక్కువ పాజిటివ్ కేసులు బుధవారం ఒక రోజు 214 కేసులైనట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇంత సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో నగర ప్రజలు ఈనెలాఖరులోగా 300లకు పైగా కేసులు నమోదు కావొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం లాక్‌డౌన్‌పై మరోసారి ఆలోచించాలని కోరుతున్నారు.

మొదటి, రెండో విడుత లాక్‌డౌన్‌లో ప్రజలకు బయటకు వెళ్లకుండా పకడ్బందీగా అమలు చేయడంతో కరోనా వైరస్ ముక్కుతాడు పడింది. మూడో విడుత లాక్‌డౌన్‌లో మద్యం, రిజిస్ట్రార్, ఆర్టీఏ కార్యాలయాలు, ప్రైవేటు దుకాణాలు తెరిచేలా వెసులుబాటు కల్పించడంతో నగరవాసులు ఇష్టానుసారంగా రోడ్డపైకి వచ్చి మాస్కులు లేకుండా, శానిటైజర్ వినియోగించకుండా దుకాణాల వద్ద గుంపులు గుంపులుగా చేరడంతో వైరస్ విజృంభణ చేసిందని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాతబస్తీ వంటి ప్రాంతాల్లో రాత్రి, పగలు తేడా లేకుండా అక్కడి ప్రజలు బయట తిరుగుతూ జాగ్రత్తలు పాటించాలని సూచించిన అధికారులను బెదిరింపులకు గురిచేస్తున్నారు. ఇప్పటికి నమోదైన కేసుల్లో ఎక్కువ కేసుల్లో అక్కడివేనని అధికారులు వెల్లడిస్తున్నారు. మే 15తరువాత మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ఉపాధి కోసం వెళ్లి వలసకూలీలు స్వస్థ్దలాలకు తిరిగిరావడంతో కరోనా రెక్కలు కట్టుకుని స్వైర విహారం చేస్తుందని వైద్యాధికారులు వెల్లడిస్తున్నారు.

ప్రజలు ఎవరికి వారే జాగ్రత్తలు పాటించాలని హెచ్చరికలు చేసి నిత్యావసరాల పేరుతో అడ్డగోలుగా తిరగడంతో నెల రోజుల నుంచి రోజుకు సగటున 120 కేసులు నమోదుగా, ప్రస్తుతం నగరంలో 200 కేసులు దాటాయి. అనుమానితలు, లక్షణాలున్న వారి నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు చేస్తుండగా, అందులో పావు వంతు నమూనాల్లో కరోనా పాజిటివ్ వస్తోంది. బుధవారం 1096 మంది పరీక్షలు చేయగా, అందులో 24.5 శాతం మందికి పాజిటివ్ రావడం ఆందోళన కలిస్తుంది. కరోనా వైరస్ బారిపడుతున్న వారిలో పురుషులే అధికంగా ఉంటున్నట్లు వైద్యులు వెల్లడిస్తున్నారు.అదే విధంగా మధుమేహం, హైపర్ టెన్షన్ ఉన్నవాళ్లు ఎక్కువశాతం మరణిస్తున్నట్లు, గుండె సంబంధ వ్యాధులు, ఊపిరితిత్తులు, కేన్సర్, కిడ్నీ, గ్యాస్ట్రిక్ అల్సర్, నరాల సమస్యలు, ఊబకాయం ఉన్నవాళ్లు కొంత మంది మాత్రమే కోలుకుంటున్నట్లు వైద్యాధికారులు వివరిస్తున్నారు. నగర ప్రజలు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సూచించిన విధంగా జాగ్రత్తలు పాటిస్తే కరోనా వేగానికి కళ్లెం వేయవచ్చని, నిర్లక్షం చేస్తే ప్రాణాలకు ముప్పదని హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News