Sunday, April 28, 2024

కరోనా విశ్వరూపం

- Advertisement -
- Advertisement -

Coronavirus Outbreak in Hyderabad

హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు పయనం,  ఖాళీ అవుతున్న పలు కాలనీలు..
గత పదేళ్లుగా హైదరాబాద్‌లో స్థిరపడిన ఇతర రాష్ట్రాల వారి పరిస్థితి అగమ్యగోచరం

హైదరాబాద్ : కరోనా విశ్వరూపం ప్రదర్శిస్తోంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్ నగరానికి వచ్చి జీవనోపాధి చేసుకునేవారంతా నేడు హైదరాబాద్‌లో కరోనా విలయతాండవం చేస్తుండటంతో తమ సొంతూళ్ల బాట పట్టేశారు. లాక్‌డౌన్ సడలింపుల తర్వాత కరోనా వీర విజృంభణ కొనసాగుతూ వస్తోంది. రోజురోజుకు ఈ మహమ్మారి తన ప్రతాపాన్ని చూపుతోంది. సడలింపుల నేపథ్యంలో తిరిగి తాము ఉద్యోగాలు, ఇతరత్రా పనులకు వెళ్లొచ్చన్న వారికి ఆశనిపాతమే అయింది. కరోనాతో అన్ని రంగాలు కుదేలయ్యాయి. తత్ఫలితంగా ఉద్యోగాలు వీడి కొందరు.. ఉద్యోగాలున్నా ఏమి చేయలేని నిస్ససహాయ స్థితిలో మరికొందరు హైదరాబాద్‌ని వీడి వెళ్లిపోయారు.. వెళ్లిపోతున్నారు… కరోనా కాటుకు గురయ్యే కన్నా తమ సొంతూళ్లలో ఎలాగొలా బతుకు బండిని నడిపిద్దామని తలిచి ఇంకొందరు సొంతూళ్లకు పయనమైపోయారు. పలు కాలనీలు ఖాళీ అయ్యాయి.

ఆయా కాలనీల్లో టులెట్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో అద్దెల రేట్లు కూడా తగ్గుముఖం పట్టాయి. రియల్ రంగంతో సహా ఇతర వ్యాపార, వాణిజ్య సముదాయాలు బిజినెస్‌లు లేక డీలాపడ్డాయి. కరోనా భయంతో హైదరాబాద్ వాసులు ఇళ్లు విడిచి బయటకు వెళ్లేందుకు జంకడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. దీంతో ఉద్యోగుల సంఖ్యను కుదించి వ్యాపారాల కొనసాగించేందుకు మొగ్గుచూపుతున్నప్పటికీ ఆ మేర ఖర్చులు సైతం రాని పరిస్థితి నెలకొంది. లాక్‌డౌన్ సడలింపుల నిబంధనలు కఠినతరంగానే ఉన్నాయి. చిన్న టీ స్టాల్ నుంచి పెద్ద మాల్ వరకూ కిటకిటలాడే జనాలు కరోనా వైరస్ ఆంక్షల వల్ల పలచబడిపోయారు. జనసంచారం కనిపించని పరిస్థితి ఉంది.

హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలోనే రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య ఉధృతి కొనసాగుతుండటం.. స్కూల్స్, కాలేజీలు ఇప్పుడిప్పుడే తెరుచుకోలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పిల్లలతో సహా సొంతూళ్ల బాట పట్టేశారు. కరోనా లాక్‌డౌన్ సందర్భంలో ఆర్ధిక పరిస్థితులు చిన్నాభిన్నమయ్యాయి. మరికొంత కాలం లాక్‌డౌన్ పొడిగిస్తే పరిస్థితి చేయిదాటుతుందని భావించిన ప్రభుత్వాలు ఇక లాక్‌డౌన్‌లు లేవు.. అన్‌లాక్‌లేనని స్పష్టపర్చడం.. ఆ దిశగా సడలింపులనివ్వడం జరిగింది. లాక్‌డౌన్ సడలింపులొచ్చాయి పరిస్థితి కుదుటపడుతుందని భావించిన హైదరాబాద్ వాసులకు నిరాశే మిగిలింది.

ఇందుకు కరోనా మరింతగా విజృంభించడమే ఇందుకు నిదర్శనం. హైదరాబాద్ ఖాళీ అవుతున్న సందర్భంలో ఇప్పుడు ఇంటి యజమానులలో ఆందోళన నెలకొంది. గతంలో అద్దెల కోసం పట్టి పీడించిన వారంతా నేడు తమ ఇళ్లల్లో అద్దెకు ఎవరు వస్తారనే చూసే దైన్య స్థితి నెలకొని ఉందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత పదేళ్లుగా హైదరాబాద్‌లో బీహార్, ఎపి, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు వచ్చి చిరు వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకున్న వారు బాగా పెరిగిపోయారు. వారంతా ఇప్పుడు అగమ్యగోచరంలో పడ్డారు.

Coronavirus Outbreak in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News