Sunday, April 28, 2024

కొవిడ్ అనాథ బాలల లెక్క!

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: కరోనా కాలంలో తలిదండ్రులను కోల్పోయిన అనాథ బాలలను ఆదుకోడానికి ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పించడం అందుకు ఒక పథకాన్ని రూపొందించి ప్రారంభించడం మంచి పరిణామం. మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్పొరేట్ సంస్థలను తప్ప వేరెవ్వరినీ కన్నబిడ్డల మాదిరిగా చూడలేదు. అయితే కరోనా అనాథ బాలలను ఆదుకోడానికి ముందుకొచ్చిన ప్రధాని వారికి పరిపూర్ణమైన న్యాయం కల్పించారా, కంటి తుడుపు విదిలింపుతో సరిపెట్టారా అనే అంశాన్ని తరచి చూసి తెలుసుకోవలసి వుంది. ఎందుకంటే దేశంలో కరోనా గజ్జె కట్టి ప్రళయ తాండవం చేస్తున్నప్పుడు ఇంట్లో వున్న పాత్రలను మోగించాలన్న సూచన ప్రధాని మోడీ నుంచి వచ్చినంత గట్టిగా ఆయన ప్రభుత్వం నుంచి కొవిడ్ రోగులకు అవసరమైన సహాయం లభించలేదు. కొవిడ్ వరుసపెట్టి ప్రతి ఇంటి నుంచి కనీసం ఒక శవాన్ని లేపుతుంటే రోగులకు తగిన మందులు, ఆక్సిజన్ సిలిండర్లు వంటివి సమకూర్చడం విషయంలో మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైన విషయం చరిత్రలో నమోదైంది.

దీనిని తుడిచిపెట్టుకోడానికి కరోనా మృతుల సంఖ్యను పరిమితం చేసి చూపించడం వంటి కుయుక్తులకు ప్రభుత్వం వెనుకాడలేదు. అందుకే ప్రధాని మోడీ తరచూ టీకాల పంపిణీలో సాధించిన విజయాన్నే చెప్పుకుంటారు గాని, ముమ్మర సమయంలో కొవిడ్‌ను అదుపులో వుంచడానికి ఏమి చేశారో చెప్పరు. తమ చేతకానితనం వల్ల ప్రైవేటు వైద్యశాలలు ప్రజలను దోచుకున్న వైనం వివరించరు. లక్షలాది వలస కార్మికులను ఉన్నట్టుండి రోడ్డున పడవేసిన సంగతి చెప్పరు. టీకాల విషయంలో కూడా సుప్రీంకోర్టు మొట్టికాయ వేస్తేగాని వాటిని ఉచితంగా ప్రజలకు అందించడానికి ఆయన ప్రభుత్వం సిద్ధపడలేదు. అందుచేత అనాథ బాలలకు స్కాలర్ షిప్‌లు ఏర్పాటు చేసే విషయంలో ప్రధాని మోడీ చూపిన చొరవను పూర్తిగా ప్రశంసించలేని పరిస్థితి నెలకొన్నది. ‘పిల్లలకు పిఎం కేర్స్’ అనే పథకం కింద కొవిడ్ అనాథ బాలలకు నెలకు రూ. 4000, 23 ఏళ్ల వయసు నిండిన తర్వాత రూ. 10 లక్షలు అందజేసేలా ఏర్పాటు జరిగింది. అయితే పిల్లలు స్కూలు ఫీజులు, పుస్తకాలు వగైరా అవసరాలను ఈ రూ. 4000 నుంచే సమకూర్చుకోవలసి వస్తుంది. బాలలకు నికరంగా నెలకు అందే నగదు రూ. వెయ్యికే పరిమితం. ఇందుకు అదనంగా ఆయుష్మాన్ భారత్, ప్రధాన మంత్రి ఆరోగ్య యోజన ద్వారా ఉచిత వైద్య సదుపాయం కల్పించ దలిచారు. దేశ వ్యాప్తంగా 4345 మంది కొవిడ్ అనాథ బాలలకు ఈ ప్రయోజనం కలిగించనున్నారు.

ఈ మేరకు ఈ పథకాన్ని ప్రధాని మోడీ సోమవారం నాడు అమల్లోకి తీసుకొచ్చారు. లబ్ధిదారులందరికీ ప్రధాని లేఖలు కూడా రాశారు. ఈ సందర్భంలో ప్రధాని మోడీ బాల్యంలోనే తల్లిని కోల్పోయిన తన మాతృమూర్తిని గుర్తు చేసుకొని బాధపడ్డారు. అది కొవిడ్ అనాథ బాలలతో ఆయన ప్రకటించుకున్న సహానుభూతిని చాటింది. అయితే దేశంలో ఎంత మంది బాలలు కొవిడ్ వల్ల తలిదండ్రులను కోల్పోయి అనాథలయ్యారు, పిఎం కేర్స్ కింద ఇచ్చే ఈ సహాయం వారిలో ఎంత మందికి అందుతున్నది అనే విషయాన్ని లోతులకు పరిశీలించినప్పుడు కేంద్ర ప్రభుత్వం వీరికి చేస్తున్న సహాయం చెప్పుకోదగినది కాదని బోధపడుతుంది. కంటి తుడుపు విదిలింపుగానే అర్థమవుతుంది. ఏడాదిన్నర పాటు మూడు విడతలుగా దేశ ప్రజలను చెప్పనలవికాని కష్టాల్లోకి, ప్రాణభయంలోకి నెట్టివేసి వారి దైనందిన జీవనాన్ని కకావికలు చేసిన కరోనా దేశ వ్యాప్తంగా దాదాపు 5 కోట్ల మందికి సోకగా, వారిలో 5,25,000 మంది మరణించినట్టు కేంద్ర ప్రభుత్వం అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. అయితే ఇందుకు విరుద్ధంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ దేశంలో కొవిడ్ వల్ల 20 లక్షల మంది చనిపోయారని చెప్పింది.

ఆసుపత్రుల మరణ రిజిస్టర్లలో ప్రతి చావును చావుగానే నమోదు చేస్తారు గాని, ఏ కారణం వల్ల మరణించారో అరుదుగా గాని పొందుపరచరు. అదే సమయంలో ఆసుపత్రుల్లో చేరక ముందే కొవిడ్ వల్ల చనిపోయిన వారి మరణాలు కారణ సహితంగా రికార్డు కావు. అందుచేత ప్రభుత్వ లెక్కల్లో చూపిన మృతుల సంఖ్యను నమ్మలేము. దేశంలో కొవిడ్ వల్ల తలిదండ్రులిద్దరినో లేక వారిలో సంపాదించి కుటుంబాన్ని పోషించే వ్యక్తినో కోల్పోయి అనాథలైన బాలల సంఖ్య 19 లక్షలని లాన్సెట్ వైద్య పరిశోధన, సమాచార మేగజైన్ ఒక వ్యాసంలో తెలియజేసింది. కొవిడ్ ప్రబలిన మొదటి 20 మాసాల్లోనే ఈ లెక్క తేలినట్టు లాన్సెట్ వెల్లడించింది. బాలల హక్కుల రక్షణ జాతీయ కమిషన్ రాష్ట్రాల నుంచి సేకరించిన గణాంకాల ప్రకారం కొవిడ్ కాలంలో దేశ వ్యాప్తంగా అనాథలైన బాలలు 1.53 లక్షల మంది అని కేంద్రం తెలిపింది. అందులో పోషకులను కోల్పోయి, బతకడానికి ఏదారీ లేని స్థితిలోని బాలలు 4345 మందేనని లెక్క తేల్చింది. నిరుపేదలు మెజారిటీగా, తండోపతండాలుగా వున్న దేశలో ఇదెంత నిజమో ఆ అంకెలే చెబుతున్నాయి. దిక్కుమొక్కు లేని పిల్లల విషయంలో కూడా ఉదారంగా వ్యవహరించడానికి ప్రధానికి చేతులు రాలేదని ఈ గణాంకాలు చెబుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News