Sunday, April 28, 2024

తియ్యటి మాటలు నమ్మి మోసపోవద్దు

- Advertisement -
- Advertisement -

CP Sajjanar said to be careful about cyber criminals

సైబర్ నేరస్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి
కామన్ సెన్స్‌ను ఉపయోగించాలి
రెయిన్‌బో విస్టాలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం
సైబరాబాద్ సిపి విసి సజ్జనార్

హైదరాబాద్: సైబర్ నేరస్థులు మాట్లాడే తియ్యటి మాటలు నమ్మి మోసపోవద్దని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ అన్నారు. సైబర్ నేరాలపై సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల్లో భాగంగా మూసపేటలోని రేయిన్‌బో విస్టాలో మంగళవారం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅథితిధిగా పాల్గొన్న సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ మాట్లాడుతూ ప్రపంచంలో మార్పులు చాలా వేగంగా వస్తున్నాయని, అదేవిధంగా సైబర్ నేరాలు కూడా రోజు రోజుకు పెరుగుతున్నాయని అన్నారు. సైబర్ నేరాలు పెరగడంతో చాలామంది అమాయకులు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు పోగొట్టుకుంటున్నారని అన్నారు. సైబర్ నేరస్థులు మాయమాటలు చెప్పి అమాయకుల నుంచి డబ్బులు దోచుకుంటున్నారని అన్నారు. సైబర్ నేరాలపై నాలెడ్జ్ అవసరం లేదని, కామన్ సెన్స్‌ను ఉపయోగించాలని కోరారు. సైబర్ నేరస్థుల బారిన అమాయక ప్రజలు పడకుండా ఉండేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు తదితర ప్రాంతాల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు.

ప్రతి మంగళవారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసులు హాజరై ప్రజలకు అన్ని వివరాలు చెబుతారని తెలిపారు. ప్రతి ఒక్కరూ పది సూత్రాలు పాటించాలని కోరారు. సోషల్ మీడియా పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు అన్నారు. ప్రొఫైల్‌ను లాక్ చేసుకోవాలని,దీని ద్వారా డూప్లికేట్ చేసే అవకాశం ఉండదని తెలిపారు. ఎవరిదైనా డూప్లికేట్ చేస్తే వెంటనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయాలని అన్నారు. సోషల్ మీడియాలో పోలీస్, ఆర్మీ యూనిఫాంతో ఫొటోలు పెట్టి ఛీటింగ్ చేస్తున్నారని, వాటిని ఒకసారి పరిశీలించాలని కోరారు.

బ్యాంక్ అధికారులు ఓటిపి అడుగరని, సైబర్ నేరస్థులు మాత్రమే అడుగుతారని అన్నారు. గుర్తుతెలియని వ్యక్తులు వీడియో కాల్స్, ఫోన్ చేసి రుణాల గురించి చెబితే నమ్మవద్దని అన్నారు. సైబర్ క్రైం ఎసిపి బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ సంప్రదాయ నేరాలు తగ్గాయని,సైబర్ నేరాలు పెరిగాయని అన్నారు. సాధారణ నేరాల కంటే సైబర్ నేరాల వల్ల ప్రజలు చాలా ఎక్కువగా డబ్బులు పోగొట్టుకుంటున్నారని అన్నారు. సైబర్ నేరాలపై ఇప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్‌లో సైబర్ సెల్ ఏర్పాటు చేశామని తెలిపారు. గతంలో కేవలం గచ్చిబౌలిలోని సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాల్సి ఉండేదని తెలిపారు. కార్యక్రమంలో కూకట్‌పల్లి ఇన్స్‌స్పెక్టర్ నర్సింగరావు, రేయిన్‌బో విస్టా రాక్ గార్డెన్ గేటెడ్ కమ్యూనిటీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News