Saturday, April 27, 2024

సోషల్ మీడియా వేదికగా… విద్యుత్ విభాగంపై విమర్శలు

- Advertisement -
- Advertisement -

Criticism of the power sector

 

ప్రచారంచేసిన ఎడిఇ కోటేశ్వర్‌రావు సస్పెన్షన్
ఒకే కాంట్రాక్టర్‌కు 4769 పనులు అప్పగింత…?

మనతెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ విద్యుత్ విభాగానికి చెందిన ఎడిఇ కోటేశ్వర్‌రావుపై సస్పెన్షన్ వేటు వేసింది విద్యుత్ సంస్థ. సోషల్ మీడియా వేదికగా పలు విషయాలను, సంస్థపై విమర్శలను చేస్తూ కోటేశ్వర్‌రావు పోస్టులు చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన విద్యుత్ విభాగం ఎడిఇని సస్పెండ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. విభాగానికి సంబంధించిన పలు రకాల విషయాలు, అంశాలను సంస్థ యాజమాన్యం అనుమతి లేకుండా సంస్థ విధానాలను విమర్శిస్తూ ఫేస్‌బుక్ లైవ్ ద్వారా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 3.73లక్షల మంది వ్యూస్ రాగా, 6వేల మంది నెటిజన్‌లు కోటేశ్వర్‌రావు పోస్టును షేర్స్ చేశారు.

దీంతో టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ యాజమాన్యం ఏడీఈపై సస్పెన్షన్‌ను విధించింది. మిస్ కండక్ట్ అండర్ ఎపిఎస్‌ఇబి నిబంధనలు, క్రమశిక్షణ, అప్పీల్ రెగ్యూలేషన్, టిఎస్‌పిడిసిఎల్ నియంత్రణ నిబంధనలు ఉల్లంగించారని సంస్థ వెల్లడించింది. ఎపిఎస్‌ఇబి ఉద్యోగుల క్రమశిక్షణ, నిబంధనల ప్రకారం ఎడిఇ కోటేశ్వర్‌రావును సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయన ప్రధాన కార్యాలయం(హైదరాబాద్ ) వదిలి వెల్లకూడదని ఆదేశిస్తూ సిఎండి రఘుమారెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

సస్పెన్షన్‌కు కారణం…
ఈ నెల 4న ఎడిఇ కోటేశ్వర్‌రావు టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రఘుమారెడ్డిపై సంచలన ఆరోపణలు చేస్తూ ఫేస్‌బుక్ లైవ్ ద్వారా 45 ని.లు వీడియో పోస్టుచేశారు. దీంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. తూర్పుగోదావరికి చెందిన ఆంధ్రా కాంట్రాక్టర్ ఏడుకొండలుకు ప్రదీప్ ఎలక్ట్రికల్ పేరుపై ఒకే ఒక కాంట్రాక్టర్ కు 4769 ఎలక్ట్రికల్ వర్క్‌లు ఇచ్చారని ఆరోపించారు. ఎస్‌ఎస్‌ఆర్ రేట్లకు విరుద్దంగా ఇష్టానుసారంగా రూ. 30.69 కోట్లు నామినేషన్ వర్క్‌లు ఇచ్చారని ఆరోపణలు చేశారు. ట్రాన్స్‌ఫార్మర్స్ దగ్గర రక్షణ ఏర్పాటు చేసే కంచె పనులకు మెదక్ డివిజన్‌లో స్క్వేర్ ఫీట్ రూ. 56లు చొప్పున నామినేషన్ మీద పనులు అప్పగించారని, ఇదే పనిని వేరే డివిజన్ లో స్క్వేర్ ఫీట్ రూ.125, మరో డివిజన్‌లో రూ. 284లకు వికారాబాద్ డివిజన్‌లో స్క్వేర్ ఫీట్‌కు రూ.384 నామినేషన్ పై పనులు అప్పగించారని కోటేశ్వర్‌రావు ఆరోపించారు.

ఫెన్సింగ్ పనికరాలు రాణిగంజ్ లో కిలోలుగా తూకంతో దొరుకుతుందని, స్క్వేర్ ఫీట్ రూ. 28 నుంచి 34 రూపాయలకే వస్తుందని వెల్లడించారు. అక్రమంగా కట్టబెట్టి పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారని, విద్యుత్ లైన్లకు అడ్డు వస్తున్నాయని చెట్ల కొమ్మలు కొట్టడంలో వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఆరోపించారు. ఫీడర్ పరిధిలో కూలీలు చెట్లకొమ్మల నరికించడంలో కోట్లాది రూపాయలను కొల్లగొట్టారని ఆయన ఆరోపించారు. తప్పుడు రిపోర్టులతో విజిలెన్స్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. పవర్డ్ కండక్టర్ కొనుగోళ్లలో గోల్‌మాల్ జరిగిందని ఆరోపించారు.

ఇండియాలో తక్కువ ధరకు దొరికే కండక్టర్‌ను కిలోమీటర్‌కు రూ. 10 లక్షలు చొప్పున 500 శాతం వరకు ఎక్కువ పెట్టి కొన్నారని, దీంట్లో పెద్ద కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఇదే తరహా కుంభకోణం ఏపీలో జరగగా బాధ్యత వహిస్తూ అక్కడి డిస్కం సీఎండీ దొర రాజీనామా చేశారని తెలిపారు. రాష్ట్రంలో అదే కుంభకోణం జరిగినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు. సదాశివరెడ్డి అనే వ్యక్తి రఘుమారెడ్డికి బినామీగా వ్యవహరిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రఘుమారెడ్డిపై రహస్య నివేదిక ముఖ్యమంత్రికి పంపానని కోటేశ్వర్‌రావు తెలిపారు. సిఎండికి అడ్వకేట్ ద్వారా నోటీసు ఇవ్వాలని నిర్ణయించినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

Criticism of the power sector as a social media platform
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News