Monday, April 29, 2024

‘ధోని’ హీరో సుశాంత్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Dhoni movie hero Sushanth to commit suicide

 

తీవ్ర ఒత్తిడిలో ఉరివేసుకుని బలవన్మరణం
‘ధోని’ బయోపిక్‌తో పేరు ప్రఖ్యాతులు
నాలుగు రోజుల క్రితం సుశాంత్ మేనేజర్ దిశా సలియాన్ సూసైడ్
కొంతకాలంగా దూరమైన గర్ల్‌ఫ్రెండ్!
రాజ్‌పుత్ అకౌంట్ నుంచి ఇటీవలే భారీగా డబ్బు విత్ డ్రా?
సుశాంత్ మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోడీ, సినీ, క్రీడా ప్రముఖులు, అభిమానులు

ముంబై: బాలీవుడ్ నటుడు, ప్రముఖ క్రికెటర్ ‘ధోని’ బయోపిక్‌లో నటించి మంచి పేరు ప్రఖ్యాతులతో పా టు అశేష అభిమానులను సంపాదించుకున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు. బాంద్రాలో ని తన అపార్ట్‌మెంట్‌లో ఆదివారంనాడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ మేరకు పోలీసులు ధ్రువీకరించారు. సుశాంత్ వయసు 34ఏళ్లు. ఆయన ఆకస్మిక మరణంపై దర్యాప్తు సాగిస్తున్నట్లు అడిషినల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మనోజ్ శర్మ తెలిపారు. సుశాంత్ గదిలో ఎలాంటి సూసైడ్ లెటర్ లభించలేదని, ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలిస్తున్నట్లు వెల్లడించారు. స్నేహితులు కూడా సుశాంత్ ఒత్తిడిలో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని చెబుతున్నారు. శనివారంనాడు రాత్రి తనకు అత్యంత సన్నిహితులైన స్నేహితులతో సుశాంత్ గడిపాడు.

ఆలస్యంగా నిద్రించాడు. ఆదివారం ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసే వ్యక్తి వచ్చి పనులు ముగించుకుని వెళ్లాడు. అయితే సుశాంత్ నిద్రిస్తున్నాడని అతని గదివైపు వెళ్లలేదు. తిరిగి మధ్యాహ్నం మళ్లీ వచ్చిన అదే వ్యక్తి సుశాంత్ ఇంకా బయటికి రాకపోవడాన్ని గమనించి తలుపును బాదాడు. అయినా స్పందన లేకపోవడంతో ఆయన స్నేహితులకు ఫోన్ చేశాడు. వెంటనే వచ్చిన సుశాంత్ స్నేహితులు తలుపులు బద్దలు కొట్టి గదిలోకి వెళ్లారు. గదిలో ఉరివేసుకుని ఉన్న సుశాంత్‌ను గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇదిలా ఉండగా ఇటీవల(9వ తేదీ) సుశాంత్ మాజీ మేనేజర్, 28 సంవత్సరాల దియా సలానీ విపరీతంగా తాగి భవంతిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మరణంపై సుశాంత్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు కూడా పెట్టారు. ఇంతలోనే రాజ్‌పుత్ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు. సుశాంత్ గర్లఫ్రెండ్ కూడా అతనికి కొంత కాలంగా దూరంగా ఉంటున్నట్లు సమాచారం.

ఇటీవల ఆయన అకౌంట్ నుంచి భారీ మొత్తం డబ్బు విత్ డ్రా అయినట్లు తెలుస్తోంది. కొద్ది సంవత్సరాల క్రితం ఆయన తల్లి అకాల మరణం చెందారు. ఇవన్నీ సుశాంత్‌ను కుంగదీసి ఉంటాయని, ఆ ఒత్తిడిలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని బాలీవుడ్ వర్గాలో చర్చ జరుగుతోంది. సుశాంత్ సింగ్ టీవీ సీరియళ్లతో కెరీర్ షురూ చేసి సినిమాలతో సక్సెస్‌ఫుల్ గా కెరీర్ కొనసాగిస్తున్న సమయంలో ఆత్మహత్యకు పాల్పడటం సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆత్మహత్యలు వద్దని అతని చివరి సినిమా ‘చిచ్చోరే’లో సందేశాన్నిచ్చిన సుశాంత్ ఇపుడు అదే పనికి పాల్పడి లోకాన్ని వీడడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సుశాంత్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. టివి, సినీ నటుడిగా ఆయన మంచి పేరు సంపాదించుకున్నారని, ఇలా అకాల మరణం బాధించిందని మోడీ విచారం వ్యక్తం చేశారు. పలువురు కేంద్ర మంత్రులు, సినీ ప్రముఖులు, క్రీడా ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ప్రకటనలు చేశారు.

పాట్నాలో జననం…

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 1986 జనవరి 21న పాట్నాలో జన్మించాడు. టీవీ సీరియల్స్ ద్వారా నటుడిగా పరిచయమైన సుశాంత్ ఆ తర్వాత డ్యాన్సర్‌గా కూడా తన ప్రతిభను చాటుకున్నాడు. స్టార్‌ప్లస్‌లో ప్రసారమైన కిస్ దేశ్ మే హై మేరా దిల్ చిల్ షో నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. జీ టీవీలో పాపులర్ అయిన పవిత్ర రిస్థాకు అవార్డు కూడా పొందాడు. 2013లో కై పో చే చిత్రంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత శుధ్ దేశీ రొమాన్స్ చిత్రంలో నటించాడు. డిటెక్టివ్ భ్యోమకేశ్ బక్షీ (2015)లో డిటెక్టివ్ పాత్రలో అందరినీ ఆకట్టుకున్నాడు. అమీర్‌ఖాన్ హీరోగా నటించిన పీకే చిత్రంలో సపోర్టింగ్ రోల్ లో కనిపించాడు. 2016లో వచ్చిన టీమిండియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బయోపిక్ ‘ఎంఎస్ ధోని..ది అన్‌టోల్ స్టోరీ’ లో తన నటనకు ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ పురస్కారం అందుకున్నాడు. కేదార్‌నాథ్ చిత్రంలో లవర్‌బాయ్ పాత్రలో అందిరినీ అలరించాడు.

చదువులోనూ దిట్టే…

వెండితెరపై నటనతో మంచి మార్కులు తెచ్చుకున్న బాలీవుడు నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఉన్నత విద్యలోనూ మంచి మార్కులే సంపాదించుకున్నాడు. పోటీ పరీక్షల్లో చాలాసార్లు టాపర్‌గా నిలిచాడు. సుశాంత్ జాతీయ స్థాయి ఒలింపియాడ్ ఫిజిక్స్‌లో విజేతగా నిలిచాడు. ఇంటర్ తర్వాత ఇంజినీరింగ్‌లో ప్రవేశాలకు నిర్వహించే ఏఐఈఈఈ ప్రవేశ పరీక్షలోఆల్ ఇండియా ఏడో ర్యాంకు సాధించాడు. ఢిల్లీ ఇంజినీరింగ్ కాలేజ్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో పట్టా పొందారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ షియామక్ ధావర్ దగ్గర సుశాంత్ డ్యాన్స్ నేర్చుకున్నాడు సినీ నటుడు కావాలనే లక్ష్యంతో బారీ జాన్ యాక్టింగ్ స్కూల్‌లో చేరి నటన నేర్చుకున్నాడు. మొదట్లో అతడు డ్యాన్సర్‌గా కూడా పనిచేశాడు. సినిమాల పరంగా సుశాంత్‌కు ’ధోనీ’ మూవీ టర్నింగ్ పాయింట్. 2013లో అభిషేక్ కపూర్ దర్శకత్వంలో వచ్చిన ‘క్యా పో చే’ సినిమాతో సుశాంత్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టగా అందులో తన నటనకు ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News