Monday, April 29, 2024

సింధియా విషయంలో అది మా తప్పే

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ:మాజీ కేంద్ర మంత్రి, నాలుగుసార్లు కాంగ్రెస్ టిక్కెట్‌పై లోక్‌సభ స్థానానికి ఎంపికైన జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ను వీడతారని తాము కలలో కూడా ఊహించలేదని, అది తమ తప్పేనని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పదవిని జ్యోతిరాదిత్య సింధియాకు ఇవ్వడానికి కాంగ్రెస్ నాయకత్వం సంసిద్ధత తెలిపిందని, కాని..తనకు కాక తన సహచరుడికి ఆ పదవిని ఇవ్వాలని సింధియా సూచించడంతో ముఖ్యమంత్రి కమల్‌నాథ్ అంగీకరించలేదని దిగ్విజయ్ చెప్పారు. రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా సింధియాకు ఇవ్వడానికి కాంగ్రెస్ సంసిద్ధత తెలిపిందని, అయితే అత్యాశపరుడైన సింధియాకు కేంద్ర మంత్రి పదవిని కట్టబెడతామని మోడీ-షా ద్వయం ఆశచూపిందని ఆయన ఆరోపించారు.

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడంలో మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యూహాలు ఫలించకపోవడంతో బిజెపి ఇప్పుడు సింధియాను ప్రయోగించిందని ఆయన తెలిపారు. మధ్యప్రదేశ్‌కు చెందిన 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంపై స్పందిస్తూ వారిలో 13 మంది కాంగ్రెస్‌ను వీడబోమని హామీ ఇచ్చారని దిగ్విజయ్ చెప్పారు. కమల్‌నాథ్ నాయకత్వంలోని మధ్యప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో జరిగే బలపరీక్షలో నెగ్గుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని, తాము చేతులు కట్టుకుని చూస్తూ ఊరుకోబోమని ఆయన స్పష్టం చేశారు.

Did not anticipate Scindia will quit:Digvijaya Singh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News