Monday, April 29, 2024

జింజియాంగ్ చీఫ్ చెన్‌క్వాంగ్వోకు ఉద్వాసన

- Advertisement -
- Advertisement -
Dismissal of Xinjiang Chief Chen Quanguo
కార్యదర్శి పదవి నుంచి తొలగించిన చైనా అధ్యక్షుడు
అమెరికా ఆంక్షలకు గురైన అధికారి

బీజింగ్: అధ్యక్షుడు జిన్‌పింగ్ అధ్యక్షతన సమావేశమైన చైనా కమ్యూనిస్ట్ పార్టీ(సిపిసి) కేంద్ర కమిటీ జింజియాంగ్ రాష్ట్ర కార్యదర్శి పదవి నుంచి చెన్‌క్వాంగ్వోను తొలగించినట్టు ఆ దేశ అధికారిక మీడియా జిన్‌హువా వెల్లడించింది. ఆ రాష్ట్రంలోని ఉయ్‌ఘర్ ముస్లింలపై అణచివేతకు పాల్పడుతున్నారన్న అభియోగాలతో చెన్‌పై అమెరికా ఆంక్షలు విధించింది. చైనా అధికారులు ఆ రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్టు అమెరికా చేసిన ఆరోపణలను యుకె, యూరోపియన్ యూనియన్ సమర్థించాయి. చెన్ స్థానంలో ఆ రాష్ట్ర పార్టీ చీఫ్‌గా గ్వాంగ్‌డాంగ్ రాష్ట్ర గవర్నర్ మా జిన్‌గ్రూయికి బాధ్యతలు అప్పజెప్పినట్టు చైనా మీడియా తెలిపింది. అయితే, చెన్‌ను బాధ్యతల నుంచి తొలగించడానికి అమెరికా ఆరోపణలకూ సంబంధం లేదని హాంకాంగ్ నుంచి వెలువడే సౌత్‌చైనా మార్నింగ్ పోస్ట్ విశ్లేషించింది. చెన్‌కు పదోన్నతి కల్పించేందుకే సిపిసి ఆ నిర్ణయం తీసుకున్నదని తెలిపింది. చైనా మీడియా కూడా చెన్‌కు మరో పదవి ఇవ్వనున్నట్టు పేర్కొన్నది.

వేలాదిమంది ఉయిఘర్ ముస్లింలను నిర్బంధ శిబిరాల్లో బంధించిందని, వనరులు అధికంగా ఉన్న ఆ రాష్ట్రంలో కార్మికులతో బలవంతంగా పని చేయిస్తున్నట్టు, ముస్లిం మహిళలకు బలవంతపు గర్భస్రావాలు జరుపుతున్నట్టు సిపిసిపై ఆరోపణలున్నాయి. ఈ విధమైన నిర్బంధకాండకు కారకులుగా భావిస్తూ చెన్‌తోపాటు జింజియాంగ్ రాష్ట్రానికి చెందిన మరో ఇద్దరు ఉన్నతాధికారులపై అమెరికా ఆంక్షలు విధించింది. అందుకు ప్రతీకారంగా అమెరికా అధికారులపైనా చైనా ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు, ప్రతి ఆంక్షలు ట్రంప్ హయాంలోనే జరిగాయి. అయితే, మానవ హక్కుల ఉల్లంఘన వాస్తవం కాదని సిపిసి అంటోంది. చైనా పట్ల అంతర్జాతీయంగా వ్యతిరేకత పెంచేందుకే తమ వ్యతిరేకులు సాగిస్తున్న దుష్ప్రచారమని చైనా చెబుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News