Saturday, April 27, 2024

ఆగస్టు 20 నుంచి ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు?

- Advertisement -
- Advertisement -

Final year UG, PG exams from August 20

 

సెప్టెంబర్‌లోగా పూర్తి చేసేలా వర్సిటీల ఏర్పాట్లు
త్వరలో అధికారికంగా పరీక్షల తేదీల వెల్లడి

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఆగస్టు 20 నుంచి డిగ్రీ, పిజి ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంంగా అన్ని యూనివర్సిటీల పరిధిలో డిగ్రీ, పిజి సహా ఇరత ఉన్నత విద్యాకోర్సులకు చివరి ఏడాది విద్యార్థులకు తప్పనసరిగా పరీక్షలు నిర్వహించాలని కేంద్ర మానవ వనరుల శాఖతోపాటు యుజిసి స్పష్టం చేసిన నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై ఉన్నత విద్యామండలి, వర్సిటీలు దృష్టి సారించాయి. సెప్టెంబర్ చివరిలోగా డిగ్రీ, పిజి పరీక్షలు నిర్వహించాలని యుజిసి సూచించిన నేపథ్యంలో పరీక్షల నిర్వహణ తేదీలపై ఆయా వర్సిటీలతో ఉన్నత విద్యామండలి చర్చిస్తోంది. ఆగస్టు 15 తర్వాత పరీక్షలు ప్రారంభించి సెప్టెంబర్ 10లోగా పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది.

అందులో భాగంగా ఆగస్టు 20 నుంచి ఫైనల్ ఇయర్ పరీక్షలు ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. త్వరలో ఆయా వర్సిటీల ఫైనల్ సెమిస్టర్ పరీక్షల తేదీలను త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు. ఇంజనీరింగ్, డిగ్రీ చివరి సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు తర్వాత కోర్సులు చేయాలన్నా, ఉద్యోగాలకు వెళ్లాలన్నా పరీక్షలు పూర్తి చేసి ధృవపత్రాలు పొందాల్సి ఉంటుంది, కాబట్టి వారికి పరీక్షలు నిర్వహించాలని యుజిసి పేర్కొంది. వీటిని ఆఫ్‌లైన్ (పెన్, పేపర్) పద్ధతిలోకానీ, ఆన్‌లైన్+ఆఫ్‌లైన్ కలగలిసిన మిశ్రమ విధానంలోకానీ నిర్వహించవచ్చని తెలిపింది. అయితే రాష్ట్రంలో సెమిస్టర్ పరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదు. అన్ని పరీక్షలను ఆఫ్‌లైన్‌లోనే నిర్వహించేందుకు వర్సిటీలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.

హాజరుకాని విద్యార్థులకు మరో అవకాశం..
కోవిడ్-19 నేపథ్యంలో యుజిసి ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆరోగ్య సమస్యలు, రవాణా సమస్యలు, ఇతర కారణాలతో విద్యార్థులు పరీక్షలకు హాజరుకాలేకపోతే సమయం అనుకూలించినప్పుడు వారికి ప్రత్యేక పరీక్షలు నిర్వహించాలని యుజిసి నిర్దేశించింది. పరీక్షలు రాయలేని విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యంకానీ, ఇబ్బందులుకానీ కల్పించరాదని సూచించింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ జారీ చేసిన ప్రామాణిక నిర్వహణ విధానాన్ని (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్) పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలని తెలిపింది.

షిఫ్టుల వారీగా పరీక్షల నిర్వహణ..
పరీక్షల నిర్వహణలో భౌతిక దూరం కచ్చితంగా పాటించాల్సిన ఆవశ్యకత ఉన్న నేపథ్యంలో యుజిసి మార్గదర్శకాలకు అనుగుణంగా రోజుకు రెండు సెషన్లవారీగా షిఫ్టు విధానంలో పరీక్షలు నిర్వహించే అంశాలను పరిశీలిస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం ఒక షిఫ్టు, మధ్యాహ్నం మరొక షిఫ్టులో పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఇంజనీరింగ్, సైన్స్ డిగ్రీ కోర్సులకు సంబంధించిన ప్రాక్టికల్ పరీక్షల విషయంలో సంబంధిత కళాశాలలే బాధ్యత వహించేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్ ఎగ్జామినర్లను నియమించుకునే వెసులుబాటు కల్పించాలని తెలిపింది.

27 ప్రైవేట్ వర్సిటీలకు మినహాయింపు..
2019-20లో ఏర్పాటైన 27 ప్రైవేట్ వర్సిటీల్లో చేరిన విద్యార్థులకు ఇంకా చివరి సెమిస్టర్ రాసే అర్హత రాలేదని, అందువల్ల అవి తాజా మార్గదర్శకాల పరిధిలోకి రావని యుజిసి స్పష్టం చేసింది. పరీక్షల నిర్వహణపై దేశంలోని 945 విశ్వవిద్యాలయాల అభిప్రాయం కోరగా ఇప్పటివరకు 755 స్పందించాయని పేర్కొంది. పరీక్షలు నిర్వహించేందుకు యూనివర్సిటీలు మొగ్గుచూపుతుండగా, ఇప్పటికే 194 విశ్వవిద్యాలయాలు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతిలో పరీక్షలు పూర్తిచేసినట్లు తెలిపింది. పరీక్షల నిర్వహణపై యూనివర్సిటీల నుంచి యుజిసి స్పందన తీసుకోగా, అందులో మెజారిటీ యూనివర్సిటీలు పరీక్షలు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలిపాయి.

Final year UG, PG exams from August 20
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News