Saturday, April 27, 2024

తొలి ప్రేమ పవిత్రత

- Advertisement -
- Advertisement -

తొలి ప్రేమ ఎంతో మధురమైంది. అందులోని ఉద్వేగం, గగుర్పాటు, ఆత్రుత, కల్తీలేని కాంక్ష అలాంటివి. అశోక్ తొలి ప్రేమ ఇందిర. ఆ పెళ్ళికి ఇందిర కోసమే వచ్చాడు. రావడం కాదు, తప్పనిసరిగా రమ్మనమని ఇందిరే ఫోన్ చేసింది. పెళ్ళి ఆవరణలో తన కోసమే వెతుకుతున్నాడు అశోక్. రెండు నిమిషాల్లోనే కనిపించింది. దగ్గరకొచ్చి అశోక్ రెండు చేతులూ పట్టుకొని కుర్చీలో కూచోపెట్టింది. ఎదురుగా మరో కుర్చీలో తనూ కూచుంది.“నిన్ను చూసి చాలా రోజులైంది” అన్నాడు అశోక్ తన్మయంగా. / “ఎలా వున్నాను” అంది నవ్వుతూ./ “ఎర్రపడ్డావు. కొంచెం వొళ్ళొచ్చింది. అప్పటి కన్నా బావున్నావు” అన్నాడు. / “నువ్వూ.. అంతే” అంది మళ్ళీ నవ్వుతూ. / “ఒక్కడివే వచ్చావా? మీ ఆవిడా, పిల్లలు?” అనడిగింది. / “వాళ్ళు రాలేదు. ఒకణ్ణే వచ్చాను.”/ “నేను ఒక్క దాన్నే వచ్చాను. మనం కలిసి గడపడానికి బోల్డు టైము” అంది.

ఇద్దరూ కలిసి చదువుకొన్నారు. కాని ఆ రోజుల్లో ఇద్దరికీ భయమే. ప్రేమంతా చూపుల్లోనే. అశోక్‌కి ఇందిరన్నా, ఇందిరకి అశోక్ అన్నా ఇష్టంగానే వుండేది. కాని ఒకరికి మరొకరు తమ తమ ఇష్టాన్ని పైకి చెప్పుకోలేదు. డిగ్రీ అయిపోయిన వెంటనే సంబంధం కుదిరిందని ఇందిర పెళ్ళి చేశారు. ఆ తర్వాత అశోక్‌కీ పెళ్ళయింది. ఎవరి సంపారాలు వాళ్ళకి అయినా ఇప్పటికీ టచ్‌లోనే వున్నారు. ఫోన్‌లో మాట్లాడుకుంటుంటారు. వీళ్ళ కామన్ ఫ్రైండ్ వెంకటేశ్వర రావు చెల్లెలు పెళ్ళి ఇది. వారం రోజుల క్రితం ఫోన్ చేసింది ఇందిర. చేసి “నిన్ను చూడాలని వుంది. పెళ్ళికిరా..” అంది. అంతే వచ్చేశాడు అశోక్. పెళ్ళి కూతురు ఇందిరకి దగ్గర స్నేహితురాలు.“కాఫీ తెస్తాను. ఇక్కడే కూచో” అంది ఇందిర లేవబోతూ. / “నీతో కూడా నేనూ వస్తా.. మళ్ళీ తేవడం ఎందుకు శ్రమ” అన్నాడు. / “అంతేం అరిగిపోనులే. నా కూడా తిరిగితే నలుగురూ చూడరు. పబ్లిసిటీ ఎందుకూ?” అంది. అని కాఫీ కోసం వెళ్ళింది. ఇందిర ఒక్కొక్క మాటా అశోక్ ఆలోచనల్ని ఎక్కడికో తీసుకెడుతున్నాయి. తనకి ఇందిరంటే పిచ్చి. ఎంతైనా తొలి ప్రేమ. ఇందిరా ఇష్టంగానే వుంది. మంచి లాడ్జిలోనే దిగాడు. ఏ ఆటంకమూ లేదు. ఇద్దరూ హోట్‌లోకి వెళ్ళినా ఈ పెళ్ళి హడావిడిలో ఎవరూ పట్టించుకోరు. ఒంట్లోసన్నగా ఆవిరి బైల్దేరింది అశోక్‌కి.

ఇందిర కాఫీ తెచ్చింది. తనక్కూడా తెచ్చుకుంది. కబుర్లు చెప్పుకొంటూ కాఫీ తాగుతున్నారు. ఫోన్‌లో పెళ్ళికి రమ్మని పిలిచే వరకూ ఈ పెళ్ళికి హాజరు అవ్వాలని అనుకోలేదు అశోక్. శుభలేక ముందుగానే అందినా ఓ పక్కన పెట్టేశాడు. ఇప్పటి పరిస్థితి చూస్తుంటే, ఈ పెళ్ళికి రాకపోతే చాలా పోగొట్టుకొని వుండేవాడిని అనుకున్నాడు. ఇందిర మాట్లాడుతూ మధ్యలో ఎంతో ఫ్రీగా, చొరవగా అశోక్ చేతులు తాకుతోంది. కాళ్ళ మీద నెమ్మదిగా చరుస్తోంది. ఇందిర చేష్టల్నే కాదు, ఆమె అంగాంగాన్ని చూసి, పరికించి మురిసిపోతున్నాడు అశోక్. ఇది వరకటి కన్నా ఇంకా అందంగా వుంది. ఇందిర అశోక్ జీవితంలో తొలి స్త్రీ ఆకర్షణ.. ఫస్ట్ లవ్.. ఆ తొలి ఆకర్షణకి మంచి శక్తి వుంటుంది. ఆ వివరాలన్నీ చెపితే ఇందిరని తన దారికి మళ్ళించుకోటం తేలిక అన్న ఆలోచన వచ్చింది. అంతే సంభాషణని గతంలోకి మళ్ళించాడు. ఆ రోజుల్లో ఇందిర వచ్చే దారిలో కాపు కాయడం, తను కనిపించి నవ్వగానే ఎంతో ఆనందపడడం… ఇలా చాలా చాలా చెప్పాడు. ఆ కబుర్లు వినడానికి ఇందిరకీ బావున్నాయి. సంబరం పెరిగినప్పుడల్లా అశోక్ చేతుల్ని, వేళ్ళనీ మరింత బలంగా నొక్కుతోంది.

అన్నీ అనుకూలంగానే వున్నట్టనిపిస్తోంది అశోక్‌కి. ఇంక చొరవ చేయడమే బాకీ. ఎంత చనువు చూపిస్తున్నా, ఇందిర స్త్రీ. స్త్రీకి సహజంగానే సిగ్గు, అభిమానం వుంటాయి. వాటిని దాటి, నన్ను బైటికి తీసుకెళ్ళమని తనంతగా తను బైటపడదు. అలా అనుకోగానే అశోక్‌కి తనే చొరవ చొరవ చెయ్యాలన్న నిశ్చయం మరింత బలపడింది. “నేను తీసుకొన్న రూమ్ బావుంది. చాలా ప్రిస్టేజియస్ హోటల్. ఏం ఇబ్బంది వుండదు. వెడదామా!” అన్నాడు అశోక్. / “హోటల్‌క్కా ఎందుకు?” అంది ఇందిర వెంటనే. / “ఎందుకేమిటి? అందుకే. నీ మీద కోరికని ఎన్నేళ్ళు ఇలా ఊహల్తో గడపను. మనిద్దరికీ ఇష్టమే. ఇప్పుడు ఏ అడ్డూ కూడా లేదు. ఒక్కసారి నువ్వు నాకు దక్కితే చాలు. ఆ మధుర స్మృతులతో జీవితమంతా నాకు ఆనందమే” అన్నాడు అశోక్ ఉద్విగ్నంగా. తనని పొందితే అశోక్ నిజంగానే చాలా సంతోష పడతాడు. ఆ విషయం ఇందిరకి తెలుసు. ఏం చెప్పాలా అని ఆలోచిస్తోంది. రెండు క్షణాలు ఆగి ఇందిర “నీకు నా మీదున్న విపరీతమైన ఇష్టం నాకు తెలుసు. నువ్వంటే నాకూ ఇష్టమే అలా అని, నవ్వు చెప్పినట్టు హోటల్‌కి వెళ్ళి గడపడం సరైంది కాదు అశోక్. నేను ఇలా కాదనడం నీ కెంతో బాధగా వుంటుంది. కానీ నేను చెప్పేది కొంచెం ఓపిగ్గా విను. ఇందులోని సూక్ష్మం నీకూ అర్థమవుతుంది” అంది.

అశోక్‌కి ఒక్కసారిగా నవనాడులు కృంగిపోయినట్టు అయింది. ఇందిర ఇలా అంటుందని అనుకోలేదు. అలా అనేదైతే అంత దగ్గరగా, రాసుకుని పూసుకుని తిరుగుతున్న దానికి అర్థమేమిటి? ఇందిర మళ్ళీ ఆరంభించింది. “మనిద్దరికి ప్ళ్ళై,మొగుడూ పెళ్ళాం అవలేకపోయినందుకు ఇద్దరం బాధపడ్డాం. అది పెద్ద లోటూ అనీ అనుకున్నాం. ఎందుకని? వివాహం అన్న దాంట్లో గొప్ప విలువ, బంధం వున్నాయి. అదొక పవిత్రమైన ధీమాని, తృప్తిని ఇస్తుంది. నువ్వు అడిగినట్టు హోటల్‌కి వెళ్ళి గడిపి వచ్చామనుకో, ఆ ధీమా తృప్తి పోతాయి. శరీరాలు తృప్తిపడినా, మనసు మలినమైపోయి, తప్పు చేశామే అన్న భావన ఎప్పటినేనా తప్పదు. ఇంక నీలో మరో అనుమానం వుండొచ్చు. ఇలా అనే ఇందిర ఇంత చనువుగా, ఇష్టంగా ఎందుకుంది? అని. నువ్వంటే నాకు నేనంటే నీకూ ఇష్టం ఎప్పటికీ పోవు. తొలిప్రేమ కూడా ఓ మధురమైన బంధం. దాన్ని తెంపేసుకోనఖ్ఖర్లేదు. ఇలా దగ్గరగా , స్నేహంగా వుండడంలో, ఓ పవిత్రమైన మధురిమ వుంది. ఇలా వున్నా మనసులు ఆరోగ్యంగా, హాయిగా వుంటాయి. అర్థం చేసుకో” అంది.

కాస్సేపు ఆలోచించిన అశోక్‌కి అదే మగాడికి, స్త్రీకి తేడా అనిపించింది. ఎంతో నిరాశ కలిగింది. తన ముఖం చిన్నబోయిన సంగతి అశోక్‌కి స్వయంగా తెలుస్తోంది. అది ఇందిరా గమనించింది. నెమ్మదిగా అశోక్ చేతుని తన చేతుల్లోకి తీసుకుంది. “చిన్నబుచ్చుకోకు అశోక్. నేను కాదంటున్నది నన్ను కాదు. మన అనుబంధాన్ని కాదు. వాటిని అపవిత్రం చేసే ఓ అపరాధ భావాన్ని. మన జీవితాంతం మనమింత హాయిగా దగ్గరగా వుండగలిగే చక్కటి బంధాన్ని పాడు చేసుకోవద్దు” అంది. అలా అంటుంటే ఇందిర కళ్ళల్లో సన్నటి కన్నీటి తెర కదిలింది. ఆ కన్నీటి తడి అశోక్‌ని కదిలించింది. తను చిన్న బుచ్చు కున్నందుకు ఇందిర కళ్ళ నీళ్ళు పెట్టుకుంటోంది. అంతకన్నా ఏం కావాలి? అనుకున్నాడు. ఎంతటి అనురాగం.. అనుకున్నాడు. అశోక్‌లోంచి ఆ కోరిక తొలగిపోయింది. తనూ ఇందిర చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్యా సమయం మరింత ప్రశాంతంగా, నిర్మలంగా గడిచింది.

ఇష్టంగా గడిపారు. స్వచ్ఛంగా గడిపారు. హాయిగా గడిపారు. పెళ్ళి నుంచి తిరిగి వచ్చేటప్పుడు అశోక్ ఆలోచించాడు. ఏమిటి ఆ మేజిక్ అని, కోరిక తీరకపోయినా, అంత తృప్తిగా ఎలా వుందా అని. పవిత్రతలో వున్న బలం అదని అతనికి స్పష్టంగా అర్థం అవడానికి మరి కొంత కాలం పట్టింది. జీవితాంతం ఇందిర స్నేహం తనకి దూరం కాదన్న ధీమాతో గుండె నిండుగా వుంది అశోక్‌కి.

వి. రాజారామ మోహన రావు
9394738805

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News