Monday, April 29, 2024

నేడు ఢిల్లీలో టిఆర్‌ఎస్ భవనానికి భూమి పూజ

- Advertisement -
- Advertisement -

Foundation stone of TRS office in Delhi

ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిన సిఎం కెసిఆర్
ఢిల్లీలో భూమి పూజ స్థలాన్ని పరిశీలించిన మంత్రులు కెటిఆర్,
శ్రీనివాస్‌గౌడ్, వేముల ప్రశాంత్‌రెడ్డి
నేటి భూమిపూజకు హాజరుకావడానికి హస్తినకు వెళ్లిన
రాష్ట్ర మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు

మూడు రోజుల పర్యటనకు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు అక్కడ విమానాశ్రయంలో ఘనస్వాగతం పలుకుతున్న ఎంపిలు నామా నాగేశ్వరరావు, సురేష్ రెడ్డి, రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్

మనతెలంగాణ/ హైదరాబాద్: ఢిల్లీలోని వసంతవిహార్ మెట్రో రైల్వే స్టేషన్ సమీపంలో 13 వందల గజాల స్థలంలో గురువారం నాడు జరుగనున్న టిఆర్‌ఎస్ భవన్ శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ సతీసమేతంగా ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బుధవారం సాయంత్రం చేరుకున్నారు. ఈక్రమంలో సిఎం కేసిఆర్ వెంట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎంపి సంతోష్ కుమార్ వున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ ఎయిర్ పోర్టులో సిఎం దంపతులకు మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్, ఎంపీలు సురేష్ రెడ్డి, బీబి పాటిల్, వెంకటేష్ నేత, బండ ప్రకాష్, ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ శంభిపూర్ రాజ్ తదితరులు ఆహ్వానం పలికారు.

సిఎం రాక సందర్భంగా ఢిల్లీలో టిఆర్‌ఎస్ భవన్ శంకుస్థాపన సందర్భంగా ఢిల్లీ పురవీధులు గులాబి మయమయ్యాయి. రాష్ట్రం నలుమూలల నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర స్థాయి నాయకత్వం అప్పటికే ఢిల్లీకి చేరుకోవడంతో తెలంగాణ భవన్ పరిసర భవనాలన్నీ టీఆర్‌ఎస్ నేతలతో కోలాహాలంగా మారాయి. శంఖుస్థాపన కార్యక్రమానికి ఢిల్లీ కి వచ్చిన టిఆర్‌ఎస్ శ్రేణులకు లోకసభలో టీఆర్‌ఎస్ పార్లమెంట్ పక్షనేత ఎంపీ నామా నాగేశ్వర్ రావు ఆతిథ్యం ఇచ్చారు.

నామా ఏర్పాటు చేసిన ఆతిథ్యానికి సిఎం కేసిఆర్ ముఖ్య అతిధిగా హాజరై శంకుస్థాపన ఏర్పాట్ల గురించి మంత్రి కేటిఆర్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీకి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎంపీలు పార్టీ ముఖ్య నేతలను పేరు పేరున పలకరించారు. కాగా శంకుస్థాపన అనంతరం అక్కడ జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రసంగిస్తారు. హస్తిన పర్యటనలో కొంత మంది కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి కలిసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం సిఎం కెసిఆర్ తిరిగి హైదరాబాద్ రానున్నారు. ఇదిలావుండగా గురువారం మధ్యాహ్నం 1.48గంటలకు ఢిల్లీ వసంత్ విహార్‌లో టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ భూమి పూజ టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ చేతుల మీదుగా జరుగనుంది.

స్థలాన్ని పరిశీలించిన మంత్రి కెటిఆర్

టిఆర్‌ఎస్ భవన్ శంఖుస్థాపన కార్యక్రమం నిమిత్తం ఢిల్లీకి చేరుకున్న టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌లు ఢిల్లీలోని వసంత్‌విహార్‌లో పార్టీ కార్యాలయ నిర్మాణం జరుగనున్న 1300 గజాల స్థలాన్ని పరిశీలించారు. భూమిపూజ కార్యక్రమంలో ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యనేతలతో పాటు రాష్ట్రానికి చెందిన మంత్రులు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో పాటు ఎంఎల్‌ఎ, ఎంఎల్‌సిలు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

హస్తినకు చేరిన అమాత్యులు, ముఖ్యులు

టిఆర్‌ఎస్ భవన్ శంకుస్థాపన సందర్భంగా మంత్రులు మహమ్మద్ మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు, గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పోరేషన్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్ రూరల్ జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, టిఆర్‌ఎస్ పార్టీ నాయకురాలు విజయారెడ్డి తదితరులు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

ఢిల్లీలో నిర్మాణం ఓ చరిత్ర : ఎంపి నామ

ఢిల్ల్లీలో తెలంగాణ భవన్ నిర్మించాలనుకోవటం అందరికి ఆనందంగా ఉందని లోక్‌సభ పక్షనేత నామ నాగేశ్వర రావు అన్నారు. సిఎం కేసీఆర్ 20 సంవత్సరాలు కష్టపడి తెలంగాణ తెచ్చారని, ఢిల్లీలో తెలంగాణ భవన్‌కు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. భారత దేశంలో ఏ రాష్ట్రం లేని అభివృద్ధి తెలంగాణలో జరిగిందని, దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందన్నారు. రైతు బంధు, దళిత బంధు లాంటి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని, దక్షిణాది రాష్ట్రాల నుంచి ఒక ప్రాంతీయ పార్టీ దేశ రాజధానిలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకోవడం చరిత్రాత్మక విషయమన్నారు.ఈ మహత్తర ఘట్టంలో తనకు భాగస్వా మ్యం కల్పించడం గర్వంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

దేశరాజధాని హస్తినలో టిఆర్‌ఎస్ భవన్ నిర్మాణానికి తొలి అడుగు పడింది. ఢిల్లీలోని వసంత్ విహార్ మెట్రో స్టేషన్ సమీపంలో కేంద్ర కేటాయించిన 13 వందల గజాల స్థలంలో రూ. 40 కోట్లతో అంచనా వ్యయంతో టిఆర్‌ఎస్ భవన్‌ను నిర్మిస్తున్నారు. మీటింగ్ హాల్‌తోపాటు రాష్ట్రం నుంచి వివిధ పనుల మీద వచ్చే వారు స్టే చేసేందుకు అన్ని సౌకర్యాలు ఉండేలా డిజైన్ చేశారు. ఈక్రమంలో హైదరాబాద్‌లోని టిఆర్‌ఎస్ భవన్‌ను పోలి ఉంటుందని టిఆర్‌ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి పార్టీ శ్రేణులు. వాస్తవానికి ఈ ఏడాది ప్రారంభంలోనే శంకుస్థాపన కార్యక్రమం జరగాల్సి ఉంది. కానీ కరోనా సెకండ్ వేవ్, లాక్‌డౌన్ వల్ల కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చిన విష యం తెలిసిందే. ఏడాదిలోపే నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా గ్రాండ్ గా జరపాలని టిఆర్‌ఎస్ నేతలు భావిస్తున్నారు.

ఉపరాష్ట్రపతికి హోంమంత్రి స్వాగతం

రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బుధవారం బయలుదేరి వెళ్లారు. ఈక్రమంలో టిఆర్‌ఎస్ భవన నిర్మాణ పూజకు విచ్చేయుచున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ స్వాగతం పలికారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News