Monday, April 29, 2024

దేశానికే ఆదర్శంగా గచ్చిబౌలి ఆస్పత్రి నిర్మాణం

- Advertisement -
- Advertisement -

gaccibouli hospital

 

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశానికే ఆదర్శంగా ప్రభుత్వం గచ్చిబౌలి ఆస్పత్రిని నిర్మించిందని తెలంగాణ హెల్త్ అండ్ మెడికల్ జెఎసి చైర్మన్ డాక్టర్ బరిగెల రమేష్ పేర్కొన్నారు. శనివారం హెల్త్ అండ్ మెడికల్ జెఎసి నాయకులతో కలిసి ఆయన గచ్చిబౌలి ఆస్పత్రిని పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ మాట్లాడుతూ పది రోజుల్లో చైనా వెయ్యి పడకల ఆస్పత్రిని నిర్మించిందని దానిని తలదన్నే రీతిలో గచ్చిబౌలి స్టేడియంలో 15 రోజుల్లో 1,500 పడకల ఆస్పత్రిని ప్రభుత్వం నిర్మించి అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు.

నానాటికీ ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో విజృంభిస్తున్న కరోనా వైరస్‌ను అడ్డుకొని ప్రజల ప్రాణాలను కాపాడాలన్న సదుద్ధేశ్యంతో ప్రభుత్వం నిర్మించిన ఈ ఆస్పత్రి విశాలంగా, సౌకర్యవంతంగా అన్ని వసతులతో అద్భుతంగా ప్రభుత్వం నిర్మించిందన్నారు. కరోనా వైరస్ నిర్మూలనతో పాటు పేదలకు వైద్యం అందించడంలో ప్రభుత్వం అన్నిరకాలుగా ముందంజలో ఉందన్నారు. వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో సిఎం కెసిఆర్ అడుగుజాడల్లో వైద్య ఆరోగ్య శాఖ పటిష్టంగా తయారయ్యిందన్నారు. రాష్ట్రం ఇప్పటికే అన్ని రంగాల్లో ముందంజలో ఉండగా ప్రస్తుతం వైద్య రంగంలో రాష్ట్రం అంది స్తున్న సేవలు మిగతా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయన్నారు.

ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధం
గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ ఆస్పత్రి ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సర్వం సన్నద్ధంగా తయారయ్యిందన్నారు. ఇక్కడ వసతులు చాలా బాగా ఉన్నాయని ప్రభుత్వం ప్రజల ప్రాణాలను కాపాడడానికి చేస్తున్న కృషి అభినందనీయమని వారు ప్రశంసించారు. సామాజిక దూరాన్ని పాటించి కరోన రహిత తెలంగాణను నిర్మించాలని ఆయన పిలుపునిచ్చారు.

కరోనా వైరస్ బారి నుంచి ప్రజలను కాపాడాలని కృతనిశ్చయంతో సిఎం కెసిఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని జెఎసి ప్రతినిధులు ప్రశంసించారు. కరోనా లేని రాష్ట్రాన్ని తయారు చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులందరం సమిష్టిగా పనిచేస్తామని, రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉంటామని వారు పేర్కొన్నారు. ఈ ఆస్పత్రిని సందర్శించిన వారిలో జెఎసి కన్వీనర్ డాక్టర్ పుట్ల శ్రీనివాస్, సెక్రటరీ జనరల్ వెంకటేశ్వర్ రెడ్డి, చీఫ్ అడ్వైయిజర్ జూపల్లి రాజేందర్, కోఆర్డినేటర్ డాక్టర్ నరహరి, కో చైర్మన్ షబ్బీర్ అహ్మద్, మూర్తి, సుజాత, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

 

Good facilities in Gachibowli Hospital
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News