Monday, April 29, 2024

అనవసర ఆపరేషన్లు చేస్తే చర్యలు: మంత్రి హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

Harish Rao

హైదరాబాద్:  ‘‘అవసరమైన మందులే వాడాలి, అవసరం మేరకే వైద్య పరీక్షలు చేయాలి,  అనవసర ఆపరేషన్లు చేయవద్దు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో తప్పులు చేసినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవు’’ అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. పనిచేసే వారిని ప్రోత్సాహం ఇస్తామని, అలాగే పనిచేయని వారికి శిక్ష తప్పదని స్పష్టం చేశారు. మెడికల్‌ కౌన్సిల్‌ను ఆక్టివేట్‌ చేశామని, ఉద్దేశపూర్వకంగా ప్రైవేట్‌, ప్రభుత్వ వైద్య రంగంలో నిర్లక్ష్యం వహిస్తే ఆ ఆస్పత్రులపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. శుక్రవారం కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రిలో ఇంటిగ్రేటెడ్‌ బిల్డింగ్‌ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన, ఎర్రగడ్డలోని చెస్ట్‌, ఈఎన్‌టీ ఆస్పత్రులలో సిటీ స్కాన్‌ యంత్రాలు, సుల్తాన్‌బజార్‌ మెటర్నిటీ ఆస్పత్రిలో ఆపరేషన్‌ థియేటర్‌లో సర్జికల్‌ ఎక్వీప్ మెంట్, కొత్త బ్లాక్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అనవసర ఆపరేషన్లను తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నామని, 26 సాధారణ ప్రసవాలు పెరిగాయన్నారు. ఈనెల 11న హైదరాబాద్‌లో 10 రేడియాలజీ ల్యాబ్‌లు ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ నెల 12న హైదరాబాద్‌లోని 18 ఆస్పత్రులలో రోగులకు ఉచితంగా భోజన పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని, ఎమ్మేల్యే రాజాసింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తో  మంత్రి హరీశ్‌రావు సరదా వ్యాఖ్యలు

కోఠిలోని ఈఎన్‌టీ ఆస్పత్రిలో ఓ మహిళా రోగి దగ్గరకు వెళ్లిన హరీశ్‌రావు.. ‘అమ్మా ఇక్కడ ఎలా చూస్తున్నారు? మందులు ఇస్తున్నారా? బయటి నుంచి కొనుక్కుంటున్నారా?’ అని ప్రశ్నించారు. అన్ని మందులు ఇస్తున్నారని, బయటి నుంచి ఏం కొనుగోలు చేయడం లేదని, వైద్యులు మంచిగా చూస్తున్నారని ఆమె మంత్రికి వివరించారు. ఇదే సమయంలో ‘రాజాసింగ్‌ సాబ్‌ జర అచ్చా సునో (బాగా వినండి)’ అని పక్కనే ఉన్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌తో మంత్రి హరీశ్‌ రావు సరదాగా అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News