Friday, May 3, 2024

ఆరో విడత హరితహారానికి సర్వం సిద్ధం

- Advertisement -
- Advertisement -

Haritha haram programme start from june 20th

 

ఈ నెల 20 నుంచి అట్టహాసంగా ప్రారంభం
20 కోట్ల మొక్కలు పంచడమే లక్షంగా సాగనున్న కార్యక్రమం

మన తెలంగాణ/హైదరాబాద్ : ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభంకానున్న ఆరవ విడత హరితహారం కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. ఈ దఫా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 కోట్ల మొక్కలు నాటడమే లక్షంగా పెట్టుకున్నారు. జంగల్ బచావో….జంగల్ బడావో (అడవిని కాపాడుదాం….అడవిని విస్తరిద్దాం) అనే నినాదంతో సిఎం కెసిఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర అటవీ శాఖ, పంచాయితీలు, పురపాలిక సంస్థలతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలు కూడా పెద్దఎత్తున మొక్కలు నాటేందుకు రంగం సిద్దం చేశారు. ఆ ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తి అయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాలు కూడా ప్రారంభమయ్యాయి. దీంతో 20వ తేదీ నుంచి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా చేపట్టనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఐదు విడతల్లో కోట్ల సంఖ్యల్లో మొక్కలు నాటిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మొక్కలు నాటిన ప్రాంతాలన్నీ పచ్చటి వనాలుగా మారుతున్నాయి.

కాగా ఆరవ విడత హరితహారంలో ఆగ్రో ఫారెస్ట్రీకి అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా రైతులకు అదనపు, ప్రత్యామ్నాయ ఆదాయ వనరులను పెంచడమే లక్షంగా మొక్కలను పెంచనున్నారు. వర్షాలకు అనుగుణంగా హరితహారం కొనసాగించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తగు ఆదేశాలు జారీ చేసింది. గంధం, టేకు, వెదురు, సరుగుడు, చింత, పూలు, పండ్ల మొక్కలకు కూడా పెద్దఎత్తున ప్రాధాన్యతను ఇస్తున్నారు. ప్రతి జిల్లాలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మియావాకీ పద్దతిలో తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలతో చిట్టడవులను పెంచేందుకు ప్రణాళికలను సిద్దం చేశారు. గ్రామ, పట్టణ ప్రాంతాల్లో నర్సరీలకు అటవీ శాఖ సాంకేతిక సహకారాన్ని అందించనుంది.

స్కూళ్లు, కాలేజీలు, సంక్షేమ హాస్టళ్లు, యూనివర్సిటీ క్యాంపస్‌లు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పెద్దఎత్తున హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. గ్రామాల్లో ఇంటింటికి ఆరు మొక్కలు ఇవ్వటం, బాధ్యతగా పెంచేలా పంచాయితీల పర్యవేక్షణ చేస్తాయి. కోతుల బెడద నివారణ కోసం ప్రత్యేకంగా గుర్తించిన 37 రకాల మొక్కల జాతులను క్షీణించిన అటవీ ప్రాంతాల్లో నాటే ప్రణాళికలను కూడా అమలు చేయనున్నారు. వానలు వాపస్ రావాలి… కోతు లు అడవులకు వాపస్ పోవాలనే లక్ష్యంతో హరితహారం కార్యక్రమంలో పెద్దఎత్తున మొక్కలను పెంచుతున్నారు.

గత ఐదు విడతల్లో నాటిన ప్రాంతాల్లో చనిపోయిన, సరిగా ఎదగని మొక్కలను గుర్తించి వాటి స్థానంలో కొత్త మొక్కలను నాటుతారు. కేంద్ర ప్రభుత్వ బ్యాంబూ మిషన్ (వెదురు ప్రోత్సాహక సంస్థ) సహకారంతో చిన్న, సన్నకారు రైతులకు ఆదాయ వనరుగా వెదురు పెంపకాన్ని హరితహారం కింద ప్రోత్సాహిస్తారు. హరిత తెలంగాణ, ఆరోగ్య తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా చేపట్టిన అర్బన్ ఫారెస్ట్ పార్కుల్లో ప్రత్యేకంగా హరితహారం, పట్టణ ప్రాంత వాసులకు స్వచ్చమైన గాలిని అందించే ప్రాంతాలుగా 95 అర్బన్ ఫారెస్ట్ బ్లాకుల అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో ఇప్పటికే 35 పూర్తి కాగా, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. హరితహారంలో ఒకే రకం చెట్లు కాకుండా నీడనిచ్చేవి, పండ్లు- పూల చెట్లు, ఔషధ మొక్కలను కూడా గత ఐదేళ్లుగా నాటినట్లుగానే ఆరవ విడతలోనూ అదనంగా మరికొన్ని కొత్త రకాల పూల మొక్కలను పెంచనున్నారు.

జాతీయ రహదారుల వెంట…

హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-ముంబయి, హైదరాబాద్- వరంగల్, హైదరాబాద్ -‌బెంగుళూరు, హైదరాబాద్‌-నాగపూర్ వంటి జాతీయ రహదారుల కిరువైపులా పెద్ద పూల చెట్లు నాటారు. ఈ సారి కూడా ఈ రహదారుల వెంట మిగిలిన ప్రాంతాల్లో హరితహారం చేపట్టనున్నారు. పట్టణ ప్రాంతాలతో పాటు, ప్రతి గ్రామానికి దారి తీసే రోడ్ల వెంట అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. మున్సిపాలిటీలు, అన్ని పంచాయితీ రోడ్లు వెంట నీడను ఇచ్చే మొక్కలతో పాటు, పూలతో ప్రయాణం అహ్లాదంగా ఉండాలనే స్ఫూర్తితో మరోసారి ఆ మొక్కలను నాటున్నారు. ఇప్పటిదాకా రాష్ట్ర వ్యాప్తంగా 7, 409 కిలో మీటర్ల మేర రహదారుల వెంట ఎవెన్యూ ప్లాంటేషన్ పూర్తయింది.

మొక్కలు నాటడం తప్పనిసరి

కొత్త పంచాయితీ రాజ్ చట్టాన్ని తీసుకువచ్చిన ప్రభుత్వ… పచ్చదనం పెంపు, మొక్కలు నాటడాన్ని తప్పనిసరి చేసింది. ఇందులో భాగంగా ప్రతి గ్రామ పంచాయితీకి ఒక నర్సరీ ఏర్పాటును కూడా ప్రతిపాదించింది. గత ఏడాది నుంచి గ్రామానికి ఒక సర్సరీ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకున్నారు. దీని ప్రకారం 12, 571 గ్రామ పంచాయితీలకు గాను, 11,941 నర్సరీల ఏర్పాటయ్యాయి. అటవీ పునరుజ్జీవన చర్యల్లో భాగంగా క్షీణించిన అడవులకు పూర్వ వైభవం తీసుకరావడం, తెలంగాణ నేలలు, అడవులకే ప్రత్యేకమైన స్థానిక జాతుల మొక్కలను నాటడం ద్వారా అటవీ పునరుజ్జీవన ప్రయత్నాలు జరుగుతున్నాయి. హరితహారంలో సుమా రు 34 శాఖల దాకా పాల్గొంటున్నాయి. ఏడాది పొడగునా మొక్కల సంరక్షణకు ఆయా శాఖలు బాధ్యత తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. హరిత మిత్ర అవార్డుల ద్వారా మొక్కలు నాటేవారికి ప్రోత్సహించడమే కాకుండా… లక్ష్యాన్ని మించి మొక్కలు నాటే పంచాయతీలు, వార్డులు, మున్సిపాలిటీలకు రూ. 2 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ప్రోత్సాహకాలను అందిస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News