Monday, April 29, 2024

హైదరాబాద్ కిట్‌కు ఐసిఎంఆర్ ఆమోదం

- Advertisement -
- Advertisement -

Howell Life Sciences Testing Kits

 

హువెల్ లైఫ్ సైన్సెస్ టెస్టింగ్ కిట్స్‌కు ఐసిఎంఆర్ ఆమోదం
సంస్థ డైరెక్టర్‌ను అభినందించిన మంత్రి కెటిఆర్
ప్రతి రోజూ4వేల కిట్లు తయారు చేసేందుకు సిద్దమైన సంస్థ

హైదరాబాద్ /మన తెలంగాణ : ప్రపంచ వ్యాప్తంగా వణికిస్తున్న కొవిడ్ వైరస్ నిర్థారణ కిట్లు ఇక నుంచి తెలంగాణ రాష్ట్రంలోనూ తయారు కానున్నాయి. హైదరాబాద్‌కు చెందిన ‘హువెల్ లైఫ్ సైన్సెస్’ సంస్థ ఈ నిర్థారణ కిట్లను తయారు చేసేందుకు ముందుకు రాగా, ఐసిఎంఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) ఆమోదం తెలిపింది. కరోనా నిర్ధారణ పరీక్షలు జరుపడానికి ఈ సంస్థ అభివృద్ధి చేసిన టెస్ట్ కిట్‌కు ఐసిఎంఆర్ పూర్తిగా పరిశీలించి పర్మిషన్ ఇచ్చింది. దీంతో రాబోయే రోజుల్లో కరోనా నిర్థారణ పరీక్షలు వేగంగా జరుగుతాయని అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఈసంస్థ చేసిన కృషికి మంత్రి కెటిఆర్ ప్రత్యేకంగా అభినందించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు వివిధ సంస్థలు తయారుచేసిన మొత్తం 24 కిట్లలో ఆరింటికి మాత్రమే ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది. ఇందులో హువెల్ లైఫ్ సైన్సెస్ కిట్ కూడా ఉండటం విశేషం. అమెరికా నేషనల్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రొటోకాల్‌ను అనుసరించి ఈ కిట్‌ను తయారు చేసినట్లు సంస్థ ప్రకటించింది.

కొవిడ్-19తోపాటు సార్స్ వంటి ఇతర కరోనా వైరస్‌లను కూడా గుర్తించే విధంగా ఈ కిట్‌ను రూపొందించామని సంస్థ పేర్కొంది. డిటెక్షన్ కిట్, ఎక్స్‌ట్రాక్షన్ కిట్, మాలిక్యులర్ ట్రాన్స్‌పోర్ట్ మీడియం (ఎంటీఎం), శాంపిల్ సేకరించేందుకు స్వాబ్ సహా అన్నీ ఇందులో ఉంటాయని హువెల్ లైఫ్ తెలిపింది. ఈసంస్థ కిట్లకు ఐసీఎంఆర్ ఆమోదం లభించిన నేపథ్యంలో సంస్థ డైరెక్టర్ డాక్టర్ శక్తి నాగప్పన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘తమ సంస్థకు నార్సింగి, కోకాపేట్‌లో కేంద్రాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం రోజుకు 3 నుంచి 4 వేల కిట్లు తయారు చేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు.

దేశంలో ఎక్కడికైనా ఈ కిట్‌లను సులువుగా సరఫరా చేయవచ్చన్నారు. ఇందులోని ప్రతి ఒక్క ఎంజైమ్‌నూ సొంతంగా అభివృద్ధి చేశామని, ఇదే కిట్ ప్రత్యేకత అని ఆయన తెలిపారు. దేశంలో ఈ ఘనత సాధించిన మొదటి కంపెనీ తమదే అని ఆయన వివరించారు. డెంగ్యూ, టీబీ, చికున్ గున్యా డయాగ్నస్టిక్ కిట్‌ల తయారీకి తమకు 2018లో లైసెన్స్ లభించిందని ఆయన పేర్కొన్నారు. అయితే 2019లో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటివరకు దక్షిణ భారతదేశంలోనే తమ కిట్‌లను సరఫరా చేశామని, ఇకపై ఉత్తర భారత మార్కెట్‌పైనా దృష్టిసారిస్తామని పేర్కొన్నారు.

రాష్ట్రానికి గర్వకారణంః మంత్రి కెటిఆర్
హైదరాబాద్‌కు చెందిన హువెల్ లైఫ్ సైన్సెస్ సంస్థ కరోనా కిట్లను అభివృద్ధి చేయడంపై రాష్ట్ర మంత్రి కెటిఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇది అద్భుతమైన వార్త అని పేర్కొన్నారు. లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్‌ను అభినందించారు. మొత్తం 24 కిట్‌లను తయారు చేయగా, కేవలం 6 కిట్‌లకు మాత్రమే ఐసీఎంఆర్ అనుమతి లభించిందని, అందులో మన హైదరాబాద్ సంస్థ ఉండడం గర్వకారణమన్నారు. ఇంతవరకు దేశంలో మైల్యాబ్, అల్టోనా డయాగ్నస్టిక్స్, కిల్‌పెస్ట్, సీజిన్, ఎస్‌డి బయోసెన్సార్‌లకు మాత్రమే కిట్‌ల తయారీకి అనుమతి లభించిందని కెటిఆర్ ట్వీట్‌చేశారు

ICMR Approval for Howell Life Sciences Testing Kits
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News