Monday, April 29, 2024

నక్సల్స్ ఏరియాల్లో, మంచుకొండల్లో అక్రమంగా గంజాయి సాగు

- Advertisement -
- Advertisement -

Illegal cannabis cultivation in Naxalism-hit areas

 

డ్రగ్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్‌ను ఛేదించిన ఎన్‌సిబి

రెండు నెలల్లో 10,700 కిలోల గంజాయి పట్టివేత

సముద్ర మార్గం ద్వారా శ్రీలంకకు అక్రమ రవాణా

గంజాయితోపాటు నల్లమందు, కొకైన్, హషీష్ ఆఫ్రికా దేశాలకు రవాణా

న్యూఢిల్లీ : నక్సల్ ప్రభావిత ఆంధ్రప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో నే కాకుండా హిమాచల్ ప్రదేశ్,ఉత్తరాఖండ్, జమ్ముకశ్మీర్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, తిపుర వంటి ప్రతికూల వాతావరణ భూభాగాల్లోను, కొండల్లోను అక్రమంగా గంజాయి సాగవుతోందని, ఇక్కడ నుంచి దేశం లోని వివిధ ప్రాంతాలకు ఈ నిషేధిత ఉత్పత్తులు రవాణా అవుతున్నాయని అధికారులు మంగళవారం వెల్లడించారు. గత రెండు నెలలుగా దేశం లోని వివిధ ప్రాంతాల్లో మాదక ద్రవ్య పదార్థాలను భారీ ఎత్తున నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) పట్టుకుందని చెప్పారు. ఈ ప్రాంతాల నుంచి ఢిల్లీ, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకే కాదు, సముద్ర మార్గం ద్వారా శ్రీలంకకు కూడా అక్రమంగా రవాణా అవుతోందని తెలియచేశారు. అక్రమ సాగును ధ్వంసం చేయడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ దళాలకు అక్కడకు వెళ్లడం చాలా కష్టమౌతుందని, వెళ్లడానికి అనుకూలంగా ఆ ప్రాంతాలు ఉండవని చెప్పారు.

ఎన్‌సిబి సమగ్ర దాడుల వల్ల దేశం లోని వివిధ ప్రాంతాల్లో బహుళ మాదక ద్రవ్య రవాణా నెట్ వర్క్‌ను ఛేదించడమైందని, మాదక ద్రవ్యాలను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఆగస్టు, అక్టోబర్ మొదటివారం మధ్యలో దేశంలో మొత్తం 10,700.5 కిలోల గంజాయి పట్టుబడిందని , మెథిలిన్ డయోక్సీమెథంఫిటామిన్ (ఎండిఎంఎ) 1.18 కిలోలు, కొకైన్ రెండు కిలోల వరకు పట్టుబడిందని తెలిపారు. మత్తు పారవశ్యం కలిగించడంలో పేరు పొందిన ఎండిఎంఎ వాడుక రానురాను విపరీతంగా పెరుగుతోందని, దీన్ని వినియోగిస్తే మానసిక స్థితి, అవగాహనలో మార్పు రావడమే కాక, ఆనందం అనుభూతి, శక్తి పెరుగుతుందన్న భ్రాంతి సంభవిస్తుందని వినియోగదారుల నమ్ముతున్నారని వివరించారు. ఆడిస్‌అబాబా, ఇథియోపియా, దక్షిణాఫ్రికా మీదుగా కొకైన్ రవాణా అవుతోందన్నారు. యుఎన్‌ఒడిసి వరల్డు నివేదిక ప్రకారం పరవశం కలిగించే ‘ఎక్సటసీ’
ఐరోపా, ముఖ్యంగా పశ్చిమ, మధ్య ఐరోపాలో తయారీ కొనసాగుతోందని, ట్రెమడాల్ వంటి సింధటిక్ ఒపియోయిడ్స్ కూడా మాత్రల రూపంలో డ్రగ్స్ మాదిరిగా రవాణా అవుతున్నాయని తెలిపారు.

గత రెండు నెలల్లో రాజస్థాన్, మహారాష్ట్రాల్లో 6,53, 300 ట్రెమడాల్ మాత్రలు పట్టుబడ్డాయని వీటి వినియోగం విపరీతంగా ఉండడంతో వీటిని ఎన్‌డిపిఎస్ యాక్టు 2018 లో చేర్చినట్టు చెప్పారు.రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో నల్లమందు, గసగసాల గడ్డి రవాణా రాష్ట్రాలుగా పేరు పొందాయని తెలిపారు. గత రెండు నెలల్లో 58.5 కిలోల నల్లమందు, 1092.4 కిలోల గసగసాల గడ్డి పట్టుబడిందని అధికారులు చెప్పారు. హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్ రాష్ట్రాలు రెండూ ఎక్కువ నాణ్యత గల చరస్ అక్రమంగా ఉత్పత్తి చేసేవిగా పేరు పడ్డాయని తెలిపారు. చరస్‌ను హషీష్ అని కూడా పిలుస్తారు. గంజాయి మొక్కల నుంచి దీన్ని తయారు చేస్తారు. గత రెండు నెలల్లో 163 కిలోల హషిష్, 29.7 కిలోల హెరాయిన్ పట్టుబడింది. ఆఫ్రికా దేశాల నుంచి కొరియర్ పార్శిల్ ద్వారా కొకాయిన్ రవాణా అవుతోందని ఎన్‌సిబి అధికారులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News