Friday, May 3, 2024

రాష్ట్రంవైపు ఎపి మద్యం మాఫియా చూపు

- Advertisement -
- Advertisement -

Illegal Liquor Mafia Rised in Andhra Pradesh

హైదరాబాద్‌ః ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రకాల మద్యం బ్రాండ్‌లు లభించకపోవడం, అధిక ధరలకు విక్రయిస్తుండటంతో ఎపి మద్యం మాఫియా ఇక్కడ మద్యాన్ని సరిహద్దులు దాటిస్తోంది. ఈక్రమంలో రాష్ట్ర సరిహద్దుల్లో అనధికారికంగా బెల్టు షాపులు వెలుస్తుండటంతో ఇరు రాష్ట్రాల ఎక్సైజ్ పోలీసులు అదనపు చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. కాగా రాష్ట్ర సరిహద్దులోని బెల్ట్ షాపులలో ఎపి మద్యం ప్రియులు పెద్ద ఎత్తున తరలివచ్చి మద్యం సేవించడంతో పాటు గుట్టుగా తరలిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారుల విచారణలో వెలుగుచూసింది. ఎపిలోని కర్నూలు, కృష్ణ , ఖమ్మం జిల్లా బోర్డర్‌లో పదుల సంఖ్యలో బెల్ట్ షాపులు ఓపెన్ చేశారు.

బెల్టు షాపుల్లో మందు కొట్టేందుకు పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మందుబాబులు వస్తుండడంతో తమ గ్రామాల్లోకి ఎక్కడ కరోనా ఎంటరవుతుందోనన్న భయంతో పలువురు వణికిపోతున్నారు.ఈ నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దులోని అలంపూర్ చౌరస్తాలో వెలసిన బెల్ట్ షాపులో కర్నూలు నగరానికి చెందిన మద్యం ప్రియుల హల్‌చల్ కారణంగా సమీప గ్రామాలలో పలు వివాదాలు చోటుచేసుకున్నాయి. మద్యం కోసం అర్థరాత్రుళ్లు మద్యం బాబులు గ్రామంలోకి రావడంతో వివాదం మొదలై చివరకు ఘర్షణకు దారితీసింది. అలాగే కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గంలోని అనంతవరం,చంద్రగూడెం గ్రామాల్లో ప్రజలు మద్యం బాబుల వీరంగంతో ఇబ్బంది పడుతున్నారు.

ఇదిలావుండగా ఎపిలో మందు బాబులకు షాక్ కొట్టేలా దశలవారీగా మధ్యపాన నిషేధం అమలులో భాగంగా వైన్ షాపుల సంఖ్యను తగ్గించడం, ధరలు విపరీతంగా పెంచడంతో కొంతమంది మద్యం వ్యాపారులు కొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ మద్యం ఆంధ్రా మందుబాబులకు విక్రయిస్తున్నారు. తెలంగాణలో మద్యం ధరలు తక్కువగా వుండడంతో దానికి అదనంగా భారీ లాభం కలుపుకుని ఆంధ్రా మందుబాబులకు విక్రయిస్తున్నారు. ఇందుకోసం ఏకంగా బెల్టు షాపులు తెరిచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రాండ్ల కొరత, దీనికి తోడు కంటైన్మెంట్ జోన్లలో మద్యం షాపులు మూత, మరో పక్క మద్యం ధరల మోత. కావల్సిన బ్రాండ్ మందు ఆంద్రప్రదేశ్‌తో పోలిస్తే తక్కువ ధరకు తెలంగాణలో దొరకడంతో ఆంధ్ర ప్రాంతంలో పలు పార్టీలకు సంబంధించిన నాయకులే తెలంగాణ మద్యంతో వ్యాపారం మొదలుపెట్టారని బహిరంగంగానే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

రాష్ట్ర సరిహద్దులో వ్యవసాయ భూము ల్లో కొత్తగా బెల్టు షాపులలో మద్యం సేవించి తిరిగి ఎపికి చేరుకుంటున్నారు. ఈ తతంగం అటు ఎపి, ఇటు రాష్ట్ర పోలీసులకు తలనొప్పిగా మారింది. ఇదిలావుండగా మద్య విక్రయాలను పెంచే ఎక్సైజ్ పోలీసులకు శాంతిభద్రతలను పరిరక్షించే పోలీసులకు మధ్య స్వల్ప వివాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. సరిహద్దుల్లో మద్యం సేవించే వారిపట్ల, మద్యం అక్రమంగా తరలించే మద్యం మాఫియాపై కఠినంగా వ్యవహరించాలని సరిహద్దు గ్రామాల ప్రజలు మూకుమ్మడిగా కోరుతున్నారు. అదేవిదంగా ఆంధ్రలోకి అక్రమంగా మద్యం తరలించే మద్యం ముఠాల ఆటకట్టించేందుకు ఎపి ఎక్సైజ్ పోలీసులు అదనపు చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News