Monday, April 29, 2024

4 ట్రిలియన్ల బాకా!

- Advertisement -
- Advertisement -

దున్నపోతు ఈనిందంటే దూడను దొడ్లో కట్టేయమన్నారని ఒక సామెత. తాము విన్న సమాచారం నిజమో, అబద్ధమో తెలుసుకోకుండా ప్రచార బాకాలు ఊదడం గురించి దీనిని ఉదహరిస్తారు. భారత ఆర్థిక వ్యవస్థ మొట్టమొదటి సారిగా 4 ట్రిలియన్ డాలర్లు దాటిపోయిందన్న పుకారును బిజెపి వర్గాలు ఈ విధంగానే ప్రచారంలో పెట్టారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) సమాచారం అంటూ ఇది బయటకు పొక్కగానే అంతర్జాతీయంగా భారత ఖ్యాతిని పెంచుతున్న అసాధారణ పరిణామం అంటూ కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ‘ఎక్స్’ (మాజీ ట్విట్టర్)లో ఒక సందేశం పోస్టు చేశారు. ఆ వదంతి స్క్రీన్ షాట్‌ను జత చేశారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈయనకు గొంతు కలిపారు. దార్శనికుడైన, చైతన్యవంతుడైన నాయకుని సారథ్యంలోనే ఇది సాధ్యమని ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ ఫడ్నవీస్ అందులో శ్లాఘించారు. ప్రధాని మోడీని అభినందించారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇదే పని చేశారు. మనం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు అడుగులు వేస్తున్నాం ఇది మోడీ గ్యారంటీ అని ఆయన పేర్కొన్నారు. ఇంకా మరి కొంత మంది బిజెపి నాయకులూ ఇదే విధంగా ఆత్మస్తుతికి పాల్పడ్డారు. ప్రధాని మోడీని పైకెత్తివేశారు. అత్యంత ఐశ్వర్యవంతుడు, ప్రధాని మోడీ సన్నిహితుడనిపించుకొంటున్న గౌతమ్ అదానీ ఈ సందర్భంగా భారత దేశాన్ని అభినందించారు. మరి రెండేళ్ళలో ఇండియా ప్రపంచంలో మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కానున్నదని ప్రకటించారు. మువ్వన్నెల జెండా అదే పనిగా వెలుగులు చిమ్ముతున్నదని అన్నారు. ఇదంతా బూటకమని కాంగ్రెస్ పార్టీ ఖండించింది.

2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశం 10.5% జిడిపి (స్థూల దేశీయోత్పత్తి)ని సాధిస్తే ఆర్థిక వ్యవస్థ 3.7 ట్రిలియన్ డాలర్లకు చేరుకొంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే 202425లో మాత్రమే మన ఆర్థిక వ్యవస్థ 4.2 ట్రిలియన్ డాలర్లకు చేరుకొనే అవకాశముంది. ప్రస్తుతం అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఇండియా 5వ స్థానంలో వుంది. 4వ స్థానంలో వున్న జపాన్‌ను మించిపోవాలంటే కనీసం మరి మూడేళ్ళు పడుతుందని ఐఎంఎఫ్ నిపుణులు చెబుతున్నారు. అలాగే ప్రస్తుతం మూడో స్థానంలో గల జర్మనీని దాటాలంటే ఆ తర్వాత మరొక ఏడాది పడుతుందని అంచనా వేస్తున్నారు. 2027 నాటికి ఇండియా మూడవ ఆర్థిక శక్తిగా ఎదగాలంటే వచ్చే కొద్ది సంవత్సరాల్లో సగటున సాలీనా 9.19 శాతం వృద్ధిని సాధించవలసి వుంటుంది.20132018 మధ్య 11.8%, 2019 2023 మధ్య 10% సగటు వృద్ధిని భారత ఆర్థిక వ్యవస్థ సాధించింది. 202324 మొదటి త్రైమాసికంలో ఈ వృద్ధి 8 శాతంగానే నమోదైంది.

వాస్తవాలు ఇలా వుండగా వున్నపళంగా 4 ట్రిలియన్ డాలర్లను దాటిపోయామనే సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది? దీనిని ఒక యూ ట్యూబ్ వీడియో నుంచి తీసుకొని ప్రచారంలో పెట్టినట్టు రూఢి అవుతున్నది. యూ ట్యూబ్ ద్వారా ఎవరైనా, ఏ విషయాన్నైనా వ్యాప్తిలో పెట్టవచ్చు. సామాజిక మాధ్యమాలను రాజకీయ స్వప్రయోజన కాండకు, ప్రత్యర్థి వర్గాలపై దుష్ప్రచారానికి దుర్వినియోగం చేయడంలో భారతీయ జనతా పార్టీ డిజిటల్ సైన్యానికి గల నేర్పు అపారమైనది. ఎన్నికలు జరుగుతున్న తెలంగాణ, రాజస్థాన్‌లలో ప్రధాని మోడీ గొప్పతనాన్ని చాటడానికి ఈ తప్పుడు సమాచార వ్యాప్తి అసాధారణ స్థాయిలో జరుగుతున్నట్టు తెలుస్తున్నది. ఇందుకు సామాజిక మాధ్యమాన్ని విశేషంగా వాడుకొంటున్నారు.ఇంతకు ముందు చత్తీస్‌గఢ్‌లో కూడా ఇదే పని చేశారు. ఇండియా 4 ట్రిలియన్ డాలర్లకు చేరుకొన్నదని నమ్మించడానికి 190 దేశాల జిడిపి అంకెలను తప్పుడుగా పేర్కొంటూ ప్రచారం చేస్తున్నారని తెలిసింది.

ఎన్ని వందల వేల ట్రిలియన్ల డాలర్లకు మన ఆర్థిక వ్యవస్థ చేరుకొన్నదని సాక్షాత్తు ద్రవ్యనిధి సంస్థే చెప్పినా దాని రుజువులు దేశ ప్రజల బతుకుల్లో కనిపించాలి కదా? కొద్ది మంది సంపన్నులను మరింతగా సంపద గలిగిన వారిని చేయడం, పేదలను ఇంకా దరిద్రులుగా మార్చడం జరుగుతున్న చోట ఈ జిడిపి గొప్పల వల్ల ఒరిగేదేముంటుంది? పేదలకు సంక్షేమ తాయిలాలు, పెద్దలకు వందల వేల కోట్ల సంపద ఇదెంత ఘోరమో విడమరచి చెప్పనక్కర లేదు.పేదలు అత్యధిక సంఖ్యలో గల దేశంగా భారత ఖ్యాతి మార్మోగిపోతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 81.35 కోట్ల మంది పేదరికంలో మగ్గుతున్నారు. వీరిలో 75% మంది గ్రామీణులు కాగా, 50% మంది పట్టణ ప్రాంతాలకు చెందినవారు. 80.48 కోట్ల మందికి ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని వర్తింప చేస్తున్నారని ఈ నెల 15వ తేదీ తర్వాత వెల్లడైంది. ఇంత మంది పేదలున్న దేశం జిడిపి వృద్ధిలో ఎంత శిఖరాయమానంగా ఎదిగినా మేలు ఏముంటుంది? మనుషులను పస్తుల్లో వుంచి మస్తుగా పెరిగే ఆర్థిక వ్యవస్థది వాపు కాక బలుపు ఎలా అవుతుంది?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News