Friday, May 3, 2024

హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ సుప్రీంగా జగన్ మోహన్ రావు

- Advertisement -
- Advertisement -

హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ సుప్రీంగా జగన్ మోహన్ రావు
జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవ ఎన్నిక
ఈ ఘనత సాధించిన తొలి తెలంగాణ వ్యక్తిగా రికార్డు

Jagan mohan elected as National Handball Federation Chief

మన తెలంగాణ/హైదరాబాద్: జాతీయ హ్యాండ్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడిగా తెలంగాణకు చెందిన అరిశెనపల్లి జగన్ మోహన్ రావు ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగిన జాతీయ హ్యాండ్‌బాల్ ఎన్నికల్లో జగన్ మోహన్ రావును అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్ష పదవికి జగన్ మోహన్ రావు ఒక్కరే నామినేషన్ వేశారు. దీంతో ఆదివారం నిర్వహించిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా జగన్ మోహన్ రావు అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి ఓ జాతీయ క్రీడకు అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి వ్యక్తిగా జగన్ మోహన్ రావు రికార్డు సృష్టించారు. ఇంతకుముందు ఆయన జాతీయ హ్యాంబ్‌బాల్ సంఘానికి ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. ఇదిలావుండగా జాతీయ స్థాయి క్రీడా సంఘాల్లో జగన్ మోహన్ తనదైన ముద్ర వేశారు. హ్యాండ్‌బాల్ క్రీడను అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు.

ఇదే సమయంలో పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ టోర్నమెంట్‌లు నిర్వహించారు. అంతేగాక హ్యాండ్‌బాల్‌కు మరింత ఆదరణ లభించేలా ఐపిఎల్ తరహాలో లీగ్‌లు నిర్వహించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేశారు. క్రీడాభివృద్ధికి జగన్ మోహన్ రావు చేస్తున్న కృషిని దృష్టిలో పెట్టుకుని ఆయనను జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. భారత ఒలింపిక్ సంఘం కోశాధికారి, జాతీయ హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ కార్యదర్శి ఆనందీశ్వర్ పాండే సహకారంతో జగన్ మోహన్ రావు ప్రతిష్టాత్మకమైన ఈ పదవిని దక్కించుకున్నారు. జాతీయ హ్యాండ్‌బాల్‌లో ప్రవేశించిన కొద్ది రోజుల్లోనే జగన్ మోహన్ రావు తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ బలమైన శక్తిగా ఎదిగారు. అతి తక్కువ సమయంలో హ్యాంబ్‌బాల్ ఫెడరేషన్ చీఫ్ పదవిని సొంతం చేసుకున్నారు. జాతీయ స్థాయి క్రీడా సంఘాల్లో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారు అత్యున్నత పదవులు సాధించడం చాలా క్లిష్టమైన అంశంగా చెప్పాలి. అయితే జగన్ మాత్రం నిరంతర కృషి, పట్టుదలతో ఒక్కో మెట్టు ఎదుగుతూ అతి తక్కువ సమయంలోనే జాతీయ స్థాయి క్రీడా సంఘాల్లో తనదైన ముద్ర వేశారు. ఈ క్రమంలో దిగ్గజాలను సయితం ఎదురిస్తూ కీలకమైన పదవిని సాధించారు.
గర్వంగా భావిస్తున్నా
జాతీయ హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం గర్వంగా భావిస్తున్నా. ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతా. హ్యాండ్‌బాల్‌ను జనరంజక క్రీడల్లో ఒకటిగా తీర్చిదిద్దడమే ఏకైక లక్షంగా పెట్టుకున్నా. ఇతర క్రీడల మాదిరిగానే దీనిపై కూడా క్రీడాకారులకు ఆసక్తి కలిగేలా కృషి చేస్తా. తెలంగాణ నుంచి ఓ జాతీయ క్రీడా సంఘానికి అధ్యక్షుడిగా నిలిచిన తొలి వ్యక్తిగా ఉండడం తనకు లభించిన అరుదైన గౌరవం. తనపై ఎంతో నమ్మకంతో అప్పగించిన అధ్యక్ష బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి క్రీడాభివృద్ధికి అహర్నిశలు కృషి చేయడమే లక్షంగా ముందుకు సాగుతా. తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న 29 రాష్ట్ర సంఘాలకు కృతజ్ఞతలు. వారి ఆశయాలకు అనుగణంగా హ్యాండ్‌బాల్‌ను జనరంజక క్రీడగా తీర్చిదిద్దుతా.
అంచెలంచెలుగా ఎదుగుతూ
ఇటీవల కాలంలో జగన్ మోహన్ ఇటు జాతీయ, అటు తెలంగాణ క్రీడా సంఘాల్లో బలమైన శక్తిగా ఎదిగారు. జగన్ మోహన్ రావుది రంగారెడ్డి జిల్లా ఇబ్నహీంపట్నంలోని దండుమైలారం. స్వతహాగా పారిశ్రామిక వేత్త అయిన జగన్ మోహన్ రావుకు క్రీడలంటే ఎంతో ఇష్టం. 2018లో తెలంగాణ టి20 లీగ్ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. అంతేగాక మెదక్ మేవరిక్స్ జట్టుకు యజమానిగా కూడా ఉన్నారు. ఇదే సమయంలో ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారికి మెరుగైన శిక్షణ అందేలా తనవంతు పాత్ర పోషించారు. వర్ధమాన క్రీడాకారులకు ఆర్థికంగా కూడా అండగా నిలుస్తూ మెరుగైన ఆటగాళ్లుగా తీర్చిదిద్దారు. అంతేగాక 2018 నుంచి ఒలింపిక్ క్రీడగా గుర్తింపు పొందిన హ్యాండ్‌బాల్‌లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. 2019లో తెలంగాణ హ్యాండ్‌బాల్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ వెంటనే ఆసియా హ్యాండ్‌బాల్, అంతర్ జిల్లా హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్‌ను హైదరాబాద్ వేదికగా నిర్వహించి జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆయన ప్రతిభకు గుర్తింపుగా జాతీయ హ్యాండ్‌బాల్ ఉపాధ్య పదవిని అప్పగించారు. ఇదిలావుండగా జాతీయ హ్యాండ్‌బాల్ అధ్యక్షుడిగా ఎన్నికైన జగన్ మోహన్ రావుకు దేశ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తాయి. పలు రాష్ట్రాలకు చెందిన క్రీడా సంఘాల ప్రతినిధులు ఆయనను అభినందించారు.

Jagan mohan elected as National Handball Federation Chief

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News