Monday, April 29, 2024

కులగణనపై కాంగ్రెస్ ద్రోహం

- Advertisement -
- Advertisement -

నమ్మిన వాళ్లను మోసం చేయడం ఈజీ. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించిన బిసిలను ఆ పార్టీ మరోసారి మోసం చేసింది. నమ్మక ద్రోహం చేసింది. ఇంకా చెప్పాలంటే తమకు స్వీయ ప్రయోజనాలే తప్ప ప్రజల ప్రాధాన్యతలు, వారికిచ్చిన హామీలు పట్టవు అని నిరూపించుకున్నది. తాను స్వయంగా బిసి సామాజిక వర్గానికి చెందిన ముఖ్యమంత్రి అయినప్పటికీ సిద్ధరామయ్య బిసి కమిషన్ సమర్పించిన గణాంకాలపై నివేదిక తెప్పించుకోలేక తాత్సారం చేస్తున్నారు. అంతేగాదు ఐదేండ్ల కిందట సమర్పించిన ఈ గణాంకాలపై చిన్ననోట్ రాయడానికి మూడేండ్ల కాలం తీసుకున్న జయప్రకాశ్ హెగ్డె కమిషన్‌కు మొన్న మరోసారి సిద్ధరామయ్య గడువు పొడిగించారు. 2020లో ఏర్పాటు చేసిన ఆ రాష్ర్ట బిసి కమిషన్ పదవీ కాలాన్ని జనవరి 21, 2024 వరకు పొడిగిస్తూ నవంబర్ 24నాడు కర్నాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బిజెపి ప్రభుత్వం నియమించిన కమిషన్ గడువు పొడిగించడమంటేనే ఏదోతేడా వున్నది. నిజానికి కర్నాటక రాష్ర్ట బ్యాక్‌వర్డ్ క్లాసెస్ కమిషన్ చైర్మన్, రాజకీయ నాయకుడు కె.జయప్రకాశ్ హెగ్డె తన నివేదికను నవంబర్ 25న నివేదికను సమర్పించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఎందుకంటే ఆ కమిటీ పదవీకాలం నవంబర్ 26తో ముగియాల్సి ఉండింది.

తెలంగాణ ఎన్నికల ముందు ఈ నివేదిక వివరాలు బహిర్గతం చేయాల్సి వస్తదనే ఉద్దేశంతో కమిషన్ పదవీ కాలాన్ని పొడిగించారు.గతంలో ఇదే జయప్రకాశ్ హెగ్డె కులగణన రిపోర్టు తస్కరణకు గురైందని కూడా పోలీసులకు ఫిర్యాదు చేసిండు. ఇది ఇలా కొనసాగుతుండగానే వక్కలిగ సామాజిక వర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.దేవెగౌడ్, కేంద్ర మంత్రి శోభా కరాంద్లజె, రాష్ర్ట శాసన సభలో ప్రతిపక్ష నాయకుడు ఆర్.అశోక్ అందరూ ఈ నివేదిక ‘అశాస్త్రీయమైనది’ అని గొంతెత్తడంతో ప్రభుత్వం తాత్కాలిక ఉపశమనంగా ఈ కాలయాపన చేస్తున్నది. వక్కలిగ సామాజిక వర్గం వారు తమ జనాభాను ఈ నివేదికలో తక్కువగా చూపించారు అనే అనుమానంతో (లీకైన రిపోర్టు ఆధారంగా) అసలు నివేదికనే బుట్టదాఖలు చేసేలా వత్తిడి తీసుకొస్తున్నారు. అంతేగాదు వచ్చే పార్లమెంటు ఎన్నికల వరకు ఈ నివేదికను బహిర్గతం చేయకుండా రాజకీయ లబ్ధి పొందాలని కాంగ్రెస్ చూస్తున్నది. కర్నాటకలో హామీలు అమలుకు నిరాకరించే ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి చేతుల మీదుగానే కామారెడ్డిలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ‘బిసి డిక్లరేషన్’ని విడుదల చేయించింది.ఇందులో తెలంగాణలో సైతం ఆ పార్టీ ‘కుల గణన’ చేస్తామని ప్రకటించింది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని అసలు కర్నాటకలో ‘బిసి కుల గణన’పై ఏమి జరుగుతున్నదో సమగ్రంగా విశ్లేషించుకోవాల్సిన అవసరమున్నది.

దేశంలోనే మొట్టమొదటి సారిగా బిసిల కులగణన చేయడానికి 2014 జూన్‌లో ‘సామాజిక, ఆర్థిక, విద్యారంగ సర్వే’ చేసేందుకు గాను కర్నాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం 2015లో హెచ్. కాంతరాజు నేతృత్వంలో ఒక కమిషన్‌ని ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ లక్షా యాభై ఏడు వేల మంది సిబ్బందిని వినియోగించి రాష్ర్టంలో ఆధార్ కార్డ్ ఆధారంగా అందరి ‘సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన’ వివరాలను సేకరించింది. ఇందుకు గాను ప్రభుత్వం దాదాపు రూ. 165 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించింది. ఈ కమిషన్ తమ నివేదికను 2018లోనే సమర్పించినప్పటికీ అప్పటి సిద్ధరామయ్య ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తొక్కి పెట్టింది.ఆ తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన హెచ్.డి. కుమారస్వామి, బిఎస్ యెడ్యూరప్ప, బసవరాజ్ బొమ్మయ్ ముగ్గురు కూడా సర్వేపై ఏమాత్రం దృష్టిని కేంద్రీకరిచంలేదు. కుమారస్వామికి నివేదిక సమర్పించినప్పటికీ దానిపై మెంబర్ సెక్రెటరీ సంతకం లేదని స్వీకరించడానికి ఆయన నిరాకరించారు. అట్లాగే భారతీయ జనతా పార్టీ హిందువులను వెనుకబడిన తరగతులుగా విభజించే కుట్రగా దీన్ని చూస్తున్నది. కర్నాటక రాజకీయాలను తమ చెప్పుచేతుల్లో వుంచుకున్న ఆధిపత్యకుల వక్కలిగ, లింగాయత్ సామాజిక వర్గాలు నివేదిక బహిర్గతమైనట్లయితే తమ ప్రాబల్యానికి గండి పడుతుందని సర్వేను వ్యతిరేకిస్తున్నాయి.

ఆరు కోట్లకుపైగా జనాభా ఉంటే నివేదికిలో 5 కోట్ల 90 లక్షల మందినే సర్వే చేశారని, సర్వే శాస్త్రీయంగా లేదని కాంగ్రెస్‌లోని ఆధిపత్య కుల నాయకులే బహిరంగంగా విమర్శిస్తున్నారు. ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారు. ఇట్లాంటి లేఖల్లో కర్నాటక కాంగ్రెస్ సీనియర్ నాయకులు శివకుమార్, ఆలిండియా వీరశైవ (మహాసభ) అధ్యక్షులు ఎస్.శివకుమారప్ప తదితరులు నిరసనలు తెలుపుతున్నారు.కమిషన్ సమర్పించే ఏ నివేదికనైనా ప్రభుత్వ ప్రతినిధిగా దాని సభ్య కార్యదర్శి సంతకం చేయాల్సి ఉంటది.అయితే అప్పటి సభ్య కార్యదర్శి అంబుకుమార్ మీద వత్తిడి తీసుకొచ్చి సంతకం పెట్టకుండా ఆధిపత్య కులనాయకులు అడ్డుకున్నారు. మూడేండ్ల కాలం శ్రమించి హెచ్. కాంతరాజ్ నేతృత్వంలోని కమిషన్ 2018లో గణాంకాలు, వివరణలతో కూడిన రిపోర్టుని ప్రభుత్వానికి సమర్పించింది. అయితే దానిపై రెండేండ్ల పాటు ఎలాంటి స్పందన లేని అప్పటి బిజెపి ప్రభుత్వం 2020లో జయప్రకాశ్ హెగ్డె ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల కమిషన్‌ని నియమించింది. ఇందులో కళ్యాణ్‌కుమార్, రాజశేఖర్, అరుణ్‌కుమార్, కె.టి. సువర్ణ, శారద నాయక్‌లు సభ్యులుగా ఉన్నారు. వీరి ప్రధాన బాధ్యత గణాంకాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి దాని ఆధారంగా నివేదిక తయారు చేయాల్సి ఉండిండే. అయితే కొవిడ్ కాలంగా కొంత కాలయాపన జరిగినా తర్వాతి సమయంలోనైనా ఈ నివేదికను సమర్పించాల్సింది.

కానీ జయప్రకాశ్ హెగ్డె కమిషన్ కార్యాలయం నుంచి ‘వర్క్ షీట్లు’ చోరీకి గురయ్యాయి, వాటిని వెతికిపెట్టండి అని పోలీసులకు ఫిర్యాదు చేసిండు. అయితే ఆయన పదవీ కాలం పెంచిన వెంటనే ఆయన మాట మార్చి ఫిజికల్ కాపీ మిస్సయినా సమాచారమంతా ‘సాఫ్ట్ కాపీ’ రూపంలో కంప్యూటర్లలో భద్రంగా ఉన్నదని చెప్పిండు. ఇదంతా లెక్కలు చెప్పకుండా మసిపూసి మారేడు కాయ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదనే అనుమానాలకు బలమిస్తున్నది. నిత్యం బిజెపి ప్రభుత్వాన్ని విమర్శించే కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ నియమించిన కమిషన్‌కు గడువు పొడిగించడం వెనుక ఏదో మతలబున్నదనే అనుమానాలూ వున్నాయి.అయితే బిజెపి ప్రభుత్వానికి బిసిల పట్ల చిత్తశుద్ధి లేకపోవడంతో వాళ్ళు నివేదిక కోసం ప్రయత్నించలేదు. అయితే దురదృష్టం ఏమిటంటే ఆ కమిటీ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కూడా గత ఆర్నెల్లుగా కాల యాపన చేస్తున్నది. పార్టీలోని అంతర్గత కలహాల వల్లనే ఈ జాప్యం జరుగుతున్నది. ఎట్టి పరిస్థితుల్లోనూ నివేదికను బహిర్గత పరిచి బిసిల అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటామని సిద్ధరామయ్య చెబుతున్నప్పటికీ అవేవి కూడా ఆచరణకు నోచుకోవడం లేదు. ఈ ఏడాది మేలో జరిగిన కర్నాటక ఎన్నికలకు ముందు మీడియాలో హెచ్. కాంతరాజ్ కమిషన్ వివరాలు లీకయ్యాయి. దాని ప్రకారం కర్నాటకలో అత్యధిక జనాభా దళితులది.

వారి తర్వాత ముస్లింలది అని తేలింది. అంటే దళితుల జనాభా 19.5%, ముస్లింల జనాభా 16%, లింగాయత్‌ల జనాభా శాతం 14%, వక్కలిగలది 11 శాతంగా పేర్కొన్నారు. దీంతో తాము 17% నుంచి 19% వుంటామని లింగాయత్‌లు, అట్లాగే 14% వుంటామని వక్కలిగలు క్లెయివ్‌ు చేస్తూ కమిషన్ గణాంకాలను తప్పుబట్టిండ్రు. అంతేగాదు ఆ గణాంకాలను బుట్టదాఖలు చేయాలని కూడా డిమాండ్ చేసిండ్రు. అయితే ఈ గణాంకాలన్నింటని శాస్త్రీయ పద్ధతిలో సేకరించామని ఎక్కడా కూడా తప్పులకు ఆస్కారం లేకుండా ఫూల్‌ప్రూఫ్‌గా వున్నాయని హెచ్. కాంతరాజ్ ఈ గొడవ ప్రారంభమైన తర్వాత మీడియాతో మాట్లాడుతూ చెప్పిండు. దొరల తెలంగాణ వర్సెస్ ప్రజల తెలంగాణ అని ప్రచారం చేస్తూ బిసిల కులగణన చేస్తామని ఎన్నికల ప్రచార సభల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ చెబుతున్నారు. అయితే ఒక బిసి ముఖ్యమంత్రిగా ఉన్న కర్నాటకలో గతంలో లెక్కించిన కులగణన వివరాలను బహిర్గత పరచడానికి సిద్ధంగా లేదు. అట్లాంటి సమయంలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చినట్లయితే రెడ్ల ఆధిపత్యంలో కుల గణన చేయడానికి పార్టీ సిద్ధంగా ఉంటుందా? అనే అనుమానం బహుజన సమాజంలో ఉన్నది. ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం తెలంగాణలో 34 టికెట్లు బిసిలకు కేటాయిస్తామని,

ఆ తర్వాత బిఆర్‌ఎస్ కన్నా ఎక్కువ ఇస్తామని రెండు సార్లు హామీ ఇచ్చి వెనక్కి బోయిన కాంగ్రెస్ పార్టీని కులగణన విషయంలో బిసిలు మరోసారి నమ్మి మోసపోవడానికి సిద్ధంగా లేరు. ముందు కర్నాటకలో బిసి కులగణన వివరాలు ప్రకటించి చిత్తశుద్ధి నిరూపించుకోవడానికి అవకాశం వచ్చినా, అక్కడ ముఖ్యమంత్రి బిసి సామాజిక వర్గం వాడయినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోని కాంగ్రెస్‌కు బిసిల పట్ల ప్రేమ లేదని కూడా ఇక్కడి ప్రజలకు తెలుసు. కర్నాటకతో ఈ పోలిక ఎందుకు తీసుకు రావాల్సి వస్తుందంటే అక్కడ ఐదు గ్యారంటీలు, ఇక్కడ ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతున్నది. కాబట్టి అక్కడ అవకాశమున్నా అమలుకు నోచుకోని కులగణన వివరాల ప్రకటన, ఇక్కడ చేస్తామంటే నమ్మశక్యంగా లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News