Monday, April 29, 2024

ఆసీస్‌తో చివరి రెండు టెస్టులకు కోహ్లీ దూరం!

- Advertisement -
- Advertisement -

Kohli might miss for last two Tests against Australia

 

ముంబయి: ఆస్ట్రేలియాతో జరిగే చివరి రెండు టెస్టులకు విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. కోహ్లీ సతీమణి అనుష్క శర్మ జనవరిలో ప్రసవించే అవకాశం ఉంది. ఈ సమయంలో ఆమె వద్దే ఉండేందుకు అతను పితృత్వపు సెలవు తీసుకుంటాడని బిసిసిఐ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఇప్పటివరకు కోహ్లీ మాత్రం ఈ విషయం అధికారికంగా బిసిసిఐకి తెలియజేయలేదు. నవంబర్ 17న టీమిండియా ఆస్ట్రేలియాకు బయలుదేరుతుంది. వరసగా మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్‌లు, నాలుగు టెస్టుమ్యాచ్‌లు ఆడనుంది. ఆసీస్‌తో తొలిసారి డే/నైట్ టెస్టుమ్యాచ్‌లో తలపడనుంది. డిసెంబర్ 17-21 వరకు అడిలైడ్‌లో ఈ పోరు జరుగుతుంది.

ఆ తర్వాత మెల్‌బోర్న్ (26 30),సిడ్నీ (జనవరి 7 11),బ్రిస్బేన్ (జనవరి 15 19)ఆతిథ్యమివ్వనున్నాయి.‘ కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడాన్ని బిసిసిఐ నమ్ముతుంది. ఒక వేళ కెప్టెన్ కోహ్లీ పితృత్వపు సెలవు తీసుకోవాలనుకుంటే తొలి రెండు టెస్టులకు మాత్రమే అందుబాటులో ఉంటాడు. సాధారణ పరిస్థితుల్లో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత క్రికెటర్లు వెళుతుంటారు. అంటే ఒక టెస్టు ముగిసిన తర్వాత వెళ్లి తిరిగి రావచ్చు. కరోనాతో 14 రోజులు క్వారంటైన్ ఉండడం వల్ల వెళ్లి తిరిగి రావడం కష్టం’ అని ఆ అధికారి చెప్పారు. కోహ్లీ అందుబాటులో ఉండకపోవడం వల్ల మిడిలార్డర్‌లో కెఎల్ రాహుల్ రావడానికి మార్గం సుగమం కానుంది.

టీమిండియాతోనే రోహిత్

కాగా ఐపిఎల్ ముగిసిన తర్వాత టీమిండియాతో పాటే రోహిత్ శర్మను కూడా ఆస్ట్రేలియాకు పంపిస్తారని తెలుస్తోంది. ఈ విషయంపై బిసిసిఐ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. నవంబర్ 17న టీమిండియాతో పాటుగా రోహిత్‌ను కూడా పంపించి ఫిజియో నితిన్ పటేల్, ట్రైనర్ నిక్ వెబ్ పర్యవేక్షణలో ఉంచుతారని తెలుస్తోంది. అవసరమైతే నవంబర్ 27న మొదలయ్యే వన్డే సిరీస్‌కు విశ్రాంతి ఇచ్చి టి20 సిరీస్‌కు బరిలో దింపాలని బిసిసిఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.ఏది ఏమయినప్పటికీ టెస్టు సిరీస్ ప్రాంభానికి అతను పూర్తి ఫిట్‌నెస్‌తో ఉంటాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News