Monday, April 29, 2024

పరిశ్రమల పతనం

- Advertisement -
- Advertisement -

KTR fires on Union govt At center of CII Telangana Annual Conference

కేంద్రం చిన్నచూపే కారణం
చితికిపోయిన చిన్న,సూక్ష్మ,మధ్యతరహా పరిశ్రమలు
పెద్ద ఎత్తున మూతబడిన ఎస్‌ఎంఎస్‌ఇలు

కేంద్రం పారిశ్రామిక విధానాలు అసంబద్ధంగా ఉన్నాయి, అది రాజకీయ కోణంలోనే ఆలోచిస్తోంది
సిఐఐ తెలంగాణ వార్షిక సమావేశంలో కేంద్రంపై తీవ్రంగా విరుచుకుపడిన మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్రం తీరుపై రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పరిశ్రమలను ప్రొత్సహించే విషయంలో కేంద్రం విధానాలు పూర్తిగా అసంబద్దంగా ఉన్నాయని అసంతృప్తిని వ్యక్తం చేశారు. సరైన విధానాలు లేని కారణంగా పరిశ్రమలకు ఆశించిన స్థాయిలో ప్రొత్సాహం లభించడం లేదన్నారు. ఈ విషయంలో కేంద్రం ఇంకా రాజకీయ కోణంలోనే ఆలోచిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ఫలితంగా అనేక రాష్ట్రాల్లో పారిశ్రామిక రంగం అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నదన్నారు. ప్రధానంగా కరోనా కారణంగా చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు ఆర్ధికంగా బాగా చితికిపోయాయన్నారు. పెద్ద ఎత్తున పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. దీని కారణంగా ఆయా పరిశ్రమలపై ఆధారపడ్డ లక్షలాది కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. అయినప్పటికీ కేంద్రం చిన్న, సూక్ష్మ, మధ్య తరహ పరిశ్రమలను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోఛనీయమని కెటిఆర్ వ్యాఖ్యానించారు.

కేంద్రం ఇకనైనా మారాలన్నారు. వెంటనే స్పందించి ఆర్ధికంగా డీలా పడ్డ పరిశ్రమలకు తగు ప్యాకేజీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని కాకతీయ హోటల్‌లో జరిగిన సిఐఐ (భారత్ పరిశ్రమల సమాఖ్య) తెలంగాణ వార్షిక సమావేశంలో మంత్రి కెటిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో పాశ్రామిక రంగం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందికోవడానికి కేంద్రం అనుసరిస్తున్న విధానాలే కారణమని ఆరోపించారు. పారిశ్రామిక రంగం అభివృద్ధికి కేంద్రం తగు విధంగా సహకరించడం లేదన్నారు. కేవలం ఉత్తర్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాలకే కేంద్రం అధిక ప్రాధాన్యతను ఇస్తూ….మిగిలిన రాష్ట్రాలను పూర్తిగా విస్మరిస్తోందని ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

బిజెపియేతర రాష్ట్రాలను మరీ చులకనగా చూడడం మోడీ సర్కార్‌కు అలవాటుగా మారిందన్నారు. ఫెడరల్ వ్యవస్థకు తూట్లు పొడుసూ…తెలంగాణ వంటి ప్రగతిశీల రాష్ట్రాలకు కేంద్రం పెద్ద అడ్డుగోడలా మారిందని దుయ్యబట్టారు. కేంద్రం నుంచి ఎటువంటి సహకారం లేకపోయినప్పటికీ తెలంగాణ పారిశ్రామిక రంగంలో గణనీయమైన ప్రగతిని సాధిస్తోందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ముందుచూపుతో పాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. కేవలం ఏడున్నర సంవత్సరాల వ్యవధిలోనే ఇతర రాష్ట్రాలు అబ్బురపరిచే విధంగా తెలంగాణ రాష్ట్రం పయనిస్తోందన్నారు. విభజన సమస్యలు ఇంకా పెండింగ్‌లో ఉన్నా మౌలిక వసతుల్లో ముందుకు దూసుకెళ్తున్నామన్నారు. అగ్రి ఉత్పత్తులు కూడా రాష్ట్రంలో బాగా పెరిగాయన్నారు. రైతులకు సాయం అందించేందుకు రైతు బంధు తీసుకొచ్చి దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు. పారిశ్రామిక అభివృద్ధి కూడా రాష్ట్రంలో వేగంగా జరుగుతోందన్నారు. ఇన్వెస్ట్ ఇండియా కూడా పరిశ్రమలకు మరింత సహకారం అందించాలన్నారు. సిఐఐ కూడా కేంద్రం దగ్గర గట్టిగా మాట్లాడి కొత్త పరిశ్రమలకు లబ్ది చేకూరేలా చూడాలని మంత్రి కెటిఆర్ కోరారు. ప్రభుత్వాలు పరిశ్రమల మీద ఎలాంటి ఒత్తిడులు తేకూడదన్నారు.

ప్రపంచస్థాయి కంపెనీలకు కేరాఫ్ అడ్రస్ హైదరాబాద్

20 ఏళ్ల క్రితం హైదరాబాద్‌లో పెద్దగా కంపెనీలు లేవన్న పేర్కొన్న కెటిఆర్… ప్రస్తుతం నగరంలో అనేక ప్రపంచస్థాయి కంపెనీలు వచ్చాయన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమేనని మంత్రి కెటిఆర్ తెలిపారు. రూ.20 లక్షల కోట్లతో కేంద్రం తెచ్చిన ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ అందరినీ నిరాశపరిచిందన్నారు. ఇది ఎవరికి ఉపయోగపడిందో కేంద్రం పెద్దలే చెప్పాలన్నారు. పారిశ్రామిక రంగంతో పాటు వ్యవసాయ రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించలేదని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. దీని కారణంగా రాష్ట్రం ఏర్పడినప్పుడు జిఎస్‌డిపిలో 15 శాతం ఉన్న వ్యవసాయ రంగం వాటా ప్రస్తుతం 21 శాతానికి పెరిగిందన్నారు. దీంతో 5 శాతానికి పైగా వృద్ధిచెందిందన్నారు. రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని సేకరించలేక ఎఫ్‌సిఐ (ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సైతం చేతులు ఎత్తేసిందన్నారు.

విజయవంతమైన స్టార్టప్ తెలంగాణే

స్వతంత్ర భారత్‌లో విజయవంతమైన స్టార్టప్ కేవలం తెలంగాణే అని మంత్రి కెటిఆర్ అన్నారు. ఏడేళ్ల టిఆర్‌ఎస్ పాలనలో తలసరి ఆదాయం బాగా పెరిగిందని తెలిపారు. రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతి పథంలో పయనిస్తోందన్నారు. మౌలిక సౌకర్యాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రధానంగా ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్‌క్లూజివ్ గ్రోత్ నినాదాలతో రాష్ట్రప్రభుత్వం అనేక విధానాలను తీసుకొచ్చినట్లు ఆయన పునరుద్ఘాటించారు. రాష్ట్రం ఏర్పడ్డాక పరిశ్రమలను ప్రోత్సహించేందుకు తొలిచట్టం చేసినట్లు గుర్తుచేశారు. పరిశ్రమలకు 15 రోజుల్లోనే అనుమతిచ్చేలా టిఎస్ ఐపాస్ చట్టం రూపొందించామని వివరించారు. దీని కారణంగానే రాష్ట్రానికి వరదలా పరిశ్రమలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి చట్టం చేయాలన్న ఆలోచన కూడా ఇప్పటి వరకు ఏ రాష్ట్రానికి రాకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.

చైనా తరహాలో అతి పెద్ద పార్కు భారత్‌లో లేదు

చైనాలోని షిజో అనే ప్రాంతంలో 70 వేల ఎకరాల్లో పారిశ్రామిక పార్కు ఉందని మంత్రి కెటిఆర్ తెలిపారు. భారత్‌లో అంత పెద్ద పారిశ్రామిక పార్కు ఉందా? అని ప్రశ్నించారు. అటువంటి ఆలోచన కూడా కేంద్రం చేయకపోవడం శోఛనీయమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ శివారులో 14 వేల ఎకరాల్లో ఫార్మా సిటీ, వరంగల్లో టెక్స్‌టైల్స్ పార్కు పెట్టేందుకు కృషి చేస్తోందన్నారు. దీనికి కేంద్రాన్ని సాయం చేయమని కోరినా ఇప్పటి వరకు సరైన సహకారం లేదన్నారు. పారిశ్రామిక రంగంలో కేంద్రం వేగవంతమైన విధానాలు తీసుకురావడం లేదని ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఒకే భాష మాట్లాడే రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాలుగా ఎందుకు ఏర్పాటు చేయాలని గతంలో చాలా మంది మిత్రులు అడిగారని కెటిఆర్ చెప్పారు. వారందరికి సమాధానం ఇప్పుడు ఉన్న తెలంగాణ రాష్ట్రమేనని తెలిపారు.

దేశం కంటే రాష్ట్ర జిడిపి మెరుగు

2014లో రాష్ట్ర తలసరి ఆదాయం 1.24 లక్షల నుంచి ప్రస్తుతం 2.78 లక్షలకు చేరిందని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఏడేళ్లలో తలసరి ఆదాయం రెండింతలు అయిందన్న ఆయన… దేశం కంటే రాష్ట్ర జిడిపి చాలా మెరుగ్గా ఉందన్నారు. పశ్చిమ బెంగాల్, కర్ణాటక, మహారాష్ట్ర తర్వాత పెద్ద ఆర్థిక వ్యవస్థ తెలంగాణదేనని స్పష్టంచేశారు. రాష్ట్రం ఏర్పడినప్పడు జిఎస్‌డిపి రూ. 5 లక్షల కోట్లు ఉంటే ప్రస్తుతం 11.54 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. 130 శాతం మేర జిఎస్‌డిపిలో వృద్ధి సాధించామన్నారు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం దేశంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ తెలంగాణ అని పేర్కొన్నదన్నారు. రెండున్నర శాతం జనాభా ఉన్న తెలంగాణ దేశ జిడిపికి 5 శాతం సమకూరుస్తున్నదన్నారు.

ప్రతి ఎకరాకు నీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రం

ప్రతి ఎకరాకు సాగునీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో ఒక్క తెలంగాణే అని మంత్రి కెటిఆర్ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు అయిన కాళేశ్వరాన్ని నాలుగున్నర ఏళ్లలో పూర్తి చేశామన్నారు. కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలను ప్రతి ఎకరాకు నీటిని అందిస్తున్నామన్నారు. దీని ద్వారా వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం అనతి కాలంలోనే ఆకాశమంతా అభివృద్ధి చెందిందన్నారు. ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తులు బాగా పెరిగాయన్నారు. పంజాబ్ కంటే అధికంగా వరి ధాన్యాన్ని పండించామన్నారు. రైతులు, వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం దేశంలో సిఎం కెసిఆర్ తలహాలో ఇప్పటి వరకు ఎవరూ పాటుపడిన దాఖలాలు లేవన్నారు. రైతులకు లబ్ధి జరిగే విధంగా చర్యలు తీసుకోలేదన్నారు. రైతుల పెట్టుబడి కోసం రైతుబంధు కింద సంవత్సరానికి సిఎం కెసిఆర్ ఎకరాకు రెండుసార్లు రూ. 5 వేల చొప్పున ఇస్తున్నారని తెలిపారు. అలాగే నాణ్యమైన కరెంటును కూడా అన్ని రంగాలకు అందించాలన్నారు. వ్యవసాయ రంగంలో మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా మారామని తెలిపారు. మిషన్ భగీరథ పథకాన్ని కేంద్రంతో పాటు చాలా రాష్ట్రాలు కాపీ కొట్టాయని కెటిఆర్ గుర్తు చేశారు. అనేక రాష్ట్రాలకు ఇది ఆదర్శంగా మారిందన్నారు. గత ఏడేండ్లలో రాష్ట్రంలో పచ్చదనాన్ని 24 నుంచి 31 శాతానికి పెంచామని ఆయన పేర్కొన్నారు.

హరితహారం అవార్డులు

హరితహారంలో భాగంగా మెుక్కలు నాటిన సంస్థలకు మంత్రి కెటిఆర్ హరితహారం అవార్డులు అందించారు. ఇప్పటివరకు సిఐఐ ప్రతినిధులు 21.46 లక్షల మొక్కలు నాటారు. ఐటిసి పేపర్ బోట్స్, ప్రగతి రిసార్ట్, కన్హా శాంతివనం, సియంట్, ఐఐటి హైదరాబాద్, బోయినపల్లి కేంద్రీయ విద్యాలయ, డిపిఎస్ స్కూల్స్, హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్ మొక్కలు నాటాయన్నారు.
కాగా అంతకు ముందు రాష్ట్ర ఐటి పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో నైపుణ్యత గల యువతకు ఢోకా లేదన్నారు. వారిలో ఉన్న నైపుణ్యతను మరింతగా సానబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్త శుద్ధితో కృషి చేస్తోదన్నారు. ఇందుకోసం ఇండస్ట్రీస్, ఇండస్ట్రీ బాడీస్‌తో ఇప్పటికే ప్రభుత్వం ఒక ఎంఒయు కుదుర్చుకుందన్నారు. గడిచిన 5 సంవత్సరాల నుండి వివిధ యూనివర్సిటీల్లో అప్రెంటిషిప్ కల్పిస్తున్నామన్నారు. ఆవిష్కరణలు..ఎంటర్ ప్రెన్యూర్స్‌ను ప్రమోట్ చేసేందుకు కొత్త పాలసీలను తీసుకొచ్చామన్నారు. అలాగే దేశంలో వస్తున్న స్టార్టప్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చేయూత అందిస్తోందన్నారు. అందుకే. సిఐఐ నేషనల్ సెంటర్ ఇన్నోవేషన్ సెంటర్‌గా హైదరాబాద్‌ను ఎంచుకుందన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే టిఆర్‌ఎస్ ప్రభుత్వం పరిశ్రమలకు అన్ని రకాలుగా అండగా ఉంటోందన్నారు.

తెలంగాణ ఇన్నోవేషన్ హబ్

తెలంగాణ రాష్ట్రం ఒక్క ఇన్నోవేషన్ హబ్ అని భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్లా వ్యాఖ్యానించారు. ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సాహం అందిస్తోందన్నారు. స్టార్టప్‌లను ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వం అందరి కంటే ముందుంటుందన్నారు. భవిష్యత్‌లో కరోనా వంటి ఎలాంటి సమస్యలు వచ్చిన ఎదుర్కొనేందుకు తెలంగాణ రాష్ట్రం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు వనరులు ,మౌలిక వసతులు కల్పించడంలో ఎంతో సహకారం అందిస్తోందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News